NRI-NRT

హార్వార్డ్ డీన్‌గా శ్రీకాంత్

Srikant Datar To Be Harvard's Dean From January 2021

100ఏళ్లకు పైగా చరిత్ర గల హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ (హెచ్‌బీఎస్) డీన్‌గా భారత సంతతికి చెందిన శ్రీకాంత్‌ దాతార్‌ నియమితులయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌లో ఒకటైన ఈ సంస్థ డీన్‌గా దాతార్‌ నియామకం జనవరి 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈయన నితిన్‌ నోహ్రియా నుంచి ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. దాతార్‌ సృజనాత్మక విద్యావేత్త, గొప్ప పండితుడు, అత్యుత్తమ దార్శినికుడని ఈ సందర్భంగా బోస్టన్‌, మసాచూసెట్స్‌లో నెలకొన్న ఈ విశ్వవిద్యాలయం ప్రశంసించింది. దాతార్‌, ముంబయి విశ్వ విద్యాలయానికి చెందిన సెయింట్‌ జేవియర్‌ కళాశాలలో గణితం, ఆర్థిక శాస్త్రాలతో పట్టభద్రుడయ్యారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ కూడా అయిన ఈ విద్యావేత్త.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లమా పూర్తి చేశారు. అనంతరం స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ కొనసాగించారు. 1984 నుంచి 1989 వరకు కార్నెజ్‌ మెల్లాన్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌లో ఆచార్యునిగా సేవలందించారు. 1996లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆచార్య బృందంలో చేరారు. 2015 నుంచి హార్వర్డ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ (ఐ ల్యాబ్స్) అధ్యక్షుడిగా వ్యవహరించటం ఆయన నిర్వహించిన ఉన్నత పదవుల్లో ఒకటి.