Business

నిముషానికి 350గులాబీల ఆర్డర్లు-Business News Roundup – Feb 14 2024

నిముషానికి 350గులాబీల ఆర్డర్లు-Business News Roundup – Feb 14 2024

* కేంద్రం పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అందుకు అనువుగా కేంద్రం తాజాగా సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(నీలిట్‌) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. ఈ సెంటర్లను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కేంద్రాల్లో రానున్న రోజుల్లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఈసీటీ)కు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఈ రెండు కేంద్రాలు నీలిట్‌-చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్నట్లు తెలిసింది.

* వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ వారంలో భార‌త్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్ల‌ను యువ జంట‌లు ఆర్డ‌ర్ చేశాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై గులాబీలు, చాక్లెట్స్‌, రొమాంటిక్ గిఫ్ట్‌ల ఆర్డ‌ర్లు వెల్లువెత్తాయి. ఫిబ్ర‌వ‌రి 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వాలెంటైన్స్ డే జ‌రుపుకుంటున్నా వారం రోజుల ముందు నుంచే భార‌త్‌లో సెల‌బ్రేష‌న్స్ ఊపందుకున్నాయి. ఈ-కామ‌ర్స్ వేదిక‌లు, డేటింగ్ సైట్స్ భారీ క్యాంపెయిన్‌తో రొమాంటిక్ ప్రోడ‌క్ట్స్‌, గిఫ్ట్‌ల సేల్స్‌ను ప్రోత్స‌హించాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఆర్డ‌ర్లు న‌మోద‌య్యాయి. ఈ వారంలో నిమిషానికి 350 రోజెస్‌, 406 చాక్లెట్స్ వినియోగ‌దారులు కొనుగోలు చేశారు. ఫిబ్ర‌వ‌రి 9న తాము నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివ‌రీ చేశామ‌ని ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫాం బ్లింకిట్‌ సీఈవో అల్బింద‌ర్ థిండ్సా ట్వీట్ చేశారు. మ‌రో 20,000కిపైగా చాక్లెట్స్‌, చాక్లెట్ బాక్స్‌లు మ‌రో ప‌ది నిమిషాల్లో క‌స్ట‌మ‌ర్ల‌కు డెలివ‌రీ అవుతాయ‌ని తెలిపారు. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఆన్‌లైన్ కేక్ ఆర్డ‌ర్స్ కూడా ప్ర‌తి నిమిషానికీ పెరుగుతున్నాయని స్విగ్గీ సీఈవో రోహిత్ క‌పూర్ ట్వీట్ చేశారు.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock market) సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాటపట్టాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఏకంగా వెయ్యి పాయింట్ల మేర పుంజుకుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదం చేశాయి. సెన్సెక్స్‌ ఈ ఉదయం 71,035.25 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 71,555.19) నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 70,809.84 వద్ద కనిష్ఠాన్ని తాకింది. దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు నష్టాల్లో కొనసాగిన సూచీ.. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో భారీగా పుంజుకుంది. చివరికి 277.98 పాయింట్ల లాభంతో 71,833.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96.80 పాయింట్ల లాభంతో 21,840.05 వద్ద స్థిరపడింది.

* పేటీఎం షేర్ల (Paytm Share Price) పతనం కొనసాగుతోంది. బుధవారం కంపెనీ స్టాక్‌ ధర మరో 9 శాతానికి పైగా కుంగింది. రూ.342 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. 2023 అక్టోబర్‌లో నమోదైన ఏడాది గరిష్ఠం రూ.998.3తో పోలిస్తే ఇప్పటి వరకు 65.5 శాతం నష్టపోయింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)పై జనవరి 31న ఆర్‌బీఐ ప్రకటించిన ఆంక్షల తర్వాత అధికంగా కుంగింది. అప్పటి నుంచి 53 శాతానికి పైగా నష్టపోయింది. దాదాపు రూ.26,000 కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. మరోవైపు పేటీఎం ఇబ్బందులకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. కంపెనీపై (Paytm) ఆంక్షలను సమీక్షించటం లేదని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది. ఫలితంగా పలు బ్రోకరేజీ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను కుదించాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z