ScienceAndTech

రేపు ఐఫోన్ 11 వివరాలు వెల్లడి

iPhone 11 Details To Be Revelaed Tomorrow At Apple Event

మార్కెట్‌లోకి ఓ కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే టెక్‌ ప్రియులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. అందులోనూ యాపిల్‌ విషయంలోనైతే వేరే చెప్పనక్కర్లేదు. అంతంత ధరలు పెట్టి కొనని వాళ్లు సైతం ‘ఆ ఫోన్‌ ఉందిరా కనీసం ఒక్కసారైనా వాడాలిరా..’ అనడం వినే ఉంటాం. అలాంటి యాపిల్‌ .. రేపు (సెప్టెంబర్‌ 10) అతిపెద్ద ఈవెంట్‌ నిర్వహించబోతోంది. కాలిఫోర్నియాలోని స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ కంపెనీ తీసుకురాబోయే కొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఎప్పట్నుంచో అనుకుంటున్నట్లు యాపిల్‌ తదుపరి ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లను తీసుకురానుంది. వీటితో పాటు తదుపరి వాచ్‌ సిరీస్‌, ఐవోఎస్‌ 13 ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ తదుపరి సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 11 పేరిట మూడు ఫోన్లను యాపిల్‌ తీసుకురాబోతోంది. వీటికి సంబంధించి పలు వార్తలు ఇప్పటికే బయటకొచ్చాయి. రూమర్స్‌ ప్రకారం ఐఫోన్‌11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 మ్యాక్స్‌ ప్రో పేరిట మూడు ఫోన్లు రానున్నాయి. ఈ మూడింటిలోనూ మూడేసి కెమెరాలు ఉండబోతున్నట్లు సమాచారం. ధర, ఇతర వివరాలు రేపటి ఈవెంట్‌లో తెలుస్తాయి.

ఈసారి యాపిల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాల్లో తమ అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తక్కువ ధరలో ఐఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 2016లో ఇలానే ఐఫోన్‌ ఎస్‌ఈ పేరిట తక్కువ ధరలో ఫోన్‌ను ఆవిష్కరించారు. అదే తరహాలో ఈ సారి సైతం తక్కువ ధరలో ఓ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యాపిల్‌ సిద్ధమవుతోంది. ఇదే ఈవెంట్‌లో యాపిల్‌ తన తదుపరి ఐవోఎస్‌ వెర్షన్‌ 13ను విడుదల చేయబోతోంది. ఇప్పటి వరకు ఇదే అతి వేగవంతమైన ఓఎస్‌గా యాపిల్‌ పేర్కొంటోంది. ఇందులో యాప్‌ సైజ్‌ 50 శాతం వరకు తగ్గించడంతో పాటు యాప్‌ అప్‌డేట్‌ సైజ్‌ను సైతం 60 శాతం మేర తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వెర్షన్‌లో ఫేస్‌ఐడీ 30 శాతం వేగంగా పనిచేయనుంది. దీంతో పాటు ఐవోఎస్‌ 13లో ఈసారి డార్క్‌మోడ్‌ ఫీచర్‌ను తీసురానుంది. వీటితో పాటు ఐఫోన్‌ తన వాచ్‌ సిరీస్‌ 5ను కూడా ఇదే ఈవెంట్‌లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అప్‌డేట్‌ చేసిన మ్యాక్‌ బుక్‌ను కూడా లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. యాపిల్‌ టీవీ ప్లస్‌ సిరీస్‌ను కూడా ఇదే ఈవెంట్‌లో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయంతోపాటు, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ సిరీస్‌లో కనిపించే పెన్‌ తరహాలో యాపిల్‌ కూడా పెన్సిల్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ గురించి కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇంకా ఏమేం కొత్త సంగతులు తీసుకొస్తుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! ఇప్పటి వరకు యాపిల్‌కు సంబంధించిన ఈవెంట్‌ తిలకించాలంటే కొన్ని పరిమితులు ఉండేవి. ఈ సారి టిమ్‌కుక్‌ ఆవిష్కరించబోయే యాపిల్‌ కొత్త ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యక్షప్రసారాన్ని తొలిసారి యూట్యూబ్‌లో యాపిల్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 10.30గంటలకు జరిగే ఈ ఈవెంట్‌ను యూట్యూబ్‌లో అందరూ వీక్షించే ఏర్పాటు చేస్తోంది.