Business

టాటా మోటార్స్ కొత్త బాస్-వాణిజ్యం

టాటా మోటార్స్ కొత్త బాస్-వాణిజ్యం

* వరుసగా ఐదో రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ నెలలోనే ధరల పెరగటం ఇది ఏడోసారి.పెట్రోలు, డీజిల్​పై లీటరుకు 39 పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.దిల్లీలో లీటరు పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై​ 36 పైసలు పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 88.44, డీజిల్ రూ. 78.74కు చేరింది.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు రూ. 94.93, డీజిల్ రూ. 85.70కు చేరింది.గడిచిన 44 రోజుల్లో 17 సార్లు ధరలు పెంచాయి చమురు సంస్థలు. దీంతో సామాన్యుడిపై పెనుబారం పడుతోంది.

* ఇక, తెలుగు రాష్ట్రాల్లోని 14 మార్గాల్లో ప్రయివేట్ రైళ్లు నడవనున్నాయి. విజయనగరం- పూరి (వారానికి మూడు సర్వీసులు), హౌరా- విజయవాడ-చెన్నై (ప్రతి రోజూ), సికింద్రాబాద్‌- శ్రీకాకుళం (ప్రతి రోజూ), హైదరాబాద్‌- తిరుపతి (ప్రతి రోజూ), గుంటూరు- హైదరాబాద్‌ (ప్రతి రోజూ), తిరుపతి- సికింద్రాబాద్‌-వారణాసి (వారానికి రెండుసార్లు), తిరుపతి- నర్సాపూర్‌ వయా విజయవాడ (బైవీక్లీ), విశాఖపట్నం-బెంగళూరు (బైవీక్లీ), విశాఖపట్నం- విజయవాడ (ప్రతి రోజూ), హౌరా- సికింద్రాబాద్‌ (ప్రతిరోజూ), చెన్నై- తిరుపతి (వీక్లీ), పాండిచ్చేరి- కాచిగూడ (ప్రతి రోజూ), మైసూరు- విజయవాడ- భువనేశ్వర్‌ (ప్రతి రోజూ), హౌరా- బెంగళూరు (ప్రతి రోజూ) మార్గాల్లో ఆధునిక రైళ్లు నడవనున్నాయి.

* భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్‌ కొత్త బాస్‌ను ఎన్నుకుంది. ప్రస్తుత సీఎండీ పదవిని వీడనున్న తరుణంలో 2021 జూలై 1 నుండి మార్క్ లిస్టోసెల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు టాటా మోటార్స్ శుక్రవారం (నిన్న) ప్రకటించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో గుంటర్‌ బషెక్‌ స్థానంలో ఈ కొత్త నియామకం జరగింది. బషెక్‌ వ్యక్తిగత కారణాలతో జర్మనీకి మారనున్న సంగతి తెలిసిందే.

* కొలంబో ఓడరేవు తూర్పు కంటెయినర్‌ టెర్మినల్‌(ఈసీటీ) అభివృద్ధి కోసం భారత్‌-జపాన్‌తో కుదుర్చున్న త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఏకపక్షంగా వెనకడుగు వేసిన శ్రీలంక అందుకు గల కారణాలను గురువారం అక్కడి పార్లమెంటుకు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఉన్న ఓ భారత కంపెనీ కొత్త నిబంధనలకు అంగీకరించని కారణంగానే డీల్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటూ సాకులు చెప్పుకొచ్చింది. ఈ మేరకు అక్కడి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో ఆ దేశ నౌకాశ్రయాల అభివృద్ధి శాఖ మంత్రి రోహిత అభయగుణవర్ధణే సమాధానం ఇచ్చారు. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే దేశంలో వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవడంతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ ప్రతిపాదించిన కొత్త నిబంధనలకు భారత కంపెనీ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. అందువల్లే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

* అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారమనేది అపోహ మాత్రమేనని ఎప్పుడో తేలిందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే సంస్థలను కొనసాగిస్తూ, నిర్వహణ స్వేచ్ఛ, యాజమాన్య హక్కులను వేరుచేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌ ఛాంబర్‌ నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. సంస్థల పనితీరును యాజమాన్య హక్కుల మార్పిడి మారుస్తుందన్న ఆలోచన సహేతుకం కాదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ నష్టపోతున్న సంస్థలున్నాయని గుర్తు చేశారు. ‘భారత్‌లో బ్యాంకింగ్‌ వాతావారణం గురించి చాలా మంది చాలా చెప్పారు. కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ దేశాల్లో, భారత్‌లో బ్యాంకులకు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంస్థకు ప్రభుత్వాల హామీ లభించడమే అన్నింటికీ కారణం’ అని ముంద్రా తెలిపారు. వృద్ధికి అవకాశం ఉన్నా కూడా మూలధనం కొరత ఎదురవుతోందని, వేర్వేరు రంగాల నుంచి డిమాండ్లు రావడం ఇందుకు కారణమని వివరించారు.