ScienceAndTech

సిద్ధిపేటలో అత్యాధునిక పోలీస్ కమీషనరేట్ ప్రారంభం-తాజావార్తలు

సిద్ధిపేటలో అత్యాధునిక పోలీస్ కమీషనరేట్ ప్రారంభం-తాజావార్తలు

* రానున్న శతాబ్దకాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పరిపాలనా సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష. ముఖ్యమంత్రి ఆకాంక్ష కనుగుణంగానే సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను పోలీస్ శాఖ నిర్మించింది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించడం ద్వారా నేర పరిశోధనతోపాటు శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన పోలీసింగ్ ను చేపట్టేవిధంగా నిర్మించిన ఈ పోలీస్ పాలనా భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (ఆదివారం ) ప్రారంభించారు. పూర్తిగా పర్యావరణ హిత, హరిత ప్రమాణాలతో మొత్తం 58,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సిద్ధిపేట పోలీసు కమీషనరేట్, 52 ,000 చ,అ విస్తీర్ణంలో నిర్మించిన కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ భవన నిర్మాణాలు డిజైన్ తో పాటు దీనిలో ఉండాల్సిన సౌకర్యాలన్నింటినీ సి.ఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి నిర్థారించారు. ఈ నూతన పోలీస్ కార్యాలయ భవనాల్లో పౌరులతో పీస్ కమిటీ, మైత్రి సంఘాలు, పోలీసు అధికారులతో సమావేశాల నిర్వహణకు విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ సెల్, డిజిటల్ ట్రైనింగ్ సెంటర్, ఫంక్షనల్ వర్టికల్ మానిటరింగ్ కేంద్రం…ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ప్రత్యేక విభాగాలున్నాయి. ఇదే విధమైన పోలీస్ కార్యాలయ భవనాలను రాష్ట్రంలోని అన్ని కమీషనరేట్ లు, జిల్లాలలో నిర్మించాలని ముఖ్యమంత్రి చేసిన ఆదేశాల మేరకు వీటి నిర్మాణం చేపట్టేందుకు పోలీస్ శాఖ ప్రణాలికలను రూపొందించింది.

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్ధిపేట విచ్చేశారు. సిద్ధిపేటలో నిర్మించిన పలు భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎవరేమనుకున్నా తాము పట్టించుకోవడంలేదని, తమ పని తాము చేసుకపోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు. తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో ముందున్న పంజాబ్ ను కూడా అధిగమించాని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ వస్తోందని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తోలు తీయాలని అధికారులకు నిర్దేశించారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు. ధరణి పోర్టల్ గురించి చెబుతూ, రాష్ట్రంలో భూఅక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. ఒక్కసారి ధరణి పోర్టల్ లో భూమి వివరాలు నమోదైతే, ఆ భూమి సొంతదారు ఇక నిశ్చింతగా ఉండొచ్చని పేర్కొన్నారు. వీఆర్ఓ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎవ్వరూ ఆ వివరాలను మార్చే వీల్లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంలో 37 చట్టాలున్నాయని, ఎలాంటి లొసుగులకు తావులేని విధంగా ధరణి పోర్టల్ ను పకడ్బందీగా రూపొందించేందుకు మూడేళ్లు శ్రమించామని తెలిపారు.

* హైద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం (హెచ్‌సీయూ) ప్ర‌వేశ ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 21 నుంచి జులై 20 వ‌ర‌కు ఆన్‌లైన్ దర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌రులో ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంద‌ని హెచ్‌సీయూ తెలిపింది. దేశ‌వ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఈ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు. హెచ్‌సీయూలో 117 కోర్సుల్లో 2,328 సీట్ల‌కు ఈ నోటిఫికేష‌న్ విడుదల చేశారు. acad.uohyd.ac.in లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయ‌ని హెచ్‌సీయూ స్ప‌ష్టం చేసింది.

* సీతారామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. నిత్యం ఉదయం 5 గంటలకు నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారిని దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే నిత్య కల్యాణం, ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఆదివారం లక్ష్మణసమేత సీతారాములకు పంచామృతాలతో సర్వాభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో సీతారాములకు అర్చన నిర్వహించారు. అయితే, భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం తదితర కొవిడ్‌ నియమాలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు.

* జమ్మూ-కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కనుందా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఈ దిశగా సన్నాహాలు ప్రారంభమయినట్టు అనిపిస్తోందని విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న జమ్మూ-కశ్మీర్‌కు చెందిన అన్ని పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర నాయకులు పాల్గొననున్నారు. ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370వ అధికరణం రద్దు తరువాత జరిగే తొలి భేటీ ఇదే కానుండడం గమనార్హం. రానున్న నవంబరులోగానీ, వచ్చే ఏడాదిలోగానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సూచనలు ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణతో పాటు, ఇతర సమస్యలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

* ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడీవై) పురస్కరించుకుని ఈ నెల 21న ప్రపంచంలోని 190 దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

* కంటికి కనిపించనంత దూరంలో ప్రయాణించే విధానంలో.. డ్రోన్‌ల ద్వారా ఔషధాల సరఫరాను దేశంలో తొలిసారిగా కర్ణాటకలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. బెంగళూరుకు 80 కి.మీ.ల దూరంలోని చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్‌లో ఈనెల 21న అధికారికంగా దీనికి శ్రీకారం చుడుతున్నారు. నారాయణ హెల్త్‌కేర్‌ భాగస్వామ్యంతో బెంగళూరుకు చెందిన డ్రోన్‌ నిర్వహణ కంపెనీ టీఏఎస్‌ దీనికి నేతృత్వం వహిస్తోంది. ఇందుకు గాను మందులను గగన మార్గంలో తరలించేందుకు తగిన రెండు డ్రోన్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో మెడ్‌ కాప్టర్‌గా పిలిచే ఓ డ్రోన్‌కు కేజీ బరువున్న ఔషధాలను 15 కి.మీ.ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ర్యాండింట్‌ అనే మరో డ్రోన్‌ 2 కేజీల బరువును 12 కి.మీ.లు తీసుకెళ్లగలుగుతుంది. ఈ రెండింటినీ 30-45 రోజల పాటు పరిశీలించనున్నారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రయోగం ద్వారా పరిశీలించి వాటిని అధిగమించేందుకు చర్యలు చేపడతారు. డ్రోన్ల ద్వారా మందుల సరఫరాను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు తాము అనుమతి పొందామని.. 100 గంటలు పరిశీలించిన అనంతరం పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)కు నివేదిక సమర్పిస్తామని టీఏఎస్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గౌరిబిదనూర్‌లోని గగనతలంలో 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రయోగాలు జరుగుతాయని.. ఈమేరకు లాంఛనంగా అనుమతి పొందినట్లు వెల్లడించారు.

* ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఒక పెళ్లికి వెళ్తే, తననే మాస్క్‌ తీయమన్నారంటూ కేసీఆర్‌ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ‘‘నేనో పెండ్లికి పోయిన. పెండ్లికి పోతే ఆ పెండ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీయ్’ అన్నడు. ‘ఎందుకయ్య’ అంటే ‘సార్ నువ్వు మళ్ల దొరుకతవో లేదో ఓ ఫొటో తీసుకుంటా’ అన్నడు. ‘నేను నీకు దొరుకతనో లేదో గానీ కరోనాకు దొరకుతా’ గదరా బై అన్న. ఆఖరికి వాడుగుంజా వీడు గుంజా నాక్కూడా వచ్చింది కరోనా..’’ అంటూ పెళ్లి సందర్భంగా తనకెదురైన అనుభవాన్ని సమావేశంలో పంచుకోగా, మంత్రి హరీశ్‌రావు సహా సభలోని వారంతా నవ్వాపుకోలేకపోయారు.

* తెలుగు ప్రజల రుణం తీర్చలేనిదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ భావోద్వేగానికి గురయ్యారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన .. మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో తనను చూసి గర్వించటానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదని, అయితే, సీజేఐగా ఈ వారంరోజుల పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వలే అక్కున చేర్చుకుని ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలిపారు. కొవిడ్‌కు సైతం వెరవక అసంఖ్యాకంగా వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు చెప్పారు. ముఖ్యమంత్రి మొదలుకుని సాధారణ పౌరుని వరకూ ప్రతి ఒక్కరూ స్వాగతం పలికి అంతా మనోళ్లే అన్న తెలంగాణ నైజానికి, సుప్రసిద్ద హైదరాబాదీ ఆతిథ్యానికి అద్దం పట్టారని ప్రశంసించారు. అనూహ్య స్వాగతం పలికిన గవర్నర్‌, ముఖ్యమంత్రి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు ధన్యవాదాలు చెప్పారు. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చి దిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. వారం క్రితం తెలుగు నేలపై కాలుమోపినప్పటి నుంచి నేడు దిల్లీ బయల్దేరే వరకు తనను కంటికి రెప్పలా చూసుకున్న తెలంగాణ అధికారులు, రాజ్‌భవన్‌ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల దీవెనల బలంతో రాజ్యాంగ బద్ద విధుల్ని సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరుగు ప్రయాణమవుతున్నా’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రకటనలో వెల్లడించారు.