ScienceAndTech

నా శ్రీమతే నా బలం-సత్య నాదెళ్ల

My wife is my biggest strength-Satya Nadella speaks of his life-నా శ్రీమతే నా బలం-సత్య నాదెళ్ల

ఓ చిన్న ­వూహ. మీకు చేతులూ కాళ్లూ ఏవీ కదలవు అనుకుందాం. కళ్లు మాత్రమే కదపగలరు. అలాంటి మీరు కేవలం కనుసైగలతోనే.. మీరు చెప్పాల్సింది చెప్పగలిగితే, మీక్కావాల్సిన పనులు చేయించుకోగలిగితే? ఇదేదో సినిమా గ్రాఫిక్స్‌ మాయ అనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్‌ ‘విండోస్‌ 10’లోని ఐ ట్రాకర్‌ దీన్ని సాధ్యం చేస్తోంది! అంతేకాదు.. అంధులు ఎవరి సాయం లేకుండా అన్నీ చదవగలిగే అవకాశం కూడా ఇది కల్పిస్తోంది. వినలేనివాళ్లకి ఉపయోగపడేలా నరేటర్‌ అనే ఆప్షన్‌ కూడా ఉంది! వికలాంగులూ జీవించేందుకు తోడ్పడే ఈ సరికొత్త సాంకేతికత వెనకున్న సహృదయం.. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, మన హైదరాబాదీ సత్యానాదెళ్లది. నాలోని సహానుభూతి’(ఎంపతీ) ఇందుకు కారణమని చెబుతుంటారాయన. ఆ అనుభూతి తనలో ఏర్పడటానికి కారణం.. తన భార్య అనుపమే అని ఈ మధ్య ఓ తాజా వ్యాసంలో చెప్పారు! దాని వెనకున్న ఓ ఉద్వేగభరిత ఘటననీ వివరించారు.

**నా గ్రాడ్యుయేషన్‌ అప్పుడే పూర్తయ్యింది. మైక్రోసాఫ్ట్‌లో ఇంజినీర్‌ల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. వెళ్లాను. రిచర్డ్‌ టెయిట్‌ అనే మేనేజర్‌ నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన నన్ను ఇంజినీరింగ్‌ అంశాలేవీ అడగలేదు. ఒకే ప్రశ్న వేశారు. ‘నువ్వు కారులో వెళుతూ ఉన్నావ్‌. రోడ్డుపక్కన ఓ చిన్నారి ప్లాట్‌ఫామ్‌పై అనాథగా ఏడుస్తోంది. నువ్వేం చేస్తావ్‌?’ అని. నేను ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పాను.. ‘911.. అత్యవసర సేవలకి ఫోన్‌ చేస్తా!’ అని. ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్‌ కాలేదు. అదే జరిగి ఉంటే.. కొన్నేళ్లకు ముందే నేను మైక్రోసాఫ్ట్‌లో చేరేవాన్ని. ఆరోజు వెళుతూ నేను రిచర్డ్‌ని అడిగాను నా లోపం ఎక్కడుంది అని.. ‘ఆయన నా భుజం తట్టి మనిషన్నాక కాస్తయినా సహానుభూతి ఉండాలి. ఓ పాప రోడ్డుపక్కన పడి ఏడుస్తూ ఉంటే కనీసం దగ్గరకు తీసుకోవాలనే ఆలోచన రాదా నీకు?!’ అని. అప్పటికీ నాకు జ్ఞానోదయం కాలేదు. ఆ తెలివి నాకూ వచ్చింది.. ఇంకొన్నేళ్ల తర్వాత. నేను మైక్రోసాఫ్ట్‌లో చేరాక. ముఖ్యంగా నా భార్య అనుపమ ద్వారా!

**ఎన్నెన్నో కలలు కన్నాం.. 1996 నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరం. మైక్రోసాఫ్ట్‌లో ఇంజినీర్‌గా నా కెరీర్‌ మెల్లగా పుంజుకుంటోంది. అనుపమ ఆర్కిటెక్ట్‌గా కుదురుకుంటోంది. భారత్‌లో మా కుటుంబాలకి దూరంగా.. ఇక్కడి సియాటిల్‌లో దంపతులుగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. అనూ నెలతప్పిన విషయం ఇద్దరిలోనూ మరింత ఉత్తేజాన్ని నింపింది. కంపెనీ క్యాంపస్‌కి పక్కనే ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. రాబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులూ, ప్రత్యేక గదినీ అనూ డిజైన్‌ చేస్తోంది. ప్రసవం తర్వాత వారాంతాలు ఎక్కడ గడపాలి, సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్లాలో ఒకరికొకరం చెప్పుకుని మురిసిపోతున్నాం. ఓ కొత్త ఆనందం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఆ రోజు మా ప్రణాళికలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

**పుట్టగానే ఏడ్వలేదు.. అనూకి అప్పుడు తొమ్మిదో నెల. ఓ రోజు రాత్రి.. కడుపులో బిడ్డకి కదలికల్లేవని గుర్తించింది. పక్కనే ఉన్న ఓ ఆసుపత్రికి వెళ్లాం. అత్యవసర చికిత్సా విభాగానికి పంపారు. రాత్రి కాబట్టి మామూలు చెకప్‌ కోసమేనని అనుకున్నా. ‘ఛ.. ఇంత చిన్నదానికి ఇంతింతసేపు వేచి చూడాల్సి వస్తోంది!’ అని ఆరోజు నాలో వచ్చిన విసుగు.. ఇప్పటికీ నాకు గుర్తుంది. కానీ వైద్యులు ఆ పరీక్ష ఫలితం చూసిన వెంటనే ‘సిజేరియన్‌’ చేయాలన్నారు. చేశారు. అలా మావాడు జెయిన్‌ ఆగస్టు 13, 1996లో పుట్టాడు. ఒకటింబావు కిలో మాత్రమే ఉన్నాడు. పుట్టగానే ఏడవలేదు! బిడ్డని అప్పటికప్పుడు మరో పెద్దాసుపత్రికి తీసుకెళ్లిపోయారు వైద్యులు. నేను మాత్రం అనూని చూసుకుంటూ ఉండిపోయాను. ఉదయానే ఆ ఆసుపత్రికి వెళ్లాను. వెళుతున్నప్పుడే నా మనసు ‘నీ జీవితంలో ఓ అనూహ్యమైన మార్పు ఇది’ అని చెప్పడం మొదలుపెట్టింది. వెళ్లాక తెలిసింది మావాడికి సెరిబ్రల్‌ పాల్సీ అని! జీవితాంతం వాడు చక్రాల కుర్చీకే పరిమితమవుతాడని. ఎవరో ఒకరు అతనికి నిత్యం ఆసరాగా ఉండితీరాలని!! నా గుండె ముక్కలైంది. మా ఇద్దరి కలలు ఎందుకిలా తలకిందులయ్యాయనే దుఃఖం తన్నుకొచ్చింది. నా జీవితంలో అదో గడ్డుకాలం అనలేను! అంతకంటే తీవ్రమైన సంక్షోభం అది.

**ఆమె నుంచే నేర్చుకున్నా! కానీ.. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం అనూలో అకస్మాత్తుగా కనిపించిన ఆ గాంభీర్యం. స్థైర్యం. ఆమె ఆలోచనలు నాకంటే భిన్నంగా సాగుతున్నాయి. నాలా ఆమె ‘నేనిప్పుడు ఏం చేయాలో.. ఇందులో నుంచి ఎలా బయటపడాలో..’ అని బాధపడుతూ కూర్చోలా. ‘మాకే ఎందుకు ఇలా జరిగింది?’ అని ఏడవలేదు. బదులుగా వాడి బాధని తాను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అనూ అన్నీ బాబువైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టింది. సహానుభూతి పొందడం ప్రారంభించింది. వాణ్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన తొలిరోజుల్లోనే అనూలో నేను గమనించిన ఆ నిబ్బరం నాకెన్నో జీవితపాఠాలని నేర్పింది. ‘నిజానికి మా ఇద్దరికీ ఏం కాలేదు. జరిగిన నష్టమల్లా బాబుకే..’ అని అర్థంచేయించింది. ఆమెని చూశాకే. ‘ఎందుకిలా జరిగింది..’ అనుకోవడం మాని వాడి జీవితం మెరుగ్గా మారడానికి ఏం కావాలో అన్నీ చేయాలి!’ అనే విషయం బోధపడిందీ అప్పుడే. అనూ.. ఓ స్త్రీగా, భార్యగా, తల్లిగా నాకో అద్భుతమైన వ్యక్తిగా కనిపించడం మొదలుపెట్టింది. ఎదుటివారి పట్ల ఆమెకున్న ఆ సహానుభూతి చాలా లోతైంది. ఓ తండ్రిగానే కాదు.. సీఈఓగానూ నా జీవితంలో ఎదుటివారిపట్ల సహానుభూతిని చూపగలిగితే అది అద్భుతాలు చేయగలదని గ్రహించాను. ఆ అనుభూతే వైకల్యం కారణంగా సమాజానికి దూరమవుతున్న దివ్యాంగులపట్ల ప్రసరించింది. ఓ తల్లిగా తన అనుభవాన్ని.. ఉద్వేగాలని నాతో పంచుకుంటూ అలా అనూ నాలో స్ఫూర్తినింపింది. వైకల్యం ఉన్నవాళ్ల కోసం మేం ఉత్పత్తి చేసిన ఐ ట్రాకర్‌, నరేటర్‌ వంటి వాటి వెనక ఉన్న ప్రేరణ అనూనే.
My wife is my biggest strength-Satya Nadella speaks of his life