DailyDose

కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్-తాజా వార్తలు

కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్-తాజా వార్తలు

* టీడీపీకి మరో షాక్

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక కసరత్తులో వైసీపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. కేశినేని నాని అనుచరుడు, తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. టీడీపీ మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్‌ వైసీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చారు.స్వామి దాస్‌తో పాటు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ వచ్చారు. ఇదిలా ఉండగా.. టీడీపీలో చేరేందుకు తిరువూరు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణ నిధి సన్నద్ధం అవుతున్నారు. 1994, 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా స్వామి దాస్ గెలిచారు. అనంతరం 2004, 2009, 2014లో వరుసగా మూడు సార్లు స్వామి దాస్ ఓటమి పాలయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి అనుచరుడిగా ఉన్న నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు స్థానాన్ని కేటాయించాలని కేశినేని నాని వైసీపీ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. కేశినేని టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నల్లగట్ల స్వామిదాస్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.

* కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్

తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ రక్తం చిందించలేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించి జైల్లో శిక్షలు అనుభవించారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో పెట్టే వారమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అనంతరం.. తీగల గుట్టపల్లి వద్ద రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని కోరారు. అధికారులు మాత్రం లేదంటూ నీళ్లు నమిలారు. మరోవైపు.. భూసేకరణ సమస్యను ప్రస్తావించిన ఆర్ అండ్ బీ అధికారులపై మండిపడ్డారు. ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని బండి సంజయ్ నిలదీశారు. భూసేకరణ సాకుతో పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఆర్వోబీ పనులు జరుగుతున్న చోట రోడ్లు కొట్టుకుపోయి దుమ్ము, ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతు చేయాలని ఆదేశించారు.మరోవైపు.. ఇక్కడకు ఆర్వోబీ కాంట్రాక్టర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ మండిపడ్డారు. పనుల్లో నాణ్యత లోపిస్తున్నా.. ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం చేశారు. నిర్ణీత వ్యవధిలో ఆర్వోబీ పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నాసిరకం పనులు చేస్తే కాంట్రాక్టర్ ను వదిలేపెట్టే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. పనుల విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాల్సిందేనని వెల్లడించారు. ఆర్వోబీ నిధులన్నీ కేంద్రానివేననే సంగతిని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ చెప్పారు.

* జగన్ కీలక నిర్ణయం

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ ఇంచార్జి మార్పుపై పంచాయితీ కొనసాగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గం ఇంచార్జిని మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లావు శ్రీకృష్ణదేవరాయులతో మాట్లాడారు. నరసరావుపేట లోక్‌సభ నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇందుకు లావు శ్రీకృష్ణదేవరాయులు ససేమీరా అంటున్నారు. నరసరావుపేట నుంచి ఎంపీగానే తనకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌కే తెలిపారు. కానీ సీఎం జగన్ మాత్రం నరసరావుపే ఎంపీ బరిలో బీసీ నేతను దించితే గెలిచే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ స్థానానికి బీసీ నేత నాగార్జునను బరిలో దించే యోచనలో ఉన్నారట.మరోవైపు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం నరసరావుపేట లోక్‌సభ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులనే కొనసాగించాలని కోరుతున్నారు. కొత్త ఇంచార్జిని నియమిస్తే నాలుగైదు నియోజకవర్గాల్లో పరిస్థితులు మారతాయని, తద్వారా తమకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. గురుజాల, నరసరావుపేట, పెద్దకూర పాడు, మాచర్లలో నాయకులు, కార్యకర్తలతో లావు శ్రీకృష్ణదేవరాయులకు మంచి సంబంధాలు ఉండటంతో పలు సేవా కార్యక్రమాలు చేయడంతో మరోసారి గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. గుంటూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనను వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ఇప్పటికే సీఎంవోకు కూడా చెప్పారు. అయితే గుంటూరు నుంచి లావును బరిలో దించాలని అధిష్టానం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకు ఆయన అనాసక్తి చూపుతున్నారు. మరి ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో సీఎం జగన్ నరసరావుపేట విషయంలో వెనక్కి తగ్గుతారేమో చూడాలి.

* అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకోలేదు

గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించినప్పటికీ ఆ ప్రాంతాల్లోనూ ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వలేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. ఆ అంశాలపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకోలేదని.. అందుకే ఇష్టారీతిన హామీలు ఇచ్చారన్నారు.కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నేతలను కూడా ప్రజలు కూడా తిరస్కరించారని కేటీఆర్‌ అన్నారు. భారాస హయాంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదని ప్రత్యర్థులు విమర్శలు చేశారని.. తొమ్మిదిన్నరేళ్లలో 6,47,479 ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 73 శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచామని, ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని.. పనులు కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే గెలిచే వాళ్లమని వ్యాఖ్యానించారు.వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఏనాడూ ప్రజలను లైన్‌లో నిలబెట్టలేదన్నారు. వారి సౌకర్యం చూశామే తప్ప రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదని, భారాసకు మూడో వంతు సీట్లు వచ్చాయని చెప్పారు. స్థానిక సంస్థలు మొదలు అసెంబ్లీ వరకు బలమైన నాయకత్వం ఉందని.. అన్నింటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఉన్నారని చెప్పారు. పార్టీ సమావేశాలను వరుసగా నిర్వహిస్తామని, అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని వివరించారు.

* కాంగ్రెస్‌లో షర్మిలకు ఇచ్చే బాధ్యత ఇదే

కేంద్రంలోని మోడీ సర్కార్‌, రాష్ట్రంలోని జగన్‌ సర్కార్‌లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశాయని ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్ ఠాకూర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు 25 ఎంపీ స్థానాలు వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలను సాకారం చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను పట్టి పీడిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం అని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరూ ఆనందంగా జీవిస్తారని భరోసా ఇచ్చారు.

* హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీ

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుస కట్టాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది.

* మేనిఫెస్టోపై జనసేన ఫోకస్

జనసేన పార్టీ ఏపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే హామీలపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు మేనిఫెస్టోను రూపొందించేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో అంశంపై ప్రతిపాదనలు తెలిపాలని సూచించారు. దీంతో అమరావతిలో గురువారం ఈ కమిటీ భేటీ అయింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. మేనిఫెస్తో కమిటీ సభ్యులు గుత్తా శశిధర్, వరప్రసాద్, శరత్‌తో పలు అంశాలపై నాదెండ్ల చర్చించారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపైనా చర్చించారు. ప్రజలకు నచ్చేలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా గతంలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేశారు. టీడీపీ 6 అంశాలను ప్రస్తావించగా.. జనసేన ఐదు అంశాలను ప్రతిపాదించింది. దీంతో 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో‌ను రూపొందిచాలని నిర్ణయించారు. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి ఆ తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామని నేతలు పేర్కొన్నారు.అయితే తాజాగా జనసేన అంశాలను మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా జనసేన మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మేనిఫెస్టో, జనసేన అంశాలపై చర్చించారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. అంశాలపై తుది నిర్ణయాన్ని అధినేత పవన్‌కు వదిలేసినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పుర రాజకీయం మలుపు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పుర రాజకీయం మలుపు తిరిగింది. 21 మంది కౌన్సిలర్లు భారాస(BRS)కు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 19 మంది సంతకాలు చేసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. సంతకాలు చేయనప్పటికీ వైస్‌ ఛైర్మన్‌ సుదర్శన్‌తో పాటు 14వ వార్డు కౌన్సిలర్‌ బొడ్డు నారాయణ సైతం రాజీనామాకు అంగీకరించినట్లు తెలిసింది.వారం క్రితం భారాసకు చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి తరలి వెళ్లారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వీటిలో ఒక వార్డు కౌన్సిలర్‌ గతంలో మృతి చెందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 11 మంది, భాజపాకు ఒకరు మద్దతు ఇస్తున్నారు. భారాసకు చెందిన 21 మంది రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z