Agriculture

రైతులే కాకర విత్తనాలు ఇలా తయారు చేసుకోవచ్చు

Telugu Agricultural News-Make your own bittergourd seeds

రాష్ట్రంలో సాగవుతున్న పందిరి కూరగాయ కాకర. ఎన్నో ఔషధ గుణాలున్న దృష్ట్యా కాకరకాయను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే విత్తు దగ్గరే రైతు నష్టపోతున్నాడు. కొన్ని కిటుకులు పాటిస్తే రైతుస్థాయిలోనే కాకరలో విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. ఏడాదంతా ఈ పంటలో రాష్ట్రంలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో యాసంగి లేదా ఎండకాలంలో విత్తనోత్పత్తి చేపట్టాలి. ఎత్తయిన గిరిజన ప్రాంతాలలో అయితే కచ్చితంగా ఎండకాలంలోనే విత్తనోత్పత్తి చేయాలి. సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌ మొదటివారంలో విత్తనాలు విత్తుకోవచ్చు.

*** రకాలు:
నేలలు: విత్తనోత్పత్తికి ఎంచుకునే నేలలో సొంతంగా విత్తుకున్న మొక్కలు ఉండరాదు. మురుగునీరు పోయే నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం.

*** విత్తన ఎంపిక:
కచ్చితంగా నమ్మకమైన సంస్థ లేదా నాణ్యమైన వనరుల నుంచి మాత్రమే విత్తనం సేకరించాలి. నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండి చీడపీడలులేని విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. పలిగిన, రంగు కోల్పోయిన విత్తనాలు తీసివేయాలి.

*** విత్తన మోతాదు:
ఎకరాకు రెండు కిలోలు. నాటడానికి ముందు విత్తనాలను 30 నిమిషాల పాటు వెచ్చని నీటిలో ఉంచాలి. దీంతో విత్తన చివరి గట్టిపొర మెత్తబడుతుంది. తడి ఉన్న గోనె సంచి లేదా తేమతో కూడిన గుడ్డ సంచులలో 3-4 రోజులు ఉంచితే కూడా గింజలు మెత్తబడి, మొలకలు త్వరగా వస్తాయి. కిలో విత్తనానికి నాలుగు గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్ర నాశనితో విత్తనశుద్ధి చేస్తే శిలీంద్రాల తాకిడి తగ్గుతుంది. ప్రధాన పొలంలో నాటడం: ప్రధాన పొలాన్ని 3-4 సార్లు మెత్తగా దున్నాలి. రెండు మీటర్ల మధ్య దూరంతో 60 సెం.మీల వ్యాసార్థంతో కాలువలు చేయాలి. కాలువల సాలులో ఒక మీటరు లోతులో 30 సెం.మీ వ్యాసార్థంతో గుంతలు తయారుచేయాలి. గుంతలలో రెండు సెం.మీ లోతులో నిలువుగా విత్తనాలు విత్తుకోవాలి. మొదట ఒక గుంతకు రెండు విత్తనాలు నాటి, మొలకొచ్చిన తర్వాత పలుచన చేయాలి. విత్తే ముందు గుంతలను తడుపాలి.

*** పోషక యాజమాన్యం:
ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు చివరి దుక్కిలో వేయాలి. ఒక కిలో పశువుల ఎరువును 100 గ్రాముల వేపచెక్కతో కలిపి ప్రతి గుంతలో ప్రాథమికంగా వేయాలి. ఒక నెల తర్వాత గుంతకు 500 గ్రాముల చొప్పున వానపాముల ఎరువు పైపాటుగా మొక్క మొదలులో వేయాలి. సకాలంలో కలుపును తీసివేయాలి. నాటిన తర్వాత వారం వ్యవధులతో నీటి తడువివ్వాలి. పూత సమయం, కాయలు ఏర్పడే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

*** కల్తీలు ఏరివేత:
కాకర స్వతహాగా స్వపరాగం చెందే మొక్క అయితే కొంతమేరకు పరపరాగ సంపర్కం కూడా జరుగుతుంది. శాఖీయ దశ, పూత దశ, కాయలు ఏర్పడే దశలో లక్షణాల ఆధారంగా కల్తీలు గుర్తించి ఏరివేయాలి. 0.2 శాతం కంటే కల్తీలు మించకుండా చూడాలి. మూడు దఫాలుగా క్షేత్ర తనిఖీలు చేపట్టాలి.

*** వేర్పాటుదూరం:
ఫౌండేషన్‌ విత్తనానికి అయితే 1000 మీటర్లు, ధృవీకరణ విత్తనానికి అయితే 500 మీటర్లు వేర్పాటు దూరం ఉండేలా చూడాలి.

*** కాయల కోత:
కాయలు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు పచ్చ లేదా నారింజ రంగులోకి మారిన దశలో మొక్క నుంచి సేకరించాలి. చేతులతో మొక్కల నుంచి ఏరి, పగిలే లేదా నీడలో ఆరబట్టాలి. అవి పగిలిన తర్వాత ప్రకాశవంతమైన విత్తనాలు కన్పిస్తాయి. లేదా తోడుకలు తీసిన తర్వాత రక్తపు రంగుతో కూడిన గింజలను ఒకరోజు పాటు నీళ్లలో మురుగబెట్టాలి. ఆ తర్వాత బాగా కడిగి, ఎండబెట్టి నిల్వ చేయాలి. విత్తన తేమ ఏడు శాతం మించకుండా ఉండాలి. చల్లని, పొడి పరిస్థితులలో నిల్వ చేస్తే ఐదేండ్ల వరకు మొలక శాతం తగ్గకుండా కాకర గింజలు నాణ్యంగా ఉంటాయి.

*** నాణ్యతా ప్రమాణాలు:
కనీస మొలక శాతం: 60, జన్యు స్వచ్ఛత: 98 శాతం

గరిష్ఠ విత్తన తేమ : 74 శాతం, గరిష్ఠ జడ పదార్థం: 2 శాతం

ఒకసారి ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులు పై నాణ్యతా ప్రమాణాలు ఉంటే నాలుగు, ఐదేండ్ల వరకు సాగు చేసుకోవడానికి వాడుకోవచ్చు. మేలైన దిగుబడులు పొందవచ్చు. అయితే సూటి రకాలలో మాత్రమే విత్తనోత్పత్తి చేసుకోవాలి. హైబ్రీడ్లలో రైతుస్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టరాదు.