Health

ఆడవారికి ఒకింత ఎక్కువ మేలు..

ఆడవారికి ఒకింత ఎక్కువ మేలు..

వ్యాయామం ఎవరికైనా ఒకటే. కానీ ఇది ఆడవారికి ఒకింత ఎక్కువ మేలు చేస్తుందనే సంగతి తెలుసా? ఆశ్చర్యంగా అనిపించినా తాజా అధ్యయనంలో ఇదే బయటపడింది. ట్రెడ్‌మిల్‌ మీద నడవటం, ఆటలు ఆడటం, కాస్త వేగంగా పరుగెత్తటం వంటివి సమానంగా చేసినా మగవారి కన్నా ఆడవారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నట్టు జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో ఆడవారిలో అకాల మరణం ముప్పు 24% తగ్గగా.. అంతే సేపు శ్రమించిన మగవారిలో 15% మాత్రమే తగ్గటం గమనార్హం. గుండె, రక్తనాళాల జబ్బుల ముప్పులు ఒకే స్థాయిలో తగ్గినప్పటికీ వీటితో సంభవిస్తున్న మరణాల్లోనూ గణనీయమైన తేడా కనిపించింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే మహిళల్లో గుండెపోటు, పక్షవాతం వంటి వాటితో మరణించే ముప్పు 34% తగ్గగా.. పురుషుల్లో ఇది కేవలం 14 శాతానికే పరిమితమైంది. వారానికి 140 నిమిషాలు వ్యాయామం చేసిన మహిళల్లో అకాల మరణం ముప్పు 18% తగ్గగా.. ఇదే స్థాయిలో ప్రయోజనం పొందాలంటే మగవారు 300 నిమిషాలు, అంటే రెట్టింపు కన్నా ఎక్కువగా వ్యాయామం చేయాల్సి ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామాల రకాలు, తీవ్రత, సమయం.. ఇలా వేటిని పరిగణనలోకి తీసుకున్నా మహిళలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుండటం విశేషం. కాబట్టి వ్యాయామం చేయటానికి తగినంత సమయం దొరకటం లేదని భావించే మహిళలు ఏమాత్రం ఖాళీ దొరికినా తోటపనో, బయటకు వెళ్లి నాలుగడుగులు వేయటమో చేయటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని వివరిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z