Business

ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు-BusinessNews-Mar 29 2024

ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు-BusinessNews-Mar 29 2024

* ఈ ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు తెరుచుకునే ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి రోజు కావడంతో ప్రభుత్వ లావాదేవీలకు, ఇతరత్రా చెల్లింపులకు, ట్యాక్స్‌ పేయర్స్‌కు ఆటంకం లేకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు 33బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్బీఐసహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐసహా 20 ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకైన డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా ఆదివారం (మార్చి 31) అయినప్పటికీ సాధారణంగానే పనిచేయనున్నాయి. నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌తోపాటు చెక్‌ క్లియరెన్సులు తదితర సేవలు యథాతథంగా సాగుతాయి.

* విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు వరుసగా ఐదోవారం పెరిగాయి. మార్చి 22 తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 642.63 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో 140 మిలియన్ డాలర్లు పెరిగాయి. మార్చి 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.4 బిలియన్ డాలర్లు పుంజుకుని 642.49 బిలియన్ డాలర్లకు చేరాయి.

* విమాన టికెట్లు కొనేటప్పుడు సీట్ల కోసం అదనంగా చెల్లిస్తున్నామని ఓ సర్వేలో పాల్గొన్న 44 శాతానికిపైగా ప్రయాణికులు పేర్కొన్నారు. సీటు కేటాయింపు ఫీజుగా రూ.200ల నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నామని చాలామంది తెలిపారు. ఇది సదరు టికెట్‌ ధరలో 5 నుంచి 40 శాతం వరకు ఉందని ఈ సర్వేను చేపట్టిన లోకల్‌సర్కిల్స్‌ సంస్థ పేర్కొన్నది. అయితే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కన్జ్యూమర్‌ రెగ్యులేటర్‌ సీసీపీఏ గత ఏడాది ఎయిర్‌లైన్స్‌తో దీనికి సంబంధించి సమావేశం జరిపిన నేపథ్యంలో తాజా సర్వే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.

* ర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌కు (AI) డిమాండ్‌ పెరుగుతున్న వేళ తద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందులోభాగంగా తమ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి. ఈవిషయంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ (TCS) ముందు వరుసలో నిలుస్తోంది. ఇప్పటివరకు జనరేటివ్‌ ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు ఆ కంపెనీ వెల్లడించింది.

* బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీలను డిజిటలైజేషన్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఇకపై అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే (E- insurance) పాలసీలను అందించాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్యం, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z