Food

ఉసిరికాయ బాగా తినాలి

Amla And Its Health Benefits - Karthika Masam Special Foods

హాయ్‌ ఫ్రెండ్స్‌… నేను ఉసిరి చెట్టును… నా కాయల్ని చూడగానే… చూడ్డమేంటి వింటేనే… నోట్లో నీళ్లూరిపోతాయి మీకు… ఆ వెంటనే పు…ల్ల…ని రుచి గుర్తుకు వస్తుంది… ఇంతకీ వాటినందించే నా రూపురేఖలు ఎలా ఉంటాయి? అసలు నా కథాకమామీషు ఏంటి? తెలుసుకోవాలనుంటే ఇది చదివేయండి!
*ఎక్కువగా ఎక్కడంటే?
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనే పెరిగేస్తా. అయితే ఇండోనేషియా… నన్ను ఎక్కువగా పండించే దేశాల్లో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తా.
*మాలో రకాలు!
మాలో చాలా రకాలే ఉంటాయి. మీ దగ్గర ఎక్కువగా బలవంత్‌, నీలమ్‌, అమ్రిత్‌, కాంచన్‌, కృష్ణ, చక్కియా, బనారసి ఉసిరి జాతుల్ని పెంచుతుంటారు.
*ఎన్నో పేర్లు!
మీరంతా ఉసిరి చెట్టనే పిలుస్తారు. ఆమ్ల, అమలక, భూమి ఆమ్ల, ఇండియన్‌ గూస్‌బెర్రీ ట్రీ అనీ అంటారు. నా శాస్త్రీయ నామమేమో ఫిలాంథస్‌ ఎంబ్లికా. నా కుటుంబం ఫిలాంథిసియా.
**ఎలా ఉంటానంటే?
* నేను మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఎదిగే చెట్టును. ఇంచుమించు 26 అడుగుల నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరిగేస్తా. ఆకులేమో చిన్నగా చింతచెట్టు ఆకుల్లానే ఉంటాయి. పూలేమో ఆకుపచ్చ పసుపు రంగుల్లో ఉంటాయి. ఇక నా కాయలు మీకు బాగా తెలిసే ఉంటుంది. ఆరు నిలువుచారలతో గుండ్రంగా ఉంటాయి. లోపలంతా పీచు ఉంటుంది. ఒకే కొమ్మకి బోలెడన్ని గుత్తులుగుత్తులుగా కాసేస్తుంటాయి.
* నాకు సూర్యరశ్మి కావాలి. అన్ని నేలలూ నాకు అనువుగానే ఉంటాయి. నా మొక్కను నాటిన ఐదు సంవత్సరాలకు కాయలు కాస్తుంటాయి.
* అప్పట్లో అడవుల్లోనే మా చెట్లు ఉండేవి. ఇప్పుడు తోటలుగానూ పెంచుతున్నారు. మీ దేశంలో ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నన్ను ఎక్కువగా సాగు చేస్తుంటారు
***.ఎంతో మేలు చేస్తా!
* నావల్ల మీకు లాభాలు అన్నీ ఇన్నీ కావు.ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తా. ఆయుర్వేదంలోను ఇతర ఔషధాల్లో విరివిగా వాడతారు.* నా కాయలు, పువ్వులు, బెరడు, వేరు ఇలా అన్నీ ఔషధగుణాలున్నవే.
* నాలో విటమిన్‌ సి చాలా ఎక్కువ. రోగనిరోధక శక్తి పెంచడానికి చాలా అవసరమవుతుందిది. ఇంకా కెరోటినాయిడ్స్‌, గ్లూకోజ్‌, క్యాల్షియం, ప్రోటీన్లూ ఉంటాయి.
* అంతేకాక బోలెడన్ని సౌందర్య ఉత్పత్తుల్లో వాడేస్తారు. షాంపూల్లో, హెయిర్‌ ఆయిల్స్‌లో నా కాయల్ని ఉపయోగిస్తారు.
* మీరు ఇంట్లో ఉసిరి పచ్చళ్లు పెట్టుకుంటుంటారుగా. జామ్స్‌, సాస్‌లు, క్యాండీలు, చిప్స్‌, జెల్లీలూ తయారుచేస్తుంటారు.
* నా కలపని టపాకాయల్లో వాడుతుంటారు.
* హిందువులు ఉసిరిచెట్టును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాల్లో ఉసిరి చెట్టుకింద భోజనం చేయడం చాలా మంచిదని నమ్ముతారు.