DailyDose

కొత్త మండలాల ఏర్పాటుకు కొనసాగుతున్న ఆందోళనలు

కొత్త మండలాల ఏర్పాటుకు కొనసాగుతున్న ఆందోళనలు

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తేవడంతో కరీంనగర్ జిల్లాలో కలవబోయే మండలాలపై చర్చ జోరందుకుంది. గతంలో తమను పక్క జిల్లాల్లో కలిపారని ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్న కొన్ని మండలాల ప్రజలకు సర్కార్ చేస్తున్న ఆలోచన ఊరటనిస్తోంది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ హయాంలో 2016లో జిల్లాల పునర్విభజన చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంలో కొన్ని మండలాలు, నియోజకవర్గాలను అశాస్త్రీయంగా, ప్రజల అభీష్టానికి విరుద్దంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాలో కలిపారని ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ సారైనా ప్రజాభీష్టాన్ని పరిగణనలోకి తీసుకుని జిల్లాల్లో కలపాలనే డిమాండ్ వినిపిస్తోంది. అలాగే కొత్త మండలాల డిమాండ్లు కూడా మళ్లీ ఊపందుకుంటున్నాయి.

కరీంనగర్ లోకి హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట బెజ్జంకి మండలాలు ?

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హస్నాబాద్ నియోజకవర్గంలోని హస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను సిద్ధిపేట జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హనుమకొండ జిల్లాలో ప్రభుత్వం చేర్చింది. అలాగే మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాన్ని సిద్ధిపేట జిల్లాలో కలిపింది. కరీంనగర్ జిల్లా నుంచి తమను వేరు చేయడంపై హస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల ప్రజలు అప్పట్లో ఆందోళనకు దిగారు.

సిద్ధిపేటతో పోలిస్తే కరీంనగర్ జిల్లా కేంద్రమే తమకు అందుబాటులో ఉంటుందని, కరీంనగర్ తో తమకు ఎన్నో ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని ఇలా తెంచడం సరికాదంటూ ధర్నాలకు దిగినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోకి హస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను తిరిగి కలుపుతామని కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ ప్రచారంలో ప్రకటించారు.

అలాగే బెజ్జంకి మండలాన్ని సిద్ధిపేట నుంచి కరీంనగర్ లో కలుపుతామని రేణికుంటలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి కావడంతో ఆయా మండలాల ప్రజల ఆశలు చిగురించాయి. ఇటీవల డిసెంబర్ 23న ప్రీక్రిస్మస్ వేడుకల్లోనూ కరీంనగర్ లో మూడు మండలాలను విలీనం చేస్తామని మంత్రి ప్రకటించడంతో జిల్లాలో కలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కొత్త మండలాల ఏర్పాటుకు ఆందోళనలు

జిల్లాలో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి బలంగా వినిపిస్తోంది. రామడుగు మండలంలోని గోపాలరావుపేట, గంగధార మండలంలోని గర్శకుర్తి, వీణవంక మండలంలోని చల్లూరు, జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామాలను మండల కేంద్రాలుగా మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రజలు ఎన్నికల ముందు కూడా దశలవారీగా ఆందోళనలు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z