DailyDose

ఆ దేశాల వీసాలు రద్దు-తాజావార్తలు

India cancels visas of multiple countries-Telugu breaking news roundup today

* ఇటలీ, ఇరాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చేవారికి. భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేసింది. నూతన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటలీ, చైనా, ఇరాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియ దేశాలలో..అనవసర పర్యటనలు చేయకూడదంటూ భారత పౌరులకు కేంద్రం సూచింది. చైనా, దక్షిణకొరియా, ఇరాన్‌, ఇటలీ, హాంకాంగ్‌, మకావ్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్‌, థాయిలాండ్‌, సింగపూర్‌, తైవాన్‌ నుంచి వచ్చేవారికి..మెడికల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన తర్వాతే అనుమతి ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
* కృష్ణా జిల్లా మచిలీపట్నం లో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత.ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వుమన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, రక్షణ నిధి, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, నాగేశ్వర రావు, సింహాద్రి రమేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో డిఐజి ఏఎస్ ఖాన్, ఎస్పీ రవీంద్రబాబు, ఎస్పీ దీపికా పటేల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
* అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ విద్యార్ధి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి చైత్రన్య యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి. ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ అమరావతినే రాజధాని‌గా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు తీర్పు ఆధారంగానే స్థానిక ఎన్నికలు జరగొచ్చునని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి బీజేపీ శనిగ్రహమని, టీడీపీ, వైసీపీలు రాహు కేతువులని అభివర్ణించారు. టీడీపీవైసీపీలు కబాలి పాత్ర పోషిస్తున్నాయనిఅన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని తులసిరెడ్డి విమర్శించారు.
*లోక్‌సభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్‌ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలని పట్టుబట్టారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం, ఢిల్లీ అల్లర్లపై చర్చిద్దామని స్పీకర్‌ ఓం బిర్లా సర్దిచెప్పినా వినని విపక్ష సభ్యులు.. సభలో గందరగోళం సృష్టించారు. విపక్షాల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకింగ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం, స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
*వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియా నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ లీడర్లలో సోషల్‌‌ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌‌ ఉన్న నేత మోడీనే.
*తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన రేవంత్‌ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
*పార్లమెంట్‌లో మంగళవారం సెక్యూర్టీ సైరన్‌ మోగింది. గేట్‌ నెంబర్‌ వన్‌ వద్ద .. బిజెపి ఎంపి వినోద్‌ కుమార్‌ సోనకర్‌ కారు.. బూమ్‌ బారియర్‌ను ఢీకొట్టడంతో.. అక్కడ ఉన్న సెక్యూర్టీ అంతా అలర్ట్‌ అయ్యారు. బూమ్‌ బ్యారికేడ్‌ను కారు అనుకోకుండా తాకడం వల్ల.. దాని నుంచి స్పైక్స్‌ బయటకు వచ్చాయి. దీంతో కారు అక్కడే నిలిచిపోయింది. స్పైక్స్‌ బయటకు వచ్చిన సమయంలో.. సెక్యూర్టీ సైరన్‌ మోగింది. ఆ సమయంలో అక్కడే ఉండే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే వాళ్లంతా పొజిషన్‌ తీసుకున్నారు. 2001 లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన తర్వాత.. గేట్ల వద్ద స్పైక్స్‌లను అమర్చారు. ఇదే తరహా ప్రమాదం గత ఏడాది కూడా జరిగింది. మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపి కారు బారికేడ్లను ఢీకొనడంతో.. గేటు వద్ద ఉన్న స్పైక్స్‌ బయటకు వచ్చాయి. దీంతో ఆ ఎంపి కారు డ్యామేజ్‌ అయ్యింది. కానీ ఆ ఘటన సమయంలో కారులో ఎంపి లేరు
*ఇక ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్‌ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికలను కూడా ఒకేసారి పూర్తి చేయాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. మళ్లీ మళ్లీ ఎన్నికలకు వెళ్లకుండా అన్నిటినీ ఒకేసారి పూర్తి చేయగలమా అనే దానిపై 4వ తేదీ జరగనున్న ఏపీ కేబినెట్‌ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. మార్చి 31లోగా ఎట్టి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి.
*బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. ఢిల్లీ అల్లర్లలో 46 మంది చనిపోతే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్న నితీశ్.. తన 15 ఏళ్ల పాలనలో బీహార్ ఇప్పటికీ ఎందుకు పేద రాష్ట్రంగా మిగిలిపోయిందనే విషయం గురించి మాత్రం మాట్లాడడం లేదని విమర్శించారు.
*ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి తగిన నిధులివ్వాలని 15వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌లకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారమిక్కడ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌తో కలిసి తొలుత 15వ ఆర్థిక సంఘం సభ్యులు అనూప్‌ సింగ్‌, అజయ్‌ నారాయణ ఝా, అశోక్‌ లహరిలతో మంత్రి సమావేశమయ్యారు.
* ఉపాధి పథకం కింద కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన రూ. కోట్లను ఎందుకు పంపిణీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌం టర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరిజస్టిస్‌ ఎన్‌.జయసూర్యల ధర్మాసనం సోమవారం విచారించింది.  ఏడాదికి ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేసిన రూ. కోట్ల బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు వేశారు.
*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం విడుదల చేసిన రూ.1134 కోట్లను ఎందుకు పంపిణీ చేయలేదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
*దిశ యాప్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడే తీరు మొదలుకుని, ఆ సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని అత్యవసర బృందాలకు చేరవేసేంత వరకూ సత్వర స్పందన ఉండాలని అన్నారు.
*కేంద్రం రైల్వేల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునే వరకు ఉద్యమిస్తామని ‘నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌’ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం నాలుగు రోజుల కేంద్ర కమిటీ సమావేశాలను ఆయన సోమవారం ప్రారంభించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వేల ప్రైవేటీకరణను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
*స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతిలో అల్పాదాయ వర్గాల నివాసాలకు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.8 కోట్లు విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*రాజధాని రైతుల పోరాటానికి సంఘీభావంగా అమరావతి పరిరక్షణ సమితికి ప్రకాశం జిల్లా కారంచేడు రైతులు, వివిధ ప్రాంతాలకు చెందిన వారు రూ.3.7 లక్షల విరాళాన్ని అందించారు. సోమవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు చేతులమీదుగా ఈ విరాళాన్ని అందజేశారు. పై మొత్తంలో కారంచేడు రైతులు రూ.2 లక్షలు, తుమ్మల శ్రీనివాస్‌(హైదరాబాద్‌) రూ.లక్ష, ఎస్సార్‌నగర్‌ వాసులు రూ.50 వేలు, కోటేశ్వరి(విశాఖ) రూ.10 వేలు, గంగాధరరావు రూ.10,116 విరాళంగా ఇచ్చారు.
*పట్టణాల్లో అక్రమ నిర్మాణాలను అపరాధ రుసుంతో క్రమబద్ధీకరించే బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం (బీపీఎస్‌) కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 41,461 దరఖాస్తుల్లో ఫిబ్రవరి నెలాఖరుకు 26,631 (64.2 శాతం) పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు పరిష్కరించారు. తగిన వివరాలు లేని కారణంగా 783 దరఖాస్తులు తిరస్కరించగా.. మిగతావి పరిష్కారానికి ఏప్రిల్‌ 30 వరకు గడువు పొడిగించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
*గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ విద్యార్హత ధ్రువపత్రాలను మార్చి 3 నుంచి 10 లోగా అప్‌లోడ్‌ చేయాలని పశుసంవర్ధక శాఖ సంచాలకులు ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమకు నిర్దేశించిన లాగిన్‌ నుంచి అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.
*పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు ఉన్నందున హోలీ ఐచ్ఛిక సెలవు(ఆప్షనల్‌ హాలీడే)ను రద్దు చేస్తూ జిల్లా విద్యాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 10న హోలీని ఆప్షనల్‌ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది.
*ఏపీఎంసెట్‌-2020 ప్రవేశ పరీక్ష నిర్వహణకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే) సన్నాహాలు చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ మార్చి ఒకటో తేదీనే ప్రారంభమైనప్పటికీ తొలి రోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంతో సోమవారం 14,000 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారని ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వి.రవీంద్ర తెలిపారు. దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది తల్లిదండ్రుల పేర్లు, పదో తరగతి మార్కుల జాబితాలోని వివరాలను తప్పుగా నమోదు చేస్తున్నారని తెలిపారు. ఉర్దూలో ఎంసెట్‌ రాసేవారికి కర్నూలులో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్‌ వెబ్‌సైట్‌ http://sche.ap.gov.in/eamcet లో దరఖాస్తులు చేసుకోవాలని, సందేహాలుంటే 0884 – 2340535, 2356255 నంబర్లలో సంప్రదించాలని సూచించార.
*రెండు పడక గదుల ఇళ్లు పూర్తయిన చోట రానున్న రెండు నెలల్లో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్రావు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇళ్ల కోసం ఎవరూ పైరవీలు చేయొద్దని, ఎవరికీ లంచాలు ఇవ్వవద్దని సూచించారు
*ప్రతి ఏటా మాదిరిగానే ఈ దఫా కూడా మార్చి 1వ తేదీన బాబ్లీ జలాశయం గేట్లను అధికారులు ఎత్తారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.31 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా.. ఆదివారం నాలుగు గేట్ల ద్వారా 0.6 టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ కనిపించింది.
*తెలంగాణలో యాదవులు, కురుమలు, ఇతర సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మహారాష్ట్ర నాందేడ్లోని న్యూ మోండా మైదానంలో ఆదివారం జరిగిన గొల్ల, గోలేవార్, యాదవ భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
*ఇరాన్లోనూ కొవిడ్-19(కరోనా వైరస్) ప్రబలుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చే విమాన ప్రయాణికులపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆ దేశం నుంచి ఇటీవల రాష్ట్రానికి చేరుకున్న 8 మంది సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖకు పంపించింది.
*తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివేకానంద విదేశీ విద్యాపథకం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం, రామానుజ బోధన రుసుముల పథకాలకు దరఖాస్తుల గడువును మార్చి 20 వరకు పొడిగించినట్లు పరిషత్ పరిపాలన అధికారి రఘురామ్శర్మ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
*వైఎస్ఆర్ పింఛను కానుక కింద తొలి రోజు 87.37% మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 58.99 లక్షల మందికిగాను 51,39,242 (రాత్రి 9 గంటల వరకు) మందికి గడప వద్దకే వెళ్లి అందించారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద లేకపోతే వారున్న చోటుకే వెళ్లి అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి నగదును అందించారు. అర్హులుగా ఉండి ఫిబ్రవరిలో పింఛను అందని వారికి మార్చి నెలలో రెండు నెలల మొత్తాన్ని ఇచ్చారు. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ ప్రక్రియను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు.
*రాష్ట్రంలోని కుమ్మర్ల సంక్షేమానికి గుజరాత్ తరహాలో చర్యలు చేపట్టాలని ఎంబీసీ రాష్ట్ర ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆదివారం హైదరాబాద్లో కుమ్మరి సామాజిక వర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సన్మానించారు.
*దక్షిణ భారతదేశం దాల్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి చెందిన నంబూరి మధు ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని నాగోల్లో ఆదివారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన మిల్లర సమావేశంలో ఈ మేరకు ఆయన ఎన్నికను ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ దాల్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మధు పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర దాల్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు.
*పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో చేపడుతున్న ఉదండాపూర్ జలాశయ నిర్మాణపనులు నాలుగు రోజుల నుంచి ఆగిపోయాయి. భూ నిర్వాసితులు న్యాయమైన పరిహారం పేరిట ఆందోళనబాట పట్టడంతో పనులు ముందుకు సాగడం లేదు.
*నీటిపారుదల శాఖలో ఇంజినీరింగ్ సర్వీసు నిబంధనలను ప్రభుత్వం శనివారం సవరించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ ఆదేశాలు జారీచేశారు. గతేడాది నవంబర్లో జారీచేసిన ఉత్తర్వుల్లో ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లను రాష్ట్ర స్థాయి క్యాడర్గా గుర్తించారు. తదనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి సర్వీసు నిబంధనల్లోనూ సవరణలు చేశారు. సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ల ఉద్యోగాలను మల్టీ జోనల్ పోస్టులుగా గుర్తించారు.
*ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కి గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ విధులను జయేశ్ రంజన్ నిర్వహించారు.
*కాగితరహిత అన్రిజర్వ్డ్ టికెట్ల విక్రయానికి యూటీఎస్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే.. దాని ద్వారా జరిపే టికెట్ బుకింగ్లో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. సత్వరం టికెట్ల కొనుగోలుకు గాను క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ను జోన్ పరిధిలో అన్ని స్టేషన్లలో అమల్లోకి తెచ్చినట్లు శనివారం వెల్లడించింది. యూటీఎస్ యాప్ ద్వారా స్టేషన్ పరిసరాల్లో ఉన్నవారు, కిలోమీటర్ పరిధిలోని ప్రయాణికులు క్యూఆర్ కోడ్ స్కానింగ్తో టికెట్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.
*తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివేకానంద విదేశీ విద్యాపథకం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం, రామానుజ బోధన రుసుముల పథకాలకు దరఖాస్తుల గడువును మార్చి 20 వరకు పొడిగించినట్లు పరిషత్ పరిపాలన అధికారి రఘురామ్శర్మ శనివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
*రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. దక్షిణ భారతం నుంచి తెలంగాణ వైపు తేమగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్లో శనివారం పగలు 32.8, రామగుండంలో 32.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం తెల్లవారుజామున అత్యల్పంగా ఆదిలాబాద్లో 14.2, రామగుండంలో 18.2, హైదరాబాద్లో 20.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది
*దిల్లీలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు జరిగే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనాలంటూ 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆహ్వానించారు. ఆ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. ‘‘2020-21 ఆర్థిక సంవత్సరానికి మేం ఇచ్చిన నివేదికను కేంద్రం బడ్జెట్తో కలిపి పార్లమెంటులో సమర్పించింది. నివేదిక రూపకల్పనలో మీరు ఎంతగానో సహకరించారు. ఆ నివేదికకు సంబంధించి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు వచ్చే జీఎస్టీ మండలి సమావేశానికి ముందు ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. జీఎస్టీ మండలి సమావేశం మార్చి 14న జరిగే వీలున్నందున 13న మేం భేటీ అవుతాం’’ అని ఎన్కే సింగ్ పేర్కొన్నారు.
*ఆదివాసీల సంస్కృతి, భాషపై దాడి జరుగుతోందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఏఏఆర్ఎం) జాతీయ ఛైర్మన్ మిడియం బాబురావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో ఏఏఆర్ఎం రెండు రోజుల జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. నిరక్షరాస్యులైన ఆదివాసీలు అన్నిరంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జాతీయ కన్వీనర్ దిల్లీ బాబు మాట్లాడుతూ ఆదివాసీ చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను అమలు చేస్తే ఆదివాసీలే ఎక్కువగా నష్టపోతారని ఏఏఆర్ఎం జాతీయ కోశాధికారి జతిన్ చౌదరి అన్నారు. సమావేశాలకు 16 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.
* శ్రీలంక పార్లమెంట్‌ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. పార్లమెంట్‌కు ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌కు ఏప్రిల్‌ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు గోటబాయ తెలిపారు.