Business

కూల్‌డ్రింక్స్ వ్యాపారంలోకి రిలయన్స్ – BusinessNews – Feb 28 2024

కూల్‌డ్రింక్స్ వ్యాపారంలోకి రిలయన్స్ – BusinessNews – Feb 28 2024

* ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ (Reliance).. తన ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టింది. శీతల పానీయాల విభాగంలో గతంలో కాంపా కోలా, సోస్యో వంటి బ్రాండ్లను తీసుకొచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు మరిన్ని డ్రింక్స్‌ను జోడించనుంది. శ్రీలంకకు చెందిన ఎలిఫ్యాంట్‌ హౌస్‌ (Elephant House) బ్రాండ్‌ శీతల పానీయాలను దేశీయంగా పరిచయం చేయనుంది. తద్వారా కోకా-కోలా, పెప్సీకి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఎలిఫ్యాంట్‌ హౌస్‌ బ్రాండ్‌ పేరుతో శీతల పానీయాల తయారీ, మార్కెట్‌, సరఫరా, రిటైల్‌ వ్యాపారం చేసుకోవడానికి ఆ కంపెనీతో రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల రిలయన్స్‌ బేవరేజ్‌ ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించడమే కాకుండా.. కొత్త ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందించడం సాధ్యపడుతుందని రిలయన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

* ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్‌ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్‌ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఇరు సంస్థలు బుధవారం ప్రకటన విడుదల చేశాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి. సెన్సెక్స్‌ దాదాపు 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,200 స్థాయిని కోల్పోయింది.

* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) పర్యావరణ హిత సిమ్‌కార్డ్‌లను తీసుకురానుంది. ఇప్పటివరకు వినియోగిస్తున్న వర్జిన్‌ ప్లాస్టిక్‌ సిమ్‌ కార్డ్‌లకు స్వస్తి పలకనుంది. ఇకపై రీసైకిలింగ్‌కు అనుకూలంగా ఉండే పీవీసీ సిమ్‌ కార్డ్‌లకు మారుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు IDEMIA సెక్యూర్ ట్రాన్సాక్షన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. హరిత ఉద్గారాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

* మల్టీప్లెక్స్‌ల ఆదాయ వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20-24% వరకు ఉండొచ్చని అంచనా. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10-15 శాతానికి తగ్గొచ్చని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ బుధవారం తెలిపింది. లాభాల మార్జిన్లు స్వల్పంగా పెరగవచ్చని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి అగ్రశ్రేణి సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి పరిశ్రమ ఎదుర్కొంటున్న పోటీ కారణంగా ప్రీ-పాండమిక్‌ స్థాయిల కంటే తక్కువగానే కొనసాగవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. మల్టీప్లెక్స్‌ల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10-15% వృద్ధితో రూ.7,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

* రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న నకిలీ ప్రకటనపై దక్షిణ మధ్యరైల్వే స్పందించింది. ఈ నకిలీ ఉద్యోగ నియామక నోటీసుపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని స్పష్టంచేస్తూ ట్వీట్‌ చేసింది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్‌ 15 నుంచి మే 14 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుందని పేర్కొంటూ విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఈ నోటిఫికేషన్‌ నకిలీదని ఇటీవల ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై దక్షిణ మధ్య రైల్వే కూడా స్పందించింది. ఎప్పుడూ వ్యక్తిగత/ఆర్థికపరమైన సమాచారాన్ని షేర్‌ చేయొద్దని ప్రజలకు సూచించింది. ఆర్‌పీఎఫ్‌లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్య, వేతనం, వయోపరిమితి, విద్యార్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుం వంటి అంశాలతో కూడిన ఈ నకిలీ ప్రకటనను ఎవరూ నమ్మొద్దని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z