Politics

చంద్రబాబు పచ్చి అవకాశవాది-కన్నా

Chandrababu Is A Ruthless Opportunist-Kanna Laxminarayana

చంద్రబాబుకు బీజేపీ ఎప్పుడో డోర్లు మూసేసింది…ఆయనో అవకాశవాది….కన్నా ఫైర్

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

కర్నూలులో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన చంద్రబాబు టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కేంద్ర ప్రభుత్వంతో వైరం పెట్టుకోవడం వల్ల మొన్నటి ఎన్నికల్లో తాము ఓడిపోయామని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలకు సమాధానంగా కన్నా లక్ష్మీనారాయణ చంద్ర బాబు పెద్ద అవకాశవాది అని పేర్కొన్నారు.

ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు తీరు అందితే జుట్టు అందక పోతే కాళ్ళు అన్న చందంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

1999లో వాజపేయి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కాళ్లు, గడ్డాలు పట్టుకున్నారని, తద్వారా పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో బిజెపిని సమాధి చేశారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే, 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని బిజెపిని ఏపీలో శాశ్వతంగా లేకుండా చేయాలని చూశారని ఆరోపించారు.

ఏపీలో బీజేపీ బలపడకూడదన్న ప్రధాన లక్ష్యంతో చంద్రబాబు పని చేశారని ఆయన విమర్శించారు.

మళ్లీ బీజేపీతో కలిసి పని చేయాలని చంద్రబాబు భావించినా,ప్రతిసారీ మోసపోవడానికి బిజెపి సిద్ధంగా లేదని కన్నా పేర్కొన్నారు.

గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బిజెపి శాశ్వతంగా తలుపులు మూసేసింది అని అమిత్ షా పేర్కొన్నారని గుర్తు చేశారు.

ఏపీలో ప్రస్తుతం బీజేపీ చిగురిస్తోందని, ఇలాంటి సమయంలో చంద్రబాబు కొత్త ఎత్తు వేశారని, మళ్లీ బీజేపీని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

ఇక వైసిపి ప్రభుత్వంపై సైతం ఆయన నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పాలన లో ఏపీలో అరాచకం పెరిగిందన్నారు.

ఇక ప్రస్తుతం వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశ తనకు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా అభివృద్ధి, సంక్షేమం కలగా మిగిలిపోయే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.