Politics

ఈ నెల కరెంట్‌బిల్లులు ఎవరూ చెల్లించవద్దు!

ఈ నెల కరెంట్‌బిల్లులు ఎవరూ చెల్లించవద్దు!

బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి తీరతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ పడింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు, రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ లాంటోళ్లను చాలామందిని చూశామని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ క్రమంలో తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అలాగే జనవరి నెల కరెంట్‌బిల్లులు ఎవరూ కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతున బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్‌ సీఎం రేవంత్‌కు చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రవేంత్‌రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్‌ఎస్‌ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని.. రెండున్నర దశాబ్దాలు నిలబడి రేవంత్‌ లాంటోళ్లను మట్టి కరిపించిందని అన్నారాయన. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్? తెలంగాణ తెచ్చినందుకా?.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హమీల్ని ప్రశ్నిస్తునందుకా?’’ కేటీఆర్‌ నిలదీశారు.

బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ ఉండబోదని శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ‘‘రేవంత్ రక్తం అంతా బీజెపీదే. అందుకే ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండు. రేవంత్‌ కాంగ్రెస్‌ ఏక్‌నాథ్‌ షిండేగా మారతాడు’’ అంటూ కేటీఆర్‌ పంచ్‌లు వేశారు. అలాగే.. ఈ జనవరి నెల కరెంట్‌ బిల్లులు ఎవరూ కట్టవద్దని.. ఆ బిల్లులను ఢిల్లీలోని కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z