Business

ప్రయాణికులకు నూతన సంవత్సరం వేళ షాక్‌ ఇచ్చిన ఆర్టీసీ

ప్రయాణికులకు నూతన సంవత్సరం వేళ షాక్‌ ఇచ్చిన ఆర్టీసీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు నూతన సంవత్సరం వేళ ఆర్టీసీ షాక్‌ ఇచ్చింది. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పూర్తి టికెట్‌ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. కొద్దివారాల క్రితం వరకు రహదారులపై ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎదురుచూసింది. బస్సుల్లో సీట్లు నిండటం కోసం ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టడం వంటి పలు ప్రయోగాలకు తెరదీసింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) 69 నుంచి 89కి అంటే 20 శాతం పెరిగింది. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది.

సమయం పడుతోంది…ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీకి కండక్టర్లకు సమయం పడుతోందని, అందుకే ఈ టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సోమవారం నుంచి ఈ టికెట్ల జారీ ఉండదని స్పష్టంచేశారు. ‘ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్‌ చూడాలి. వారి వయసు నమోదుచేయాలి. దీంతో ఈ టికెట్ల జారీ సమయం కూడా పెరుగుతోంది. అందుకే ఉపసంహరిస్తున్నాం’ అని వివరించారు. రూ.300 చెల్లించి ఫ్యామిలీ-24 టికెట్‌ కొంటే.. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు హైదరాబాద్‌లో 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉండేది. టీ-6 టికెట్‌కు రూ.50 చెల్లించి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అంటే ఆరు గంటల పాటు హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఇన్నాళ్లు అమలైంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z