DailyDose

ఏటిఎం సెంటర్ల వద్ద అమాయక ప్రజలే టార్గెట్- నేర వార్తలు

ఏటిఎం సెంటర్ల వద్ద అమాయక ప్రజలే టార్గెట్- నేర వార్తలు

* స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

జవహర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఘటన జరిగింది..సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్య.. ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది. బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏటిఎం సెంటర్ల వద్ద అమాయక ప్రజలే టార్గెట్

ఏటిఎం సెంటర్ల వద్ద అమాయక ప్రజలే టార్గెట్ గా స్మార్ట్ దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు బెజవాడ పోలీసులు. పెద్దగా ఆన్లైన్ పేమెంట్స్ పై అవగాహన లేని పబ్లిక్ నే టార్గెట్ చేసి బురిడీ కొట్టించి వారి వద్దే నగదు దొంగిలిస్తున్నరు ఈ కేటుగాళ్లు. విజయవాడ సిటీ వ్యాప్తంగా వివిధ ఏటిఎం సెంటర్ల వద్ద కాపు కాస్తు అక్కడికి వచ్చే అమాయకులని టార్గెట్ చేసి.. వారి దృష్టిని మళ్లించి, నగదు కాజేస్తున్నారు ఈ ఇద్దరు .ఏటిఎం సెంటర్ల వద్దకు నగదు డ్రా చెయ్యటానికి వచ్చే వారికి మా ఎటిఎం కార్డు పనిచేయడం లేదని డబ్బులు చాలా అత్యవసరం అని నమ్మిస్తారు. నాలుగు కాకమ్మ కబుర్లు చెప్పి లిక్విడ్ క్యాష్ ఇస్తే phone pay/ paytm చేస్తాం అంటారు. spoof paytm అనే ఒక ఆండ్రాయిడ్ అప్ ద్వారా తప్పుడు ట్రాన్సక్షన్ స్టేట్మెంట్ సృష్టించి అది చూపించి వారి దగ్గర డబ్బు తీసుకుని ఆన్లైన్ లో పేమెంట్ చేశాం అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతారు.ఈ విధంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో అమాయకులని టార్గెట్ చేసి సుమారు 40 ATM సెంటర్ల వద్దరూ.  5 లక్షల వరకు సొమ్ము కొట్టేశారు. దీనిపై వరుస ఫిర్యాదులు రావటంతో ఫోకస్ పెట్టిన సిటీ పోలీసులు ఇద్దరినీ ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దేవనపల్లి సాయి కళ్యాణ్, షేక్ చాంద్ పాషా లను రామవరప్పాడురింగ్ వద్ద అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి రూ.20,000/- నగదు రెండు స్మార్ట్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.  వీరిపై గతంలో మొత్తం 6 దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించారు. కనుక తమకు తెలియని వ్యక్తుల పట్ల.. పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా ఏటీఎం సెంటర్ల వద్ద అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు పోలీసులు.

రుద్రంగిలో మండల కేంద్రంలో క్షుద్రపూజల కలకలం

 రుద్రంగి మండల కేంద్రంలో క్షుద్రపూజల కలకలం స్థానికంగా చర్చనీయం అయింది. వివరాలోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన పిల్లమారపు గంగస్వామి అనే వ్యక్తికి చెందిన ఇంటి గడపలో బొట్టు, పసుపు, తాయిత్తు కట్టిన కొబ్బరికాయను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళారు. దీంతో గంగస్వామి కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు భయాందోళనలకు గురైయ్యారు. గంగస్వామి భార్య మాట్లాడుతూ.. ఎవరో కావాలని క్షుద్రపూజలు చేసిన కొబ్బరికాయ, నిమ్మకాయలు మా ఇంటి ముందు వదిలి వెళ్ళారన్నారు.గతంలో కూడా పలుమార్లు ఇలానే చేశారన్నారు. భయందోళనకు గురై ఇల్లు వదిలి వెళ్ళి కొరుట్ల పట్టణంలో నివాసముంటుండగా ఇటీవలే స్వంత ఇంటికి వచ్చామని, మళ్ళీ ఇలానే చేస్తున్నారని రోదిస్తూ తెలిపారు. గతంలో జరిగిన సంఘటనకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పైగా నీవే కావాలని చేస్తున్నావని గతంలో పని చేసిన ఎస్ఐ అన్నారని తెలిపారు. చివరికి ఇల్లు వదిలి వేరే చోట అద్దెకు ఉన్న అక్కడ కూడా అదే పరిస్థితి అని రోదిస్తూ తెలిపారు. తమ బాధను పట్టించుకొని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

* శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మృతులు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం డార్జిలింగ్‌కు చెందిన రంజనా రాయ్‌, తాషి షేర్పాగా  పోలీసులు గుర్తించారు.సికింద్రాబాద్‌ నుంచి షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ (Shalimar Express) లో పలాసకు వచ్చిన వీరిద్దరూ ట్రాక్‌పై పడుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మృతదేహాలను జీఆర్పీ పోలీసులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి, యువకుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును డీకొట్టింది. ఈఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గిరిదిహ్‌ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం వెలుగుచూసింది.బాధితులంతా థోరియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శుక్రవారం తికోడిహ్‌ ప్రాంతంలో పెళ్లికి హాజరయ్యారు. అక్కడే భోజనం చేసి రాత్రి స్కార్పియో వాహనంలో ఇంటికి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బాగ్మారా గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది.గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాద స్థలంలోనే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అయిదుగిరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి అస్థికలు కలిపేందుకు వెళ్లి అన్న దమ్ములు మృతి

తండ్రీ మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. తండ్రి అస్థికలు పోచారం ప్రాజెక్ట్‌లో కలిపేందుకు వచ్చిన అన్న దమ్ములు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందిన విషాద సంఘటన హవేలీ ఘనపూర్ మండలం పోచారం డ్యాంలో శనివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఇమామ్ తండాకు చెందిన కిషన్ ఇటీవల మృతి చెందాడు. మృతి చెందిన తండ్రి అస్థికలు పోచారం డ్యాం లో కలిపేందుకు శంకర్ కుమారులు చౌహాన్ హరి సింగ్ (45) బాల్ సింగ్(42)లు ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు.డ్యాంలో దిగి అస్థికలు కలిపే క్రమంలో ప్రమాద వశాత్తూ ఒకరు నీట మునగగా కాపాడేందుకు మరొకరు వెళ్ళారు. దీనితో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించాడు. ఒకే కుటుంబంలో ఇద్దరూ మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. తండ్రీ మృతి నుంచి ఆ కుటుంబం ఇంకా తెరుకొక ముందే ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో పలువురు కంట తడిపెట్టారు.

మాజీ మంత్రి శివసేన నేత ఆదిత్య థాక్రేపై కేసు నమోదు

 మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత ఆదిత్య థాక్రేపై (Aaditya Thackeray) మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదుచేశారు. ముంబైలోని (Mumbai) లోయర్‌ పరేల్‌లో డెలిస్లే బ్రిడ్జి (Delisle Bridge) రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప్రారంభించారు. దీంతో అనుమతి లేకుండా బ్రిడ్జిని ప్రారంభించారని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) ఆయనపై ఫిర్యాదు చేసింది. థాక్రేతోపాటు సునీల్‌ షిండే, సచిన్‌ అహిర్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌చేశారు. దక్షిణ ముంబై, లోయర్‌ పరేల్‌ను కలుపుతూ డెలిస్లే బ్రిడ్జ్‌ను బీఎంసీ నిర్మించింది. ఇందులో కొంత భాగాన్ని గత జూన్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండో విడుతలో కర్రీ రోడ్‌, లోయర్‌ పరేల్‌ను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జిని సెప్టెంబర్‌లో ప్రారంభించారు.

భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే.. అయితే ప్రస్తుత కాలంలో చిన్న చిన్న గొడవలకే భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాం. మరికొంతమంది అయితే ఏకంగా బలమన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి ఘటనే   గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కలకాలం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకున్నారు. కానీ బయటకు వెళ్ల వద్దని చెప్పినా భర్త వెళ్లాడని ఏకంగా ఓ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.అతని పేరు నాగూర్ భాషా.. ఆమె పేరు జోత్న్స.. వీరివురూ కల్యాణి నగర్ లో నివస్తున్నారు. ఇద్దరూ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. వృత్తిలో భాగంగా ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో ఐదు నెలల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు.  ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఒక చిన్న ఘటన ఇద్దరి జీవితాల్లోనూ తీరని శోకాన్ని మిగిల్చింది. బుధవారం ఇంటిలో నుండి బయటకు వెళ్లివస్తానని భాషా భార్య జోత్న్సకు చెప్పాడు. అయితే జోత్న్స ఈ రోజు ఇంటిలో నుండి బయటకు వెళ్లవద్దని చెప్పింది. అయితే భాషా తనకు పనుందని బయటకు వెళ్లి వస్తానని పట్టుబట్టాడు. భార్య వద్దంటున్న వినకుండా బయటకు వెళ్లాడు. దీంతో జోత్న్స తీవ్ర మనస్థాపానికి గురైంది.బయటకు వెళ్లిన నాగూర్ భాషా సాయంత్రం వరకూ ఇంటికి రాలేదు. ఈ క్రమంలోనే జోత్స్న తల్లి ఫోన్ చేసింది. అయితే జోత్న్స ఫోన్ తీయలేదు. అనుమానం వచ్చిన ఆమె వెంటనే అల్లుడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో నాగూర్ భాషా ఉరుకులు, పరుగులతో ఇంటికి వచ్చాడు. తలుపు కొట్టిన తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికులతో కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు.అప్పటికే జోత్స్న ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించనట్లు వైద్యులు చెప్పారు. చిన్న విషయానికే జోత్స్న ఆత్మహత్య చేసుకోవడాన్ని అటు భర్త నాగూర్ భాషా, ఇటు జోత్న్స తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z