Business

రూపే ప్రత్యేక ఆఫర్‌-వాణిజ్య వార్తలు

రూపే ప్రత్యేక ఆఫర్‌-వాణిజ్య వార్తలు

ఆర్బీఐ నేడు ఓ ప్ర‌క‌ట‌న 

ఆర్బీఐ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. రూ.2000 క‌రెన్సీ నోట్లు(Rs.2000 Notes) డిసెంబ‌ర్ 29వ తేదీ వ‌ర‌కు 97.38 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ చెప్పింది. 2023, మే 19వ తేదీన లావాదేవీలు మూసివేసిన స‌మ‌యంలో.. సుమారు 3.56 ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే రెండు వేల నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయి. డిసెంబ‌ర్ 29వ తేదీ వ‌ర‌కు 9,330 కోట్లు ఇంకా చెలామ‌ణిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే 2023 మే 19వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న రెండు వేల నోట్ల‌లో 97.38 శాతం నోట్లు బ్యాంకుల వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. 2000 క‌రెన్సీ నోట్లకు ఇంకా లీగ‌ల్ గుర్తింపు ఉన్న‌ద‌ని ఆర్బీఐ వెల్ల‌డించింది.నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ప్ర‌వేశ‌పెట్టిన 2000 నోట్ల‌ను .. 2023లో బ్యాంకులు వెన‌క్కి తీసుకోవ‌డం ప్రారంభించాయి. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7వ తేదీవ‌ర‌కు అన్ని బ్యాంకుల్లో రెండు వేల నోట్ల‌ను డిపాజిట్ చేశారు. అక్టోబ‌ర్ 9వ తేదీ నుంచి ఆర్బీఐ ఆఫీసుల్లో ఆ నోట్లను తీసుకుంటున్నారు. కొంద‌రు త‌మ వ‌ద్ద ఉన్న రెండు వేల నోట్ల‌ను ఇండియా పోస్టు ద్వారా ఇంకా పంపుతున్నారు. బ్యాంక్ అకౌంట్లోలో వారివారి మొత్తాన్ని జ‌మ చేస్తున్న విష‌యం తెలిసిందే.

రూపే ప్రత్యేక ఆఫర్‌

ప్రముఖ ఆర్థిక సంస్థ రూపే కొత్త సంవత్సరం వేళ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. యూపీఐతో లింక్‌ చేసిన క్రెడిట్‌ కార్డులతో చేసిన లావాదేవీలపై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. డిసెంబర్‌ 30 నుంచే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌ ఈరోజు (2024 జవనరి 1) ముగియనుంది. కనీసం రూ.7,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ మొత్తం కస్టమర్ల ఖాతాలో 30 రోజుల్లోపు క్రెడిట్‌ అవుతుంది. దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌, ట్రావెల్‌, జువెలరీ, ఎయిర్‌లైన్స్‌, హోటల్స్‌, డైనింగ్‌ కేటగిరీలపై చేసే వ్యయాలకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఈ ఏడాదిలో రాబోతున్న 5-డోర్ థార్‌ వెర్షన్‌!

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా నుంచి గతంలో విడుదలైన థార్ మోడల్ భారీగా కస్టమర్ల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. 3 డోర్లతో విడుదల అయిన ఇది మార్కెట్లో ఎక్కువ అమ్మకాలను అందుకుంది. దీంతో కంపెనీ ఇదే థార్‌లో 5-డోర్ వెర్షన్‌ను ఈ ఏడాదిలో విడుదల చేయాలని చూస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈ మోడల్ ఇండియా వ్యాప్తంగా అమ్మకానికి ఉంటుంది. ఇటీవల ఆన్‌లైన్లలో లీక్‌ అయిన ఫొటోల ప్రకారం, ఇది 3 డోర్ వెర్షన్ కంటే మరింత పెద్దదిగా ఉంటుందని తెలుస్తుంది.అలాగే, 5-డోర్ వెర్షన్‌ లోపల 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ముందు బలమైన సీట్లు, రెండవ వరుసలోని సీట్లు కూడా సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు, వెనక సీట్లకు సైతం మరింత మెరుగ్గా AC గాలి వెళ్లేలా అడ్జస్ట్‌మెంట్, సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే, దీనిలో 130 BHP పవర్, 300 Nm టార్కును ఉత్పత్తి చేసే 2.2-లీటర్ డీజిల్, 150 BHP పవర్, 300-320 Nm టార్కును ఉత్పత్తి చేసే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఈ రెండు కూడా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

* స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

కొత్త ఏడాది తొలిరోజు సోమవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరిన స్టాక్ దేశీయ బెంచ్‌ మార్కె సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లేకపోవడం.. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్‌ 72,218 పాయింట్ల ప్రారంభమైంది. ఆ తర్వాత 72,031 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత కోలుకొని 72,561 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. సెన్సెక్స్‌ గరిష్ఠానికి చేరుకోవడంతో మదుపరులు లాభాల స్వీరణకు మొగ్గుచూపారు. ఈ క్రమంలో సెన్సెక్స్‌ తీవ్ర ఒత్తిడికి గురైంది.చివరకు 31.68 పాయింట్ల లాభంతో 71,271.94 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10.50 పాయింట్ల లాభంతో 21,741.90 వద్ద స్థిరపడింది. దాదాపు 2,453 షేర్లు పురోగమించగా.. 1,298 షేర్లు పతనమయ్యాయి. 147 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో నెస్లే ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, విప్రో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టపోయాయి. హెల్త్‌కేర్, పీఎస్‌యూ బ్యాంక్ ఒక్కొక్కటి 0.5 శాతం పెరగ్గా.. బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి.

2024లో మనకు లభించే గొప్ప అవకాశం ఇదే

చైనా  సరఫరా గొలుసు (supply-chain) ఆధిపత్యాన్ని సవాల్‌ చేసేలా భారత్‌  నిలవడం ఈ ప్రపంచానికి అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2024లో మనకు లభించే గొప్ప అవకాశం ఇదేనన్నారు. ఇక, ఈ ఏడాది మన దేశానికి పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం (New Year 2024) సందర్భంగా ఇచ్చిన సందేశంలో మహీంద్రా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.‘‘జనవరి 1 అంటే కేవలం క్యాలెండర్‌లో మారే తేదీ మాత్రమే కాదు. ఇది చాలా ప్రత్యేకం. కొత్త ఆరంభానికి చిహ్నం. గతేడాది ఎంత చీకటిగా గడిచినా.. భవిష్యత్తు కోసం ఆశాజనకంగా ఉండే సామర్థ్యం మనకు ఉంది. 2023.. యుద్ధాలు, వాతావరణ మార్పుల సంవత్సరంగా నిలిచింది. కొత్త ఏడాదిలో వాటి నుంచి బయటపడి పునరుజ్జీవం కోరుకుంటూ 2023కు ప్రపంచం ముగింపు పలికింది. అలాంటి ఆశావహ దృక్పథానికి ఈ కొత్త ఏడాదిలో తొలి రోజు సరికొత్త అవకాశం కల్పిస్తుంది. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది’’ అని మహీంద్రా రాసుకొచ్చారు.ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వేదికపై మనకున్న అవకాశాల గురించి మహీంద్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్‌ చేసేలా భారత్‌ ప్రత్యామ్నాయంగా మారడం ఈ ప్రపంచానికి అవసరం. ఈ కొత్త ఏడాదిలో మనకు వచ్చిన గొప్ప అవకాశమిది. భారత్‌ తయారీ రంగం అద్వితీయ ఘనత సాధించే అవకాశం మనపైనే ఆధారపడి ఉంది. దాన్ని మనం రెండు చేతులతో ఒడిసిపట్టుకోవాలి. తయారీ, ఎగుమతులు పెరిగితే వినియోగ రంగం కూడా విస్తరిస్తుంది’’ అని మహీంద్రా వెల్లడించారు.గతేడాది అనేక సవాళ్లను దాటుకుని భారత్‌ అసాధారణ విజయాలను నమోదు చేసిందని ఆనంద్‌ మహీంద్రా కొనియాడారు. ఈ కొత్త ఏడాదిలోనూ మనం మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. 2024లో మన దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.