Politics

హైదరాబాద్ తారాజువ్వలా దూసుకుపోతోంది-కేటీఆర్

KTR Says Hyderabad Is Moving Forward At A Faster Pace

ప్రపంచ డిజైన్‌ రంగానికి హైదరాబాద్‌ కేంద్రం కాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హస్త కళలు, టూరిజం, ఫ్యాషన్‌, యానిమేషన్‌ తదితర రంగాల్లో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం వివిధ సంస్థలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని కేటీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ ప్రగతిని ప్రపంచానికి చాటే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ‘వినూత్న ప్రాజెక్టుల హబ్‌గా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర డిజైనింగ్‌ నైపుణ్యాలను తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన అనేక అంశాలు.. డిజైనింగ్‌ ప్రాముఖ్యాన్ని చాటుతూ నగరంలో చిరకాలం నిలిచిపోయేలా రూపొందించాం. హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌లో సీఐఐ వంటి సంస్థలతో కలిసి యువత నుంచి వినూత్న ఆలోచనలు సేకరించాం. ప్రపంచ డిజైన్‌ రంగంతో హైదరాబాద్‌ కలిసేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుంది. డిజైన్‌ రంగంలో అవకాశాల కల్పన ద్వారా సత్ఫలితాలు సాధించడానికి ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. హైదరాబాద్‌ను గ్లోబల్‌ డిజైన్‌ డెస్టినేషన్‌గా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నాం.’’ అని కేటీఆర్‌ అన్నారు.