Health

రక్తనాళాలు ఉబ్బుతాయి…అదే DVT

Have active lifestyle daily to avoid deep vein thrombosis DVT

పార్కులో వాకింగులూ.. జిమ్‌లో వర్కవుట్‌లూ లేవిప్పుడు. ఇంట్లోనే ఉంటున్నాం. సోఫాలోనో, కుర్చీలోనో కూర్చుంటున్నాం. ఎంతసేపూ ల్యాపీ లేదంటే టీవీ! ఈ రకమైన జీవనశైలి ఊబకాయాన్ని పెంచుతున్నది, లైఫ్‌ స్టయిల్‌ వ్యాధులకూ కారణం అవుతున్నది. మరోవైపు.. రక్తనాళాల సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నది. ఎక్కువ సేపు కూర్చునే ఉండటం వల్ల డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ (డివిటి) అనే సమస్య వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతకమూ కావచ్చు.
ఇలా జాగ్రత్తపడాలి…

* వేసవిలో డీ హైడ్రేషన్‌ ఎక్కువ. దానివల్ల కూడా సమస్య రావొచ్చు. నీళ్లు ఎక్కువగా తాగాలి.
* కదలకుండా ఎక్కువ సేపు కూర్చోవద్దు. ప్రతి అరగంటకోసారి లేచి అటూ ఇటూ నడవాలి. కనీసం కాళ్లనైనా అటూ ఇటూ కదిలించాలి.
* ఒకసారి డివిటి అని నిర్ధారణ అయినవాళ్లు, కాళ్లకు కంప్రెషన్‌ స్టాకింగ్స్‌ అనే ప్రత్యేకమైన సాక్స్‌ వేసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
* అప్పటికే డివిటి లక్షణాలు ఉన్నవాళ్లు… గర్భనిరోధక మాత్రలు, హార్మోన్‌ టాబ్లెట్లు వాడుతున్నా, పీరియడ్స్‌ను వాయిదా వేయడానికి మందులు వేసుకున్నా.. సమస్య మరింత వేగంగా వచ్చే ప్రమాదముంది.

*** ఇవీ లక్షణాలు
కాళ్లనొప్పి,వాపు… డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ ప్రధాన లక్షణాలు. వ్యాయామం, వాకింగ్‌… రెండూ లేని ఈ సమయంలో వచ్చే కాలు నొప్పిని ఉపేక్షించడానికి వీల్లేదు. ఈ నొప్పి ముఖ్యంగా, మోకాలి కింద పిక్కల్లో ఉంటుంది. పెద్దవాళ్లలో మోకాళ్ల నొప్పి సహజమే. కానీ, డివిటి ఉన్నపుడు కేవలం పిక్కల్లో నొప్పి ఉంటుంది. ముందు పిక్కల్లో మొదలైనా… తరువాత తొడల భాగంలో కూడా రావొచ్చు. రోజురోజుకూ నొప్పి పెరుగుతూ ఉంటుంది. పెయిన్‌ కిల్లర్‌ వాడినా తాత్కాలిక ఉపశమనమే.

శరీర భాగాలకు ఆక్సిజన్‌తో కూడిన మంచి రక్తాన్ని తీసుకెళ్లే నాళాలే… ధమనులు (ఆర్టరీస్‌). వీటిలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా, కొవ్వులు పేరుకుపోవడం వల్ల ఈ అవరోధాలు ఏర్పడుతాయి. ఇలాంటి అడ్డంకులే, రక్తం గడ్డ కట్టడం వల్ల కాళ్లలో ఏర్పడితే… డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ (డివిటి). అయితే, ఇక్కడ ధమనుల్లో కాకుండా, సిరల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. శరీర భాగాలన్నింటి నుంచి ఆక్సిజన్‌ లేని చెడు రక్తాన్ని గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలే… సిరలు (వీన్స్‌). కాళ్ల నుంచి రక్తాన్ని గుండెకు తీసుకెళ్లే ఈ నాళాల్లో రక్తం గడ్డ కట్టినప్పుడు ఈతరహా సమస్య వస్తుంది. దీనివల్ల రక్తప్రసరణకు అంతరాయం కలుగుతుంది.

*** ఎందుకిలా?
గుండె నుంచి రక్తం అన్ని శరీర భాగాలకూ వేగంగా వెళ్తుంది. కానీ శరీరం కింది భాగాల నుంచి గుండె వైపు మాత్రం నెమ్మదిగా ప్రసరణ చెందుతుంది. కాళ్ల నుంచి పైకి ఇలా ప్రసరిస్తున్నప్పుడు దాని మీద ఒత్తిడి పడితే… రక్తనాళాల లోపలున్న రక్తం అలజడికి గురై గడ్డ కడుతుంది. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని ఉండటం వల్ల ఇలా ఒత్తిడి పడుతుంది. రక్తకణాల్లో సమస్య ఉన్నప్పుడు సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. థ్రాంబోపీలియాస్‌ లాంటి జన్యు రుగ్మతలు ఉన్నవాళ్లలో డివిటికి ఆస్కారం ఎక్కువ. డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌కి మరో ముఖ్య కారణం డీహైడ్రేషన్‌. అందుకే, వేసవిలో ఈ సమస్య అధికం. దీనివల్ల రక్తప్రసరణ ప్రభావితమై డివిటి రావచ్చు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ కూడా రక్తంలో క్లాట్స్‌ను పెంచుతుందని అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది. అందువల్ల కరోనా ఉన్నా లేకపోయినా డివిటి ప్రమాదం పొంచే ఉంటుంది.

*** నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం
కొన్నిసార్లు డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ ప్రాణాల మీదకు రావొచ్చు. కాళ్లలో గడ్డ కట్టిన రక్తం గుండెకు, ఊపిరితిత్తులకు వెళ్లే ఆస్కారమూ ఉంటుంది. అదే కనుక జరిగితే, ప్రాణానికే ప్రమాదం. దాన్ని పల్మనరీ ఎంబాలిజమ్‌ అంటారు. గడ్డ కట్టిన రక్తం కాళ్ల నుంచి సిరల ద్వారా గుండెకు వెళ్లి, అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. అయితే ఈ సమస్య ఎవరిలో వస్తుందో చెప్పడం కష్టం. కాలిలో డివిటి సమస్య ఏర్పడిన ప్రతి పది మందిలో ఒకరు లేదా ఇద్దరికి అలా తెలియకుండానే రక్తం గడ్డ ఊపిరితిత్తులకు వెళ్లిపోతుంది. పల్మనరీ ఎంబాలిజమ్‌ ఉన్నప్పుడు తీవ్రమైన ఆయాసం కూడా వస్తుంటుంది. అకస్మాత్తుగా ఆయాసం వస్తే, వెంటనే అప్రమత్తం కావాలి.

*** పరిష్కారం ఏమిటి?
మొదటి పది రోజుల్లో సమస్యను కనుక్కోగలిగితే రకాన్ని కరిగించే మందును రక్తనాళాల్లోకి పంపి గడ్డను తీసేయొచ్చు. దీన్ని థ్రాంబోలైటిక్‌ థెరపీ అంటారు. రక్తం గడ్డ కట్టడమనేది ఒక చిన్న ముక్కలాగా ఓచోటే ఉండదు. కాలు మొత్తం ఉంటుంది. అందువల్ల ఇంజెక్షన్‌ సరిపోదు. మోకాలు దగ్గరి నుంచి వైర్‌ పంపించి కెథటర్‌ ద్వారా రక్తనాళాల్లోకి థ్రాంబోలైటిక్‌ మందులను అందిస్తారు. ఈ చికిత్స 24 నుంచి 48 గంటల సేపు ఉంటుంది. ఈ రెండు రోజుల్లో రక్తంలోని గడ్డలన్నీ కరిగిపోతాయి. అయితే ఇందుకోసం హాస్పిటల్‌లో చేరాల్సి ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో లేనివాళ్లకు, ఇటీవల ఆపరేషన్‌ అయినవాళ్లకు… ఈ పద్ధతి పనికిరాదు. తేడా వస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటివాళ్లకు హెపారిన్‌ లాంటి యాంటి కోయాగ్యులెంట్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి రక్తాన్ని పలుచన చేస్తాయి. కానీ ఇందుకు, మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఇకపోతే, పల్మనరీ ఎంబాలిజమ్‌ సమస్య వస్తే అత్యవసరంగా హాస్పిటల్‌లో చేరాలి. వీళ్లకి కూడా థ్రాంబొలైటిక్‌ థెరపీ ఇస్తారు. కానీ కెథటర్‌ను ఊపిరితిత్తుల వరకు తీసుకు వెళ్లి నేరుగా వాటిలోకి థ్రాంబోలైటిక్‌ మందులను పంపిస్తారు. లేదా పేషెంట్‌ పరిస్థితిని బట్టి సిస్టమిక్‌ థ్రాంబొలైటిక్‌ థెరపీ ఇస్తారు. జన్యుపరమైన కారణాల వల్ల డివిటి సమస్య ఉంటే జీవితాంతం యాంటి కోయాగ్యులెంట్స్‌ తీసుకోవాలి. సాధారణంగా ఈ మాత్రలు లేదా ఇంజెక్షన్లను ఆరు నెలల పాటు వాడాల్సి ఉంటుంది. జన్యుసమస్యల వల్ల డివిటి ఉన్నవాళ్లకు జీవితాంతం మందులు తప్పనిసరి.

*** స్కాన్‌తో నిర్ధారణ
కాళ్లలో మాత్రమే సమస్య ఉంటే డాప్లర్‌ టెస్ట్‌ చేస్తారు. దీన్ని వీనస్‌ డాప్లర్‌ స్కాన్‌ అంటారు. ఇది కూడా ఒక రకమైన అల్ట్రాసౌండ్‌ స్కాన్‌. అయితే దీన్ని కాళ్లలోని రక్తనాళాలని చూడటానికి వాడుతారు. కాళ్ల నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంటే, చెస్ట్‌ సీటీ స్కాన్‌ అవసరం అవుతుంది. గుండెకు ఎకో పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. కొందరిలో క్రోమోజోమ్‌ వ్యాధుల వల్ల కలిగే జెనెటిక్‌ థ్రాంబోపీలియా ఉందేమో తెలుసుకోవడానికి జన్యుపరీక్షలు చేయాల్సి వస్తుంది.