Politics

చంద్రబాబు కన్నా కేసీఆర్ మంచోడు–నేటి అసెంబ్లీలో సవాళ్ళపై TNI కధనాలు

చంద్రబాబు కన్నా కేసీఆర్ మంచోడు–నేటి అసెంబ్లీలో సవాళ్ళపై TNI కధనాలు --- Andhra Assembly Updates From Todays Session-July 25 2019

*ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యిరెట్లు బెటర్ అంటూ ప్రశంసించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే కేసీఆర్ ఎన్నో రెట్లు మంచి వారంటూ కితాబిచ్చారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం మాట్లాడిన అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాలపై చర్చ జరుగుతున్న సమయంలో సభానాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించి ప్రస్తావించారని దాంతో చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడి లేచారని విమర్శించారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. గోదావరి జలాల తీసుకురావడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని ఆయన చాలా మంచివారని అన్నారని టక్కున లేచిన చంద్రబాబు తాను మాట్లాడతానంటూ చేతులెత్తారని విమర్శించారు. తమ సభానాయకుడు కేసీఆర్ మంచివారే అన్నారు గానీ చంద్రబాబు నాయుడు చెడ్డవారు అని అనలేదన్నారు. చంద్రబాబు కంటే కేసీఆర్ వెయ్యిరెట్లు మంచి వారని తాను ఉద్ఘాటిస్తున్నానన్నారు. కేసీఆర్ మంచి వారంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు. సభానాయకుడు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పనివ్వాలని చెప్పనియ్యకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో అది భావ్యం కాదన్నారు. చంద్రబాబు నాయుడు సభను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుగానే ప్లాన్ వేసుకుని అసెంబ్లీకి వచ్చినట్లు ఉందన్నారు. నిత్యం సభలో చర్చ జరగకుండా అడ్డుతగలడం సరికాదని పద్దతి మార్చుకోవాలని చంద్రబాబు నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు.
1.చంద్రబాబు నేర్పిన విద్యనే ప్రదర్శిస్తున్నాం: కోటంరెడ్డి
గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు ఆయనపై నోటికి వచ్చినట్టు మాట్లాడారని, ఆ మాటలకు చంద్రబాబు చప్పట్లు కొట్టారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ నాటి వ్యాఖ్యలకు చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తే.. తాను చేసిన కామెంట్లపై క్షమాపణ చెబుతానని అన్నారు. గత సభలో తమకు చంద్రబాబు నేర్పిన విద్యనే ప్రదర్శిస్తున్నామని ఆయన అన్నారు.తనవి కానీ ఆడియో టేపులను తనవేనని టీడీపీ విమర్శిస్తోందని, చంద్రబాబు ఆడియో టేపులు..తనవి అని చెబుతున్న ఆడియో టేపులను.. ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి టీడీపీ సిద్దమా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. తప్పని తేలితే శిక్ష అనుభవించడానికి తాను సిద్దమని, లేకపోతే చంద్రబాబు సిద్దమా? అని ఆయన సవాల్ విసిరారు.
2. వైసీపీకి నాపై చాలా అభిమానమున్నట్టుంది: చంద్రబాబు
హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు నవ్వుల జల్లు కురిపించారు. వైసీపీ అభిమానం చూస్తుంటే తనకే ఆశ్చర్యమేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఏపీ, తెలంగాణ ఉమ్మడి నీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిపక్షం నుంచి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడిన అనంతరం.. చంద్రబాబు నాయుడిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ కోరారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై చంద్రబాబు సెటైరికల్‌గా కామెంట్లు చేశారు. వైసీపీకి తనపై చాలా అభిమానం ఉన్నట్టుందని.. ఎంత అభిమానమంటే అది చూసి తనకే ఆశ్చర్యమేస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘మార్పు చాలా వచ్చింది.. చాలా సంతోషంగా ఉంది’’ అని చంద్రబాబు అనడంతో సభ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది. ఆయన మాటలకు సీఎం జగన్ కూడా హాయిగా నవ్వేశారు.
3. మరో నలుగురు తెదేపా సభ్యులు సస్పెన్షన్‌
ఏపీ శాసనసభ నుంచి మరో నలుగురు తెదేపా సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఈ రోజు సభ ముగిసేవరకు స్పీకర్‌ ఈ నలుగురినీ సస్పెండ్‌ చేశారు. సభలో నినాదాలు చేయడంతో మార్షల్స్‌ సాయంతో వారిని బలవంతంగా సభ నుంచి బయటకు పంపారు.
4. ఏపీకి పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మేరకు సమాధానమిచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయడం మినహా ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
5. ఈ బిల్లు మతపరమైంది కాదు:రవిశంకర్‌ప్రసాద్
ట్రిపుల్‌ తలాక్ బిల్లు మతపరమైంది కాదని, మహిళా సమానత్వానికి సంబంధించిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ గురువారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను ఎన్డీఏ మిత్ర పక్షం జేడీయూ సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే మూడుసార్లు తలాక్‌ చెప్పి, భార్యకు విడాకులు ఇచ్చే భర్తకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. ఆ నిబంధనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వాదిస్తున్నాయి.
6. ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన
ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదని, తెలంగాణ భవనాలను మాత్రమే తెలంగాణకు ఇచ్చేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే ఏపీ సీఎం, ముఖ్యమైన కేబినెట్‌ మంత్రులు, అధికారులు వెళ్లి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన సమస్యలపై చర్చించారని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని భవనాలు 2024 వరకు మనకు చెందుతాయని, ఆ తర్వాత అవి తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు.
7. గోదావరి జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ
కృష్ణా-గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ అంశంపై ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అంశంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోనూ తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని రైతాంగం, ప్రజలు సాగునీరు, తాగునీటికి ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారని తెలిపారు
8. ట్రిపుల్‌ తలాక్‌ చట్టం వివక్షపూరితంగా ఉంది’
ట్రిపుల్‌ తలాక్‌ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…వివాహమనేది సివిల్‌ కాంట్రాక్ట్‌ అయినపుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలు శిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని.. విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతరకరమన్నారు.
9. అసెంబ్లీలో నదీజలాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు………
అసెంబ్లీలో గోదావరి, కృష్ణ నదీ జలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా నీరు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి నదిలో నీరు ఉండటంతో దాని ఫలితంగా ఏపీకి అత్యధికంగా నీరు వస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే గోదావరి, కృష్ణా నదుల నుంచి లభిస్తున్న ప్రతీ నీటి బొట్టును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. నదుల అనుసంధానం చేసి ఆ నీటిని కాపాడితే కరువు అనేది రాకుండా ఉంటుందని చంద్రబాబు సూచించారు. జాతీయ స్థాయిలో నదుల లింకేజీ కోసం గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించాయని చెప్పుకొచ్చారు. మహానది, గోదావరి, బ్రహ్మపుత్ర వంటి నదులన్నింటిని కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కేంద్రమంత్రి సురేష్ ప్రభుత్వ ఆ టాస్క్ ఫోర్స్ కు చైర్మన్ గా వ్యవహరించారని తెలిపారు. అలాగే ఏపీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానికి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రయత్నించిందని అది సాధించిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం గోదావరి, కృష్ణా నీటిలో తెలంగాణ రాష్ట్రం వాటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాలపై ఖచ్చితమైన క్లారిటి రావాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే పంచుకున్నామో అలాగే పంచుకుంటున్నట్లు తెలిపారు. గోదావరి కృష్ణా నదీజలాలను దామాషా ప్రకారం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు పంచాలని కోరినట్లు తెలిపారు. అయితే అందుకు కృష్ణాట్రిబ్యునల్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. వంశధార ప్రాజెక్టు విషయంలో కూడా ఒడిశా అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు తెలిపారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ఇబ్బందులు సృష్టించిందని చెప్పుకొచ్చారు. పాలారు పైన చెక్ డ్యాం కట్టుకునేందుకు తమిళనాడు మాజీ సీఎంలు కరుణానిధి, జయలలితలు ఎన్నో అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు గుర్తుకు తెచ్చారు. గోదావరి నీళ్లు పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్నాయని సముద్రంలోకి కొంత నీరు వృధాగా పోతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోదావరి నీరు పోలవరంలోకి వచ్చి వృధాగా సముద్రంలోకి పోతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నదీ జలాలను సంవృద్ధిగా వినియోగించుకోవాలన్నదే తమ తాపత్రాయమన్నారు. నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
10. తెలంగాణతో నదీ జలాల పంపకం: జగన్ కీలక ప్రకటన………
ఏపీ అసెంబ్లీలో నీటి పారుదల ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతతో ఉంటామని కూడ ఆయన స్పష్టం చేశారు. గోదావరి నది జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయమై జగన్ స్పష్టత ఇచ్చారు.గోదావరి నదీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీకి అందించే విషయమై రాష్ట్రానికి ప్రయోజనం కలిగితేనే ముందుకు సాగుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఒకవేళ ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముందుకు సాగబోమని ఆయన స్పష్టం చేశారు.గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో నదీ జలాలపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. ఈ విషయమై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు జగన్ కౌంటరిచ్చారు.గోదావరి నది జలాలు 12 శాతం కూడ రావడం లేదని ఏపీ సీఎం జగన్ చెప్పారు. గోదావరి నదీ జలాలను వాడుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిదని జగన్ సభలో ప్రస్తావించారు.గోదావరి నది జలాల్లో కేవలం 5 శాతం మాత్రమే ఏపీ రాష్ట్రానికి వస్తున్నాయని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ నీళ్లు కూడ శబరి నది వల్లే వస్తోందన్నారు. ఆల్మటి ఎత్తు పెంచడం వల్ల కృష్ణా ఆయకట్టుకు నీరు అందించే పరిస్థితి లేదని జగన్ అభిప్రాయపడ్డారు.శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల ఆస్తి అని జగన్ చెప్పారు. గోదావరి నది జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించడం ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా ఆయకట్టుకు నీటిని అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతగా ఉండడం వల్ల ఇబ్బందేమిటని జగన్ ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తెలంగాణకే నీళ్లు రాని పరిస్థితి నెలకొందని జగన్ చెప్పారు. శ్రీశైలం ద్వారా గోదావరి నది నీటిని తరలిస్తే తనకు మంచి పేరు వస్తోందని టీడీపీకి భయం పట్టుకొందని జగన్ తెలిపారు.టీడీపీ సభ్యులు మాట్లాడిన సమయంలో తాను కానీ తమ పార్టీ సభ్యులు కూడ అడ్డుపడలేదని జగన్ చెప్పారు. కానీ, తాను చెప్పే అంశం ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మీరు మనుషులా… రాక్షలా అంటూ జగన్ మండిపడ్డారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కల్గించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని జగన్ విమర్శించారు.