DailyDose

గవర్నర్‌కు బీజేపీ నేత ఫిర్యాదు-తాజా వార్తలు

గవర్నర్‌కు బీజేపీ నేత ఫిర్యాదు-తాజా వార్తలు

* అంగన్వాడీలకు సర్కార్ భారీ షాక్

 తెలంగాణ రాష్ట్రం కంటే కనీసం వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామని చెప్పిన సీఎం జగన్.. హామీ ఇంకా నెరవేర్చలేదని అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ఏపీలో సమ్మె చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా కూడా గత నాలుగేళ్లుగా జీతాలు పెంచలేదని, రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్లు డీఏ కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తెగేసి చెబుతున్నారు.దీనిపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ స్పందించింది. ‘‘అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచాం. అలాగే రిటైర్‌మెంట్ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. గతంలో తెలంగాణకు సమానంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంటనే వేతనాలను రూ.11,500కు పెంచాం. అలాగే పదోన్నతి వయసును కూడా పెంచాం. ఈ సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. కానీ అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదు.’’ అని మంత్రి ఉష శ్రీ చరణ్ అంగన్వాడీలకు క్లారిటీ ఇచ్చారు.

గవర్నర్‌కు బీజేపీ నేత ఫిర్యాదు

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత రఘునందన్‌ రావు కలిశారు. భారాస కండువా వేసుకొని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ వెంకటయ్య ఎన్నికల ప్రచారం చేశారని గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల మీడియాతో రఘునందన్‌ మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఎన్నికల ప్రచారం చేసిన బక్కి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. తప్పకుండా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.

చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు

చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి.. దళితులపై చంద్రబాబు అమానుషంగా కేసులు పెట్టారు అని మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.. అయితే, చంద్రబాబు అమానుషంగా పెట్టిన కేసులను సీఎం వైఎస్‌ జగన్ ఎత్తేశారని గుర్తుచేశారు. ఇక, చంద్రబాబుకు మతిస్థిమితం లేదు.. ఇది ఎప్పటి నుంచో చెపుతున్నాం. నిన్న చంద్రబాబు రాష్ట్రంలో 7 వేల కోట్ల క్రైస్తవ ఆస్తులు కాజేస్తున్నామని ఆరోపించారు.. అసలు మా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. క్రైస్తవ ఆస్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబు, టీడీపీ నేతలని విమర్శించారు. రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారు.. గుంటూరు, విజయవాడలో ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో చూపిస్తాం అంటూ సవాల్‌ చేశారు.ఎన్నికలు వస్తున్నాయని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. చంద్రబాబు ఓ గజదొంగ.. మా మీద దాడులు, అఘాయిత్యాలు చేయించారని విరుచుకుపడ్డారు నాగార్జున.. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.. క్రైస్తవ ఆస్తులుపై చర్చకు సిద్ధం అంటూ ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు.. అయితే, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. దళితుల మద్దతు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఎందరు కలిసి వచ్చినా గెలిచేది వైసీపీయే.. మరోసారి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మంత్రి మేరుగు నాగార్జున.

*  పోస్టింగుల్లో రికమెండేషన్ లెటర్స్

 పోలీసులు పోస్టింగ్స్‌లపై సీపీ స్పందించారు. రికమెండేషన్ లెటర్స్ తెచ్చి సిబ్బంది పోస్టింగ్ అడిగితే ఎవ్వరికీ ఇవ్వబోమని సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి తెలిపారు. సమర్థవంతమైన అధికారిని మాత్రమే విధుల్లో ఉంచుతామన్నారు. పోస్టింగ్ విషయంలో రాజకీయాలు ఉండకుండా చూస్తామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, నేరాల్లో పాల్గొన్న ఎనిమిది సిబ్బందిపై కేసులు నమోదు చేశామన్నారు. 7 మందిని సర్వీస్ నుంచి సస్పెండ్ అయ్యారన్నారు. మరో 50 మందిపై విచారణ కొనసాగుతోందన్నారు.

వైకాపా ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చింది!

రైతు భరోసా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వీటి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రూ.2,300 కోట్లు నిధులు తీసుకొచ్చిందన్నారు. కానీ, గడిచిన ఐదేళ్లలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు కేవలం రూ.156 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నాదెండ్ల తెలిపారు. చాలా కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని అన్నారు. వీటికి గత ఏడాది నుంచి అద్దెలు కూడా చెల్లించకుండా భవన యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కేవలం దళారులకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే వీటిని ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించారు. తుపానుల సమయంలో రైతులను ఆదుకోవాల్సిన భరోసా కేంద్రాలు చేతులెత్తేయడంతో ఇబ్బందులు పడుతున్నారని మనోహర్ చెప్పారు. ఈ కేంద్రాలలో రైతులకు ఎక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.

ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా !

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి స్పష్టం చేశారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని అధిష్టానం చెప్పిందని, మళ్ళీ పోటీ చేసి గెలవడం ఖాయమని అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో రాజమండ్రి రూరల్‌కి వెళ్ళానని వివరణ ఇచ్చారు.నాకు ఎక్కడ సీటు ఇచ్చినా గెలిచి తీరుతానని బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో టిక్కెట్లు మార్పులు చేర్పులను తీవ్రంగా విమర్శించారు. ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా అంటూ మంత్రుల స్థానచలనంపై వ్యాఖ్యానించారుఈ తప్పు అభ్యర్థులుది కాదు జగన్ దేనని, రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు.

లారీ డ్రైవర్లకు గుడ్ న్యూస్

పొద్దస్తమానం డ్రైవింగ్ చేసే లారీ డ్రైవర్లకు ఒడిశా ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారికి రాత్రి వేళల్లో ఉచితంగా టీ అందించాలని రవాణా శాఖ నిర్ణయించింది. సరుకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేకుండా డ్రైవింగ్ చేస్తారని, అలాంటి టైంలో రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి టుకుని సాహు వెల్లడించారు. ఈ క్రమంలో దాబాలు, హోటళ్లలో వారికి ఫ్రీగా టీ అందించి.. కాసేపు విశ్రాంతి తీసుకునేలా ఏర్పా్ట్లు చేశామని తెలిపారు. అలాగే 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని చెప్పారు.

* ఏపీ ఒక్కటే 11.6శాతం అప్పులు చేసింది!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక చెప్పిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్‌ అన్నారు. అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం మన దేశంలోనే టాప్‌-3లో ఉన్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయకుమార్‌ మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఆర్‌బీఐ ద్వారా చేసిన రుణాలు 88.4 శాతమైతే.. ఏపీ ఒక్కటే 11.6శాతం అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘‘ విద్యారంగంలో తెదేపా హయాం కంటే వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఖర్చుపెట్టేది తక్కువ. బడ్జెట్‌లో విద్యారంగం అభివృద్ధికి ఖర్చు చేసింది 11.7 శాతమే. ఈ కేటాయింపుల్లో ఏపీ 24వ స్థానంలో ఉంది. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు నిధులు ఇవ్వడం లేదు. వైద్య రంగంలో మూడేళ్లుగా బడ్జెట్‌లో 5.6 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు. వైద్య రంగంలో ఎక్కువ బడ్జెట్‌ ఖర్చు చేసే రాష్ట్రాల్లో ఏపీ 18వ స్థానంలో ఉంది’’ అని విజయకుమార్‌ తెలిపారు. మౌలిక వసతులకు గతేడాది పెట్టిన ఖర్చు రూ.16వేల కోట్లేనని చెప్పిన ఆయన..  కేటాయింపుల్లో 15వ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 33.5 శాతం కాగా.. రాష్ట్ర ఆదాయంలో 13.9శాతం వడ్డీకే సరిపోతోందని ఆయన వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z