Politics

45రోజుల్లో ఎన్నికలు. అభ్యర్థులు రెడీ అంటున్న జగన్-NewsRoundup-Feb 27 2204

45రోజుల్లో ఎన్నికలు. అభ్యర్థులు రెడీ అంటున్న జగన్-NewsRoundup-Feb 27 2204

* రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan) అన్నారు. మంగళగిరిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నది జ్ఞాపకం పెట్టుకుని పార్టీ క్యాడర్‌ పనిచేయాలని సూచించారు. ‘‘శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారైనట్లే. చాలా స్వల్ప మార్పులు ఉంటే ఉండవచ్చు. మార్చాల్సినవి 99శాతం ఇప్పటికే మార్చాం. ఇక పెద్ద మార్పులేవీ ఉండవు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయండి. వైకాపా ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి కుటుంబాన్ని ఐదారుసార్లు కలవాలి. సోషల్‌మీడియాలో క్యాడర్‌ యాక్టివ్‌గా ఉండాలి’’ అని అన్నారు. గత కొన్ని రోజులుగా వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు చేపట్టినవారే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తారని సీఎం జగన్‌ తాజా ప్రకటనతో స్పష్టత ఇచ్చినట్లైంది.

* భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్‌ పేరు చెబితే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్‌ చెప్పారు. ఆయనకు చేవెళ్ల సభ నుంచి సవాల్‌ విసురుతున్నా. దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలి. రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు. తండ్రి పేరు చెప్పి పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాను. చంచల్‌గూడ జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడాను. నల్లమల అడవుల నుంచి దుర్మార్గులు, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చాను. కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ తాకలేరు’’ అని స్పష్టం చేశారు.

* వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి.. సీఎం జగన్‌ను ఢీకొడతానని దస్తగిరి వెల్లడించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి.. మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.

* తాను మర్యాదపూర్వకంగానే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశానని అనంతపురం జిల్లా వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandrareddy) స్పష్టం చేశారు. ప్రజాజీవితంలో ఉన్న తాను.. రాజకీయాల్లోనూ ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. విజయవాడలో రాజ్‌నాథ్‌సింగ్‌, దగ్గుబాటి పురందేశ్వరి ఇతర నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

* తెలుగుదేశం అధినేత చంద్రబాబును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో ఆయన తెదేపాలో చేరనున్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకొస్తున్నానని తెలిపారు. ఇదే విషయమై భేటీలో ఎంపీ చర్చించినట్లు సమాచారం.

* వైకాపా సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని భాజపా శ్రేణులకు కర్తవ్యబోధ చేశారు. విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల భాజపా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

* లోకోపైలట్‌ లేకుండా గూడ్స్ రైలు జమ్ముకశ్మీర్‌లోని కథువా నుంచి పంజాబ్‌లోని ఉచ్చిబసి స్టేషన్ వరకు దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లోకోపైలట్‌తో పాటు కథువా స్టేషన్ మాస్టర్ విధుల పట్ల పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. లోకోపైలెట్, స్టేషన్ మాస్టర్‌తో పాటు ఘటనతో సంబంధమున్న పలువురి వాంగ్మూలాలను దర్యాప్తు బృందం నమోదు చేసి నివేదిక రూపొందించింది.

* ‘తెదేపా, జనసేన పొత్తులో భాగంగా పవన్‌ పార్టీకి 24 సీట్లు అనగానే చాలా మంది ఆయన్ను తిడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన జెండాను కాలితో తొక్కుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనసు బాధగా ఉంద’ని సినీ నటుడు ‘హైపర్‌’ ఆది (Hyper Aadi) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పెషల్‌ వీడియోలో మాట్లాడగా, జనసేన నాయకుడు నాగబాబు తన ఎక్స్‌లో (ఇంతకు ముందు ట్విటర్‌) పంచుకున్నారు.

* కడప జిల్లాలో 20 మంది వైకాపా నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎన్నికల సంఘం (ఈసీ)కి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ వారికి 2+2 నుంచి 4+4 వరకు గన్‌మెన్‌లను కేటాయిస్తూ.. ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నాని చెప్పారు. దీన్ని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

* భాజపా లోక్‌సభ కోర్‌ కమిటీ భేటీ వద్ద వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రత్యక్షం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయవాడలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి రాజ్‌నాథ్‌తోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో భాజపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

* రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. వారికిచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను న్యాయస్థానం కొట్టివేసింది. భూసేకరణ కింద రైతులకు గతంలో సీఆర్‌డీఏ ఈ ప్లాట్లు ఇచ్చింది. వీటిని రద్దు చేస్తూ 862 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

* కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(LRS)ను ఉచితంగా అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు

* పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. వారిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా ఉన్నారు. తనపై అనర్హత వేటు వేయడంపై తాజాగా కోటంరెడ్డి స్పందించారు.

* తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది.

* అగ్రరాజ్యం అమెరికా (USA)లో మరోసారి తెల్లపొడి (White Powder) కలకలం సృష్టించింది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి పోటీ పడుతున్న వేళ.. పెద్ద కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ (Donald Trump Jr)కు వైట్‌ పౌడర్‌తో ఉన్న ఓ లేఖ వచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z