Business

‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం ఎలా అప్లై చేసుకోవాలి – Business News Roundup – Feb 13 2024

How to apply for PM Subsidy Solar Yojana

* సౌర విద్యుత్‌ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana)’ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్‌తో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరి దీని కింద ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం ఎలా అప్లై చేసుకోవాలి..? ఆ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1: ముందుగా ఈ పోర్టల్‌లో మీరు పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని ఎంటర్ చేయాలి. పోర్టల్‌లో ఉన్న నియమ నిబంధలను అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.

Step 2: ఆ తర్వాత కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి. అక్కడ ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లై చేసుకోవాలి.

Step 3: దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్‌ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి

Step 4: ఇన్‌స్టలేషన్‌ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్‌ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Step 5: నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.

Step 6: ఈ రిపోర్ట్‌ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

* ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు జనవరిలో రికార్డు గరిష్ఠానికి చేరినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. ఎస్‌యూవీలకు భారీ గిరాకీ నమోదైనట్లు పేర్కొంది. క్రితం ఏడాది తొలి నెలలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడయ్యాయి. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. కొత్త మోడళ్ల ప్రవేశం, వివిధ రకాల పథకాలు, పెళ్లిళ్ల సీజన్ కలిసొచ్చినట్లు వివరించింది. విక్రయాలు భారీగా నమోదైనా, కార్ల కోసం ఇంకా 50-55 రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ఫాడా తెలిపింది. జనవరిలో ద్విచక్ర వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 15 శాతం పెరిగి 14,58,849 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు 89,208 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 37 శాతం పుంజుకొని 97,675కు, ట్రాక్టర్ల అమ్మకాలు 21 శాతం ఎగబాకి 88,671 యూనిట్లకు చేరాయి. మొత్తంగా గత నెలలో వాహన రిటైల్‌ విక్రయాలు 21,27,653 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023 జనవరిలో అమ్ముడైన 18,49,691 యూనిట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది.

* విద్యుత్‌ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata motors) గుడ్‌న్యూస్‌ చెప్పింది. నెక్సాన్‌.ఈవీ, టియాగో.ఈవీలపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. బ్యాటరీ వ్యయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్‌.ఈవీపై గరిష్ఠంగా రూ.1.2 లక్షలు తగ్గిస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటిచింది. దీంతో ఈ మోడల్‌ ధర రూ.14.49 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో.ఈవీపై రూ.70 వేల మేర డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇకపై ఈ మోడల్‌ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన పంచ్‌.ఈవీ ధరను మాత్రం స్థిరంగా ఉంచింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా బ్యాంక్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ఉదయం 71,292.08 పాయింట్ల (క్రితం ముగింపు 71,072.49) లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. కాసేపటికి నష్టాల్లోకి జారుకుంది. వెంటనే కోలుకుని.. ఆపై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 70,924.30 – 71,662.74 మధ్య కదలాడిన సూచీ.. చివరికి 482.70 పాయింట్ల లాభంతో 71,555.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 127.20 పాయింట్ల లాభంతో 21,743.25 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.01 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ చమురు ధర 82.58 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ధర ఔన్సు ధర 2040.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z