Health

ఇక నోటి ద్వారా ఇన్సులిన్

ఇక నోటి ద్వారా ఇన్సులిన్

మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం ఇన్సులిన్‌ తీసుకోవాలంటే సూది గుచ్చుకోకతప్పదు. ఈ బాధ తీరిపోయే సమయం ఎంతో దూరం లేదు. ఎందుకంటే..హైదరాబాద్‌కు చెందిన నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్‌ ‘సూది అవసరం లేని, నోటి ద్వారా తీసుకునే(ఓరల్‌) ఇన్సులిన్‌ స్ప్రే ‘ఓజులిన్‌’ను’ అభివృద్ధి చేసింది. తద్వారా మధుమేహ చికిత్సలో నొప్పిలేని ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్‌కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించినట్లు నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌; ట్రాన్స్‌జీన్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కె. కోటేశ్వర రావు తెలిపారు. ఇపుడు ఓజులిన్‌పై భద్రతా పరీక్షలను నిర్వహించడానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు కంపెనీ దరఖాస్తు చేసింది. మనుషులపై క్లినికల్‌ పరీక్షలను నిర్వహించడానికి ముందు ఇది తప్పనిసరి. నీడిల్‌ఫ్రీ మాతృ సంస్థే ఈ ట్రాన్స్‌జీన్‌ బయోటెక్‌.

కేన్సర్‌, ఆస్టియోపొరాసిస్‌, అల్జీమర్స్‌లకూ.. స్ప్రేలు!: కేన్సర్‌, ఆస్టియోపొరాసిస్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల చికిత్స నిమిత్తం నోటి ద్వారా, ముక్కు ద్వారా వేసుకునే స్ప్రేలను తీసుకురావడానికీ నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్‌ ప్రయత్నిస్తోంది. ఇందు కోసం వచ్చే కొన్నేళ్లలో 225-250 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1845-2050 కోట్లు) పెట్టుబడులు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్‌ ప్రస్తుతం అభివృద్ధి చేసిన సూదిరహిత, ఓరల్‌ ఇన్సులిన్‌ స్ప్రేను మనుషులతో పాటు జంతువులకూ ఉపయోగించొచ్చు.

ఎలా పనిచేస్తుందంటే..: ప్రపంచవ్యాప్తంగా చాలా బయోఫార్మా కంపెనీలు నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాయి. అయితే సరిపడా ఇన్సులిన్‌ను రక్తంలోకి పంపడంలో పరిమితంగా విజయవంతమయ్యాయి. ఈ విషయంలో నీడిల్‌ఫ్రీ విజయవంతమైందని కోటేశ్వర రావు అన్నారు. ఇటీవల కుక్కలపై నిర్వహించిన పరీక్షల్లో 91 శాతానికి పైగా బయోఅవైలబులిటీని ఓజులిన్‌ ప్రదర్శించిందన్నారు. ఈ ఫలితాలు దీని సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. 2024-25 కల్లా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులకు ఓరల్‌ ఇన్సులిన్‌ స్ప్రేను ఆవిష్కరించాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z