DailyDose

ఏలూరులో భారీగా పెరిగిన కేసులు-తాజావార్తలు

ఏలూరులో భారీగా పెరిగిన కేసులు-తాజావార్తలు

* ఏలూరుకు కేంద్ర వైద్య బృందాన్ని అత్యవసరంగా పంపనున్న కేంద్రం. రేపు ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై విచారణ చేయనున్న బృందం.బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్, వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి. రేపు సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని ఆదేశం. ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (పిహెచ్ డివిజన్) నుంచి ఉత్తర్వులు జారీ.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. ఇప్పటి వరకు 345 కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్‌ అధికారికంగా వెల్లడించారు. 160 మంది డిశ్ఛార్జ్‌ అయ్యారన్నారు. 14 మందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ పంపించామని ఆయన తెలిపారు. వ్యాధి కారణాలు ఇప్పటికీ తెలియడం లేదని, నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ఆయన చెప్పారు. వైరల్‌ టెస్టులు నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. నీటిలో మెటల్‌ టెస్టులు కూడా చేశామని, ఫలితాలు రావాల్సి ఉందని అన్నారు. నీటిని పరిశోధించడానికి నమూనాలను సీసీఎంబీకి కూడా పంపినట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఐఐఎంఆర్‌, ఎయిమ్స్‌ తదితర బృందాలు కూడా వస్తున్నాయని, స్థానికులు అందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్‌ వివరించారు. ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దెందులూరులోనూ ఇదే కారణాలతో కేసులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

* రైతుల పోరుకు పెరిగిన మద్దతు. విపక్షం యావత్తూ సంఘీభావం. రేపటి బంద్‌లో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుంది: కేసీఆర్‌. జాతీయ రహదారులపై రాస్తారోకో: కేటీఆర్‌.

* నేడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిరసన దీక్షలు…జనసేనాని పవన్ పిలుపుమేరకు నివర్ తుఫాను బాధితులకి తక్షణ సహాయంగా 10 వేల రూపాయలు అందించాలని డిమాండ్.

* నేడు, రేపు భారీ వర్షాలు… రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లోనే.

* మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన రేపటి భారత్‌ బంద్‌కు 24 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, శిరోమణి అకాలీదళ్‌, సీపీఐ(ఎంఎల్‌), పీఏజీడీ (గుప్కర్‌ కూటమి), తృణమూల్‌ కాంగ్రెస్‌, తెరాస, ఎంఐఎం, ఆప్‌, జేడీఎస్‌, బీఎస్పీ, పీడబ్ల్యూపీ, బీవీఏ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వార్డ్‌ బ్లాక్‌, ఎస్‌యూసీఐ (సీ), జ్వరాజ్‌ ఇండియా పార్టీలు తమ పూర్తి మద్దతును తెలిపాయి. మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బంద్‌ జరుగుతుందని రైతులు ప్రకటించిన విషయం తెలిసిందే.

* అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ వచ్చేలా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పత్తి సాగు, మార్కెటింగ్‌పై ఆయన సూచనలు చేశారు. రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని.. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలన్నారు.

* దేశం అభివృద్ధి చెందడం కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ వైపు దిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో.. మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈమేరకు మంగళవారం నిర్వహించిన ఆగ్రా మెట్రో రైల్‌ ప్రాజెక్టు వర్చువల్‌ ప్రారంభ కార్యక్రమంలో మోదీ వెల్లడించారు.

* తెలంగాణ రైతులకు శుభవార్త. త్వరలోనే రెండో విడత రైతుబంధు సహాయం అందివ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాసంగి పెట్టుబడి కోసం రైతుబంధు సహాయం ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై అధికారులతో ఆయన చర్చించారు. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమచేయాలని కేసీఆర్‌ సూచించారు.

* రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఈనెల‌ 25న 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అదే రోజు 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులతో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు.

* వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. తొలుత వ్యవసాయ బిల్లులోని నిబంధనలకు మద్దతు తెలిపిన పార్టీలు ఇప్పుడు వ్యతిరేకించడమేంటని ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ మేరకు ప్రసాద్‌ సోమవారం ఓ సమావేశంలో మాట్లాడారు. ‘వ్యవసాయ రంగంలో కేంద్రం చేపట్టిన సంస్కరణలపై రైతుల్లో నెలకొన్న అపోహల్ని వివరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని విమర్శించారు.

* పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌తో పాటు దాదాపు రూ.150కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నగరం నడిబొడ్డున చేపట్టిన ఐటీహబ్‌ ఆరు అంతస్తులను పరిశీలించారు.

* పశ్చిమ బెంగాల్‌ మఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న నిరసనలకు ఆమె మద్దతు తెలిపారు. భాజపా అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తానని ఇందుకు జైలుకెళ్లేందుకైనా సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలి లేదా అధికారం నుంచి వైదొలగాలని మమతా డిమాండ్ చేశారు.

* భారత్‌బంద్‌ కారణంగా రాష్ట్రంలో రేపు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్లుండి నుంచి జరగనున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని.. వాటిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత వెల్లడిస్తామని ఓయూ పరీక్షల విభాగం పేర్కొంది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 10న నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూహెచ్‌ పేర్కొంది.

* మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌కి మెరుగైన సేవలందిస్తోంది సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్. తాజాగా ఆండ్రాయిడ్‌ ఐఓఎస్‌ యూజర్స్‌ కోసం గూగుల్ మ్యాప్స్‌లో గో ట్యాబ్ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల మనం తరచుగా వెళ్లే ప్రదేశాలను మ్యాప్స్‌లో పిన్ చేసుకోవచ్చు. అంటే సూపర్ మార్కెట్‌లు, పాఠశాలలు, షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటికి వెళ్లే దారిని గుర్తుపెట్టుకోకుండా మ్యాప్‌లో పిన్‌ చేసుకుంటే సరిపోతుంది.