Business

అమెరికాను దాటేయనున్న చైనా-వాణిజ్యం

Business News - China Will Cross USA By 2028

* 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను దాఖలు చేసే చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో, పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆదాయపు శాఖ ‘జాట్‌పట్ ప్రాసెసింగ్’ అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దాఖలు చేయడంలో ‘జాట్‌పట్ ప్రాసెసింగ్’ ఫీచర్ సహాయపడుతుంది. ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 కోసం ‘జాట్‌పట్ ప్రాసెసింగ్’ ప్రారంభమైంది. ‘జాట్‌పట్ ప్రాసెసింగ్’ ద్వారా ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ని ఎలా దాఖలు చేయాలో వివరించే ట్యుటోరియల్ వీడియోను ఆదాయపు పన్ను శాఖ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.

* యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యాపారాలు లేక అనేక కంపెనీలు మూతబడ్డాయి. ముఖ్యంగా దేశీయ విమానయాన రంగంపై కరోనా పెను ప్రభావం చూపించింది. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో నెలల తరబడి విమానాలు ఎగరలేదు. దీంతో ఎయిర్‌లైన్లకు నష్టాలు ఎదురయ్యాయి. ఫలితంగా కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు పెట్టాయి. మరికొన్ని కంపెనీలు సిబ్బంది జీతాలు తగ్గించడం లేదా అసలు ఇవ్వకుండా సెలవులపై పంపించడం చేశాయి. దీంతో ఈ రంగంలో ఉపాధి పొందుతున్న ఎంతోమంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి.

* ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాను.. రెండో స్థానంలో ఉన్న చైనా 2028 నాటికి అధిగమించనుందని ఓ నివేదిక వెల్లడించింది. తొలుత అంచనా వేసిన దానికంటే ఐదేళ్లు ముందుగానే అగ్రరాజ్యాన్ని చైనా దాటేయనుందని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడంలో ఇరు దేశాల మధ్య ఉన్న భారీ వైరుధ్యమే ఇందుకు కారణమని వివరించింది. కొంత కాలంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇతివృత్తం.. చైనా, అమెరికా మధ్య ఆర్థిక, అధికారం కోసం జరుగుతున్న పోరు చుట్టే తిరుగుతోందని ‘సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చి(సీఈబీఆర్‌)’ వార్షిక నివేదిక అభిప్రాయపడింది.

* భారత్‌లో క్రీడా, ఫ్యాషన్‌, వినోద కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, అమలుతో పాటు వాణిజ్యీకరణ వ్యాపారంలో నిమగ్నమైన ఐఎంజీ-రిలయన్స్‌లో (ఐఎంజీ-ఆర్‌) ఐఎమ్‌జీ సింగపూర్‌ వాటా 50 శాతాన్ని కూడా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య కచ్చితంగా అమలయ్యే ఒప్పందం కుదిరింది. రూ.52.08 కోట్లతో ఈ వాటా కొనుగోలు పూర్తి చేయనున్నట్లు ఆర్‌ఐఎల్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ ఒప్పందం పూర్తవగానే ఐఎంజీ-ఆర్‌ సంస్థ ఆర్‌ఐఎల్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మారిపోతుంది. 2010లో అంతర్జాతీయ స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఐఎంజీ-ఆర్‌ను ఐఎంజీ, ఆర్‌ఐఎల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఐఎంజీ విషయానికొస్తే క్రీడలు, ఫ్యాషన్‌, ఈవెంట్లు, మీడియాలో ప్రపంచ అగ్రగామి సంస్థ ఇది. 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐఎంజీ-ఆర్‌ భారత్‌లో ఇవే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ 2019-20లో రూ.181.70 కోట్లు, 2018-19లో రూ.195.55 కోట్లు, 2017-18లో రూ.158.26 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది.

* వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారతీయ వాహన పరిశ్రమలో బలమైన వృద్ధి కనిపించే అవకాశం ఉందని నోమురా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా వేసింది. కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థలో రికవరీ వస్తుండటంతో పాటు వాహన రంగానికి ఉన్న సానుకూలతలే ఇందుకు కారణమని వివరించింది. విద్యుత్‌ వాహన విక్రయాలు ముఖ్యంగా ద్విచక్ర వాహన విక్రయాలు దన్నుగా నిలుస్తాయని తెలిపింది.