Politics

హుజూర్‌నగర్‌లో కారుకు బంపర్ మెజార్టీ

TRS Records Record Majority In Huzurnagar 2019 By Elections

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 43,284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. ఏ రౌండ్‌లోనూ కూడా పద్మావతి లీడ్‌లో లేకుండా పోయింది. తొలి రౌండ్‌ నుంచి సైదిరెడ్డి ఆధిక్యం ప్రదర్శిస్తూ భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. హుజుర్‌నగర్‌ గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి రెండో స్థానానికి పరిమితం కాగా, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సపావత్‌ సుమన్‌ నిలిచాడు. బీజేపీ నాలుగో స్థానానికి, టీడీపీ ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఉప ఎన్నికలో సైదిరెడ్డి రికార్డు బ్రేక్‌ చేశారు. ఈ నియోజకవర్గంలో సైదిరెడ్డికి వచ్చిన మెజార్టీ ఇప్పటి వరకు ఏ అభ్యర్థికి రాలేదు. భారీ మెజార్టీతో గెలుపొందిన సైదిరెడ్డికి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇటు తెలంగాణ భవన్‌లో అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల ముందే దీపావళి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు.