Politics

హైదరాబాద్‌లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ మహాసభలు

హైదరాబాద్‌లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ మహాసభలు

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జేఎన్‌టీయూహెచ్‌ వేదికగా వచ్చే ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు ఇటీవల జేఎన్‌టీయూహెచ్‌ని సందర్శించి ఇక్కడ మహాసభల నిర్వహణకు అంగీకరించారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ 1914 నుంచి ఏటా ఈ మహాసభలు నిర్వహిస్తోంది. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం(డీఎస్‌టీ) కొంతవరకు నిధులు ఇవ్వనుంది. సాధారణంగా సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఒకవేళ స్వయంగా హాజరు కావడం వీలుకాకుంటే ఆన్‌లైన్‌లోనైనా పాల్గొంటారు. ఈసారి ప్రధాని మోదీ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది.

దేశవిదేశాల నుంచి శాస్త్రవేత్తల హాజరు
సైన్స్‌ కాంగ్రెస్‌కు దేశ, విదేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరవుతారు. విదేశాల నుంచి పలువురు నోబుల్‌ బహుమతి గ్రహీతలు కూడా రానున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో మహాసభలు ప్రారంభమయ్యే ఫిబ్రవరి 23న 5 వేల నుంచి 7 వేల మంది హాజరు కావొచ్చని అంచనా. ఫిబ్రవరి 22న అసోసియేషన్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మూడు రోజులు సదస్సులు, చర్చలు జరుగుతాయి. 26వ తేదీన సంఘం సర్వసభ్య(జనరల్‌ బాడీ) సమావేశం నిర్వహిస్తారు. అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి మంగళవారం ప్రాంగణంలో పర్యటించి.. మహాసభలకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. సభల నిర్వహణకు ఒకట్రెండు రోజుల్లో ముగ్గురు కన్వీనర్లను నియమిస్తారు. హైదరాబాద్‌లో అన్ని సదస్సులు నిర్వహించే అవకాశం లేకుంటే.. కొన్నింటిని సంగారెడ్డి సమీపంలోని సుల్తాన్‌పూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరపాలని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఏడోసారి..
హైదరాబాద్‌లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ మహాసభలు గతంలో 1937, 1954, 1967, 1979, 1998, 2006లలో జరిగాయి. 17 ఏళ్ల తర్వాత మరోసారి భాగ్యనగరం వేదిక కానుంది. ఏపీలో 1983లో తిరుపతి, 2008లో విశాఖపట్నం, 2017లో తిరుపతిలో నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z