Editorials

నలుగురు ముఖ్యమంత్రులను పీఠం ఎక్కించిన నరసింహన్

నలుగురు ముఖ్యమంత్రులను పీఠం ఎక్కించిన నరసింహన్

ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన నరసింహన్‌.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా.. తెలంగాణ గవర్నర్‌గా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన యూపీఏ, ఎన్డీయే హయాంలో ఆ పదవిలో కొనసాగారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇలా.. ప్రతి విషయంలోనూ ‘ప్రథమ పౌరుడి’గా వ్యవహరించారు. తొమ్మిదన్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళిసై నియమితులైన నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌ గురించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీ తివారీ రాజీనామా తర్వాత గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా ఉన్న ఆయన 2009 డిసెంబర్‌ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012 మే 3న రెండో సారి గవర్నర్‌గా నరసింహన్‌ ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో యూపీఏ ప్రభుత్వానికి నమ్మిన బంటుగా వ్యవహరించారు. ఉద్యమం తారస్థాయికి చేరుకోవడం, నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో నరసింహన్‌ క్రియాశీలక పాత్ర పోషించారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొందడంతో సీఎం పదవికి కిరణ్ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రపతి పాలన వచ్చింది. దీంతో గవర్నర్‌గా నరసింహన్‌ రాష్ట్ర పాలనను నడిపించారు. 2014 సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అయినా నరసింహన్‌ మాత్రం ఆ పదవిలోనే కొనసాగారు. చాలా రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌గా కొనసాగించింది. విద్యుత్, నీరు, ఉద్యోగాలు, సంస్థల విభజనలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. కేసీఆర్, చంద్రబాబులను సమావేశపరిచి కృష్ణా జలాలు, సాగర్‌ వివాదాలను తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు. ఫోన్‌ ట్యాపింగ్ వివాదంలో కేసీఆర్‌ను వెనకేసుకొచ్చారని ఏపీ మంత్రులు గవర్నర్‌పై విమర్శల వర్షం కురిపించారు. పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకోవడం లాంటి అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తరచూ పుణ్యక్షేత్రాలు వెళ్తుండడంపైనా నరసింహన్‌పై విమర్శలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌గా నరసింహన్‌ ఖ్యాతి గడించారు. కేసీఆర్‌తో రెండుసార్లు, కిరణ్‌కుమార్‌ రెడ్డి, చంద్రబాబు, జగన్‌ మోహన్‌ రెడ్డిలతో ఓసారి ప్రమాణం చేయించారు. ఇక పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రాజ్‌భవన్‌ను సాంస్కృతిక కేంద్రంగా మార్చేవారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడాలని భావించిన నరసింహన్‌ స్వయంగా గాంధీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకునేవారు. ఇటీవల ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ను నియమించిన కేంద్రం నరసింహన్‌ను మారుస్తుందనే ప్రచారం సాగింది. కానీ నెలన్నర తర్వాత నరసింహన్‌ను బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.