Business

చక్రవడ్డీ కూడా మాఫీ-వాణిజ్యం

చక్రవడ్డీ కూడా మాఫీ-వాణిజ్యం

* పండగ సీజన్‌లో రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెలువరించింది. వీలైనంత త్వరగా చక్రవడ్డీ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేయడం గమనార్హం. వడ్డీ మాఫీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది.

* లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వాహన విక్రయాలు దేశీయంగా క్రమంగా పుంజుకుంటున్నాయి. కానీ, ఎగుమతుల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రధాన వాహన తయారీ కంపెనీలన్నీ దేశీయంగా రెండంకెల వృద్ధి సాధించాయి. కానీ, ఎగుమతులు మాత్రం మరింత కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా ప్యాసెంజర్‌ వాహన విక్రయాల్లో 17.02 శాతం వృద్ధి నమోదైంది. అదే ఎగుమతులు మాత్రం 41.96 శాతం తగ్గాయి.

* కొవిడ్‌ పరిణామాల నుంచి జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్న తరుణంలో, దసరా-దీపావళి పండుగల సీజన్‌ తమకు అమ్మకాలు తెచ్చిపెడుతుందని బంగారు, వజ్రాభరణాల వర్తకులు ఆశిస్తున్నారు. ఏడాదిలో జరిగే మొత్తం వ్యాపారంలో 60-65 శాతం ఈ పండుగ సీజన్‌లోనే జరిగే అవకాశం ఉందని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ దేశీయ మండలి (జీజేసీ) ఛైర్మన్‌ అనంత పద్మనాభన్‌ అంచనా వేస్తున్నారు. గతవారం నుంచి విక్రయశాలలకు వస్తున్న కొనుగోలుదార్ల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. వివాహాది శుభకార్యాలు కూడా ప్రస్తుత త్రైమాసికానికి వాయిదా పడటం, అతిథుల సంఖ్యపై ఆంక్షలు కొనసాగుతున్నందున, ఈ రూపేణ తగ్గే ఖర్చు కూడా ఆభరణాలకే అధికులు వెచ్చిస్తారనే అంచనాను వెలిబుచ్చారు. దసరా పండుగ రోజు అధిక కొనుగోళ్లు ఉంటాయని, ఈసారి ఆదివారం కావడం వల్ల మరింత ఎక్కువమంది విక్రయశాలలకు తరలి వస్తారనే ఆశాభావాన్ని పీఎన్‌జీ జువెలర్స్‌ ఛైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ వ్యక్తం చేశారు.

* స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఎమ్‌ఐ ఇండియా పండుగ సంబరాల్లో భాగంగా వారంరోజుల్లోనే 50 లక్షల ఫోన్లను విక్రయించినట్లు తెలిపింది. ఇ-కామర్స్‌ పోర్టల్స్‌ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తమ తొలి పండుగ సీజన్‌ విక్రయాల్ని ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించాయి. ‘పండుగ రాయితీలు, ఆఫర్లు ఉండటంతో ఎమ్‌ఐ అభిమానులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్లను 15,000కు పైగా ఉన్న రిటైల్‌ భాగస్వాముల దగ్గర కొనుగోలు చేశారు. 17,000 పిన్‌కోడ్లలో ఉంటున్న వినియోగదార్లకు చేరువ కావడానికి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు తోడుగా ఎమ్‌ఐ.కామ్‌ కూడా సహాయపడింద’ని కంపెనీ తెలిపింది. తమకున్న 15,000కు పైగా రిటైల్‌ భాగస్వాముల దగ్గర వార్షిక ప్రాతిపదికన పండుగ విక్రయాలు రెండింతలు అయ్యాయని పేర్కొంది. ‘5 మిలియన్‌ మార్కు అనేది మా వినియోగదార్లకు మా మీద ఉన్న నమ్మకానికి సాక్ష్యం. నమ్మకమైన ధర, నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఎమ్‌ఐ ఇండియా పని చేస్తోంద’ని ఎమ్‌ఐ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రఘురెడ్డి వెల్లడించారు.