Business

యూకో బ్యాంకులో భారీ కుంభకోణం-BusinessNews-Mar 07 2024

యూకో బ్యాంకులో భారీ కుంభకోణం-BusinessNews-Mar 07 2024

* యూకో బ్యాంక్‌ (UCO Bank)లో రూ.820 కోట్ల మేర ఐఎంపీఎస్ లావాదేవీల కుంభకోణంపై సీబీఐ (CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా రాజస్థాన్‌, మహారాష్ట్రల్లోని 67 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులో గతేడాది నవంబర్ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మందికి పైగా కస్టమర్ల ఖాతాల్లో డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నవంబర్‌ 21న కేసు నమోదు చేసిన సీబీఐ.. పలుచోట్ల సోదాలు జరిపి కొన్ని ఆధారాలు సేకరించింది. ఏడు ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్‌ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41వేల ఖాతాదారులకు తప్పుగా మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి సొమ్మూ కట్‌ అవకుండానే యూకో బ్యాంక్‌ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమ కావడంపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. ఆ కూపీ లాగే దిశగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమైన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. పొరపాటున తమ ఖాతాల్లో జమ అయిన మొత్తాలను చాలామంది ఇదే అదునుగా విత్‌డ్రా చేసుకొని బ్యాంకుకు తిరిగి చెల్లించని వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొన్ని కాలవ్యవధులపై MCLRను 5 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. సవరణ అనంతరం MCLR 8.95-9.35% మధ్య ఉంటుంది. ఓవర్‌నైట్‌ MCLR 8.90% నుంచి 8.95% శాతానికి, మూడు నెలల MCLR 9.10% నుంచి 9.15 శాతానికి పెరిగింది. ఒక నిర్దిష్ట రుణం కోసం ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటును మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR) అంటారు. సాధారణంగా ఇది రుణానికి సంబంధించిన అతి తక్కువ వడ్డీ రేటును సూచిస్తుంది. MCLR కంటే తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకు రుణాన్ని అందించదు. MCLRను నిర్ణయించేటప్పుడు డిపాజిట్‌ రేట్లు, రెపో రేట్లు, ఖర్చులు, నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త రేట్లు 2024 మార్చి 7 నుంచి అమల్లోకి వస్తాయి.

* స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 74,245 వద్ద, నిఫ్టీ 22,523 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 74,242.74 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,921.48- 74,245.17 మధ్య చలించింది. చివరికి 33.40పాయింట్ల లాభంతో 74,119.39 వద్ద ముగిసింది. నిఫ్టీ 19.50 పాయింట్లు లాభపడి 22,493.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 6 పైసలు బలపడి 82.77 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 82.34 వద్ద కొనసాగుతుండగా.. బంగారం 2165 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది.

* కేరళ ‘సీస్పేస్‌’ (CSpace) పేరుతో ఓటీటీ సర్వీస్‌లను అందించేందుకు సిద్దమైంది. గురువారం కేరళ సీఎం పినరయి విజయన్‌ ఈ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ వేదిక ఇదేనని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌ ఎంపికలో చాలా తేడాలున్నాయని కేరళ రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ షాజీ ఎన్‌ కరున్‌ తెలిపారు. వాటి ప్రసారాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటికి ప్రతిస్పందనగా సీస్పేస్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* లోక్‌సభ ఎన్నికల ముంగిట వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద భారత ప్రభుత్వం వంట గ్యాస్‌పై సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించవచ్చని సీఎన్‌బీసీ-టీవీ18 నివేదిక పేర్కొంది. కొత్త కనెక్షన్‌ల కోసం అందించే సొమ్మే కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అర్హులైన వినియోగదారులకు ప్రతి ఎల్‌పీజీ సిలిండర్‌కు రూ.300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ అందిస్తోంది. ఇది గతంలో రూ.100 ఉండగా 2023 అక్టోబరులో రూ.300కి పెంచారు. సబ్సిడీని ఒక సంవత్సరం పొడిగించడం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.12,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z