Agriculture

తెలంగాణా వ్యవసాయ రంగం ప్రక్షాళన

KCR To Clean Slate Telangana's Agriculture Sector

‘‘ప్రపంచ వ్యాప్తంగా ఏటికేడు పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాగుచేసే పంటలను కూడా మార్చుకోవాలి. రాష్ట్రంలో పంట మార్పిడి విధానమనేది రైతులకు అలవాటు కావాలి. ఈ విధానంతో ఎక్కువ దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ఇవన్నీ రైతులకు వివరంగా చెప్పాలి.’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పరంగా సంస్కరణల శకం ఈ వర్షాకాలం పంటలతో ప్రారంభమవుతోందని ప్రకటించారు. మున్ముందు తెలంగాణ వ్యవసాయం పరిణతి సాధించడానికి ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేస్తుందని.. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడిసరుకు అందించే విధంగా, వేసిన పంటంతా పూర్తిగా అమ్ముడుపోయే విధంగా, ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణలో పంటల సాగు జరగాలని ఆకాంక్షించారు. ఆ రకంగా రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారాలని చెప్పారు. ప్రభుత్వం ఏంచేసినా తమ శ్రేయస్సు కోసమే చేస్తుందనే విశ్వాసం రైతుల్లో ఉందని చెప్పారు. సాగులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో నిపుణులతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌ రావు, అగ్రి బిజినెస్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ సీమ, అడ్మినిరేస్టటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ సలహాదారు గోపీనాథ్‌ కోనేటి, సీడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు పాల్గొన్నారు. పంటల సాగులో ఏ రకమైన మార్పులు తీసుకురావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటకు అదనపు విలువ జతచేయడానికి ఇప్పుడున్న పద్ధతులు ఏమిటి? కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఎరువులు, రసాయనాల వాడకంలో రావల్సిన మార్పులు ఏమిటి? పంటల మిగులు ఉండకుండా ఏం చేయాలి? తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్చలు చాలా జరిపి, తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు.