Kids

JEE పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు-News Roundup-Feb 13 2024

JEE పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు-News Roundup-Feb 13 2024

* రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని పెడదామా?.. వద్దా? అనే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్న ఆయన పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎల్లుండితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామని వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేలు తెదేపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారి జాబితా భారీగానే ఉన్నట్టు వివరాలు అందజేస్తున్నారు.

* గూగుల్‌ (Google) సంస్థ గతేడాది చివర్లో జెమిని (Gemini AI) పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ను పరిచయం చేసింది. గతంలో ఉన్న బార్డ్‌ (Google Bard)ను కూడా ఇందులో విలీనం చేసింది. ఇది కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తాజాగా జెమిని వాడకంపై యూజర్లకు గూగుల్‌ కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాని షేర్‌ చేయొద్దని సూచించింది. ‘‘జెమిని యాప్‌ లేదా వెబ్‌సైట్‌లు గూగుల్ అసిస్టెంట్‌కి అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్‌. దీని ద్వారా మీరు ఏదైనా సమాచారం తెలుసుకున్న అనంతరం హిస్టరీని యూజర్‌ డిలీట్‌ చేసినా.. రివ్యూ కోసం మరికొంత కాలం గూగుల్‌ డేటాలో ఉంటాయి. భాష, డివైజ్‌, ప్రాంతం, ఫీడ్‌బ్యాక్‌ కోసం రివ్యూ చేస్తారు. వీటికి గూగుల్‌ ఖాతాలతో ఎలాంటి సంబంధం ఉండదు. యూజర్‌ తన డివైజ్‌లో జెమిని యాక్టివిటీని డిసేబుల్‌ చేసినా.. అప్పటి వరకు సెర్చ్‌ చేసిన సమాచారం వివరాలు 72 గంటలపాటు స్టోర్‌ అవుతాయి. కొన్నిసార్లు ఈ సమాచారం మూడేళ్లపాటు గూగుల్‌ స్టోరేజ్‌లో ఉంటుంది’’ అని గూగుల్ జెమిని యాప్‌ ప్రైవసీ బ్లాగ్‌లో పేర్కొంది.

* సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో భారాస బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు గాయాలయ్యాయి. కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు.

* తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతన్నలు ‘దిల్లీ చలో’ (Farmers Protest) పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల కనీస మద్దతు ధర (MSP) హామీకి చట్టబద్ధత కల్పిస్తామని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని తెలిపారు. ‘‘దేశంలోని రైతులకు లబ్ధి చేకూరేలా.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దీంతో రైతుల జీవితాల్లో మూడు కీలక మార్పులు జరుగుతాయి. పంటకు కచ్చితమైన ధర లభించడంతోపాటు అప్పుల బాధ తొలగిపోతుంది. రైతుల ఆత్మహత్యలు ఉండవు. వ్యవసాయం లాభసాటిగా మారి.. రైతులు సంపన్నులు అవుతారు. ఈ నిర్ణయం దేశంలోని 15 కోట్ల రైతుల కుటుంబాలకు భరోసా ఇస్తుంది. ఇది కాంగ్రెస్‌ తొలి హామీ. #KisaanNYAYGuarantee’’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు.

* సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశా ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద అబ్బాయిలకు ఏటా రూ.9వేలు, విద్యార్థినులకు రూ.10వేలు చొప్పున అందించనున్నారు. ఎస్సీ/ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులైతే రూ.10వేలు, విద్యార్థినులైతే రూ.11వేలు చొప్పున అందిస్తారు. జజ్‌పుర్‌లో నిర్వహించిన నువా ఓ ఫెస్టివల్‌లో 5టి ఛైర్‌పర్సన్‌ వీకే పాండియన్‌ మాట్లాడుతూ.. సీఎం అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

* పంటలకు కనీస మద్దతు ధర (MSP)పై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతన్నలు మంగళవారం చేపట్టిన ‘దిల్లీ చలో’ ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి దిల్లీకి ట్రాక్టర్లతో బయల్దేరిన అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతుల నిరసన (Farmers Protest)పై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమన్నారు. దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు. ‘‘కొన్ని శక్తులు (విపక్షాలను ఉద్దేశిస్తూ) తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనీస మద్దతు ధర (Minimum Support Price)పై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేం. దీనిపై అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకే, రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలి’’ అని అర్జున్‌ ముండా సూచించారు.

* దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఎన్‌టీఏ(NTA) విడుదల చేసిన పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100శాతం స్కోరు సాధించారు. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే. తెలంగాణకు చెందిన రిషి శేఖర్‌ శుక్లా, పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, హుందేకర్‌ విదిత్‌, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌, తవ్వ దినేశ్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి వెంకట తనీశ్‌ రెడ్డి 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరైన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను మంగళవారం వెల్లడించారు. చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు.

* ఈనెల 16న ర‌థ‌స‌ప్తమి(Rathasaptami) సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

* తెలివిలేక.. ప్రభుత్వాన్ని నడిపే చేతగాక మందిమీద బద్నాంపెట్టి బతుకుదామనుకుంటున్నారా? అట్లగాదు బిడ్డా జాగ్రత్తా..! బతుకనివ్వం.. వెంటపడుతం.. వేటాడుతాం అంటూ అధికార కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరావు హెచ్చరించారు. ఛలో నల్లగొండ సభలో కాంగ్రెస్‌ సర్కారు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రం వచ్చాక కరెంటు తెచ్చాం. ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగు చేసి ఏడాదిన్నర నుంచి 24గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చాం. మీరంతా సంతోషంగా నడింట్లో పండుకొని పంటలు పండించారు. పాములు, తేళ్లు కరువంగా బాయిలకాడికి పోలే. కేసీఆర్‌ గవర్నమెంట్‌ పోంగనే కట్కేసినట్టే బంద్‌ అవుతుందా కరెంటు? నేను తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటు దానికి ఏం రోగం అయ్యింది.. మాయ రోగం వచ్చిందా? యాడపోయే కరెంటు’ అంటూ మండిపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z