DailyDose

₹75వేలకు భారత సైనిక రహస్యాల అమ్మకం-నేరవార్తలు

₹75వేలకు భారత సైనిక రహస్యాల అమ్మకం-నేరవార్తలు

* పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న ఇద్దరు రక్షణ శాఖ ఉద్యోగులను రాజస్థాన్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని పట్టుకోవడానికి సైనిక గూఢచర్య సంస్థ (ఎంఐ) ఆధ్వర్యంలో ఏడాదిగా ఆపరేషన్‌ నడిచింది. నిందితులను వికాస్‌ కుమార్‌ (29), చిమన్‌ లాల్‌ (29)గా గుర్తించారు. వికాస్‌.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో సైనిక మందుగుండు సామగ్రి డిపోలో పనిచేస్తున్నాడు. బీకానేర్‌లో సైన్యానికి చెందిన ‘మహాజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ (ఎంఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో కాంట్రాక్టు ఉద్యోగిగా చిమన్‌లాల్‌ పనిచేస్తున్నాడు. పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి ఉన్న ఈ రెండు స్థావరాలు.. వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. ఈ ‘ఇంటి దొంగల’ గుట్టును విప్పడానికి ఎంఐలోని లఖ్‌నవూ విభాగం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) ‘డెజర్ట్‌ చేజ్‌’ పేరిట గత ఏడాది ఆగస్టులో ఆపరేషన్‌ను చేపట్టాయి. అనూష్క చోప్రా అనే నకిలీ పేరుతో పాక్‌ గూఢచారి ఒకరు వికాస్‌కు గాలం వేసినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను పాకిస్థాన్‌లోని ముల్తాన్‌కు చెందిన యువతిగా నిర్ధరించారు. బీకానేర్‌లో సైన్యం, మందుగుండు సామగ్రి, విన్యాసాలు, కాల్పుల అభ్యాసం కోసం అక్కడికి వస్తున్న సైనిక విభాగాల వివరాలు, ట్యాంకులు, ఇతర వాహనాల ఫొటోలను వికాస్‌.. పాక్‌కు చేరవేస్తున్నట్లు నిర్ధరించారు. ఇందుకు ప్రతిఫలంగా అతడికి నగదు అందుతోందని, సోదరుల బ్యాంకు ఖాతాల ద్వారా ఆ సొమ్మును అతడు అందుకున్నట్లు తేల్చారు. చిమన్‌లాల్‌ ద్వారా ఎంఎఫ్‌ఎఫ్‌ఆర్‌లో నీటి పంపిణీ రిజిస్టర్‌కు సంబంధించిన ఫొటోలను వికాస్‌ సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

* అన్న ఆర్థిక ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయిన తమ్ముడు కడతేర్చి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. దుండిగల్‌ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం మార్కెట్‌లో రోడ్డులో ఉండే షాజదాబేగంకు ఇద్దరు సంతానం. మొదటి భర్త కుమారుడు సాబేర్‌(29), రెండో భర్త కుమారుడు అజం. సాబేర్‌ సొంతంగా ట్యాంకర్‌ కొని వ్యాపారం చేసుకుంటూ సొంత ఇల్లు కట్టుకొని భార్య, కుమారుడితో వేరుగా ఉంటున్నాడు. మెడికల్‌ షాప్‌లో పనిచేస్తున్న అజం.. ఇది జీర్ణించుకోలేకపోయాడు. భార్య, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లడంతో సాబేర్‌ శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. తమ్ముడికి ఫోన్‌ చేసి రమ్మన్నాడు. అర్ధరాత్రి ఆర్థిక లావాదేవీల విషయంలో వాగ్వాదం జరిగింది. బెడ్‌షీట్‌తో అన్న మెడకు ఉరి బిగించి హత్యచేసి వెళ్లిపోయాడు. ఏమీ జరగనట్లు వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చాడు. అతిగా మద్యం తాగడం వల్లనో.. లేదా గుండెపోటుతోనో మృతిచెంది ఉంటాడని నమ్మబలికాడు. పోలీసులు అజంను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఆమె వివాహ జీవితంపై ఎన్నో కలలు కంది. తమ కంటే ఉన్నత సామాజిక వర్గానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయం కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికితోడు వివాహం తర్వాత లాక్‌డౌన్‌ కావడంతో అందరూ ఇంట్లోనే సందడిగా జీవితం సాగిపోతుండడంతో ఎంతో సంతోషించింది. ఇదంతా నెల రోజుల మాత్రమే. రెండో నెల నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. ఆమె తల్లిదండ్రులకు ఆ డబ్బులు ఇచ్చే ఆర్థిక వెసులుబాటు లేదు. దీనికితోడు వేధింపుల స్థాయి పెరిగింది. దీంతో మూడు నెలలకే ఆమె ఉరేసుకుని తన ప్రాణాలు తీసుకుంది.

* మరి కొన్ని రోజుల్లో ఓ పండంటి పాపాయికి జన్మనివ్వాల్సిన ఆ ఇల్లాలు అర్ధాంతరంగా కన్నుమూసింది. పేస్ట్‌ అనుకుని ఎలుకల మందుతో దంతాలు శుభ్రం చేసుకున్న గర్భిణి మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడేనికి చెందిన దర్శినపు నాగరాజుకు కృష్ణాజిల్లా జంగన్నగూడెం గ్రామానికి చెందిన మౌనికతో ఏడాది కిందట వివాహమైంది. ప్రస్తుతం మౌనిక తొమ్మిది నెలల గర్భిణి. ఆమె ఈ నెల 5న ఇంట్లోని ఎలుకల మందును పళ్లు తోముకునే పేస్ట్‌ అనుకుని శుభ్రం చేసుకుంది. రెండు రోజులు బాగానే ఉంది. తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కడుపులోని శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మౌనిక పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.