DailyDose

బండ్ల గనేష్‌కు ఏడాది జైలు భారీ జరిమానా-Crime News-Feb 14

బండ్ల గనేష్‌కు ఏడాది జైలు భారీ జరిమానా-Crime News-Feb 14

* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ వ్యవహారంలో బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. సత్యనారాయణ, భరత్‌ ఇద్దరూ.. ఆయనకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. విలువైన భూములు, స్థలాలు వారి పేరు మీద ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం మరోసారి వీరిని విచారించనున్నారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివ బాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో.. మరింత లోతుగా అతని బినామీలను ఏసీబీ ప్రశ్నించనుది. మరి కొంత మందిని ఈ కేసులో విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని సమాచారం సేకరిస్తున్నారు.

* తన పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిస్తూ ఓ మహిళ 45 రోజుల్లోనే 2.5 లక్షలు సంపాదించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్లలు భిక్షమెత్తడం చూడలేక ప్రజలు తమకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు. దీనినే అవకాశంగా తీసుకొని ముఠాలు పిల్లలను యాచనలోకి దింపుతుంటాయి. అలా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్న ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులతో లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నట్లు తెలిసింది.

* సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు (భంద్ల ఘనెష్) ఏడాది జైలు శిక్షపడింది. బాకీ చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని కేసులో ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ పి.భానుసాయి జైలు శిక్ష, జరిమానా విధించారు. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్లగణేష్‌ రూ.95 లక్షలు చెల్లించాల్సి ఉండగా, అందుకు సంబంధించి నగదును చెక్‌ రూపంలో ఇచ్చారు. వెంకటేశ్వర్లు ఆ చెక్‌ను నగదుగా మార్చుకునే నిమిత్తం బ్యాంకుకు తీసుకెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో అది కాస్తా బౌన్స్‌ అయ్యింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్‌ నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష, రూ.95.10 లక్షలు జరిమానా వేశారు. జరిమానాలోని రూ.95 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పును అప్పీలు చేసుకునేందుకు కోర్టు నెలరోజుల గడువు ఇచ్చింది.

* పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీలో భారీ చోరీకి తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం చాదర్‌ఘాట్‌ ఠాణా పరిధిలోని అక్బర్‌బాగ్‌లో ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి యాజమానిపై కత్తి దాడి చేసి బంగారం దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. క్లూస్‌ టీమ్‌, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలో ఎంత బంగారం చోరీకి గురైందనే వివరాలు తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z