Politics

రఘురామపై అనర్హత వేటు వేయండి-తాజావార్తలు

YSRCP MPs Request Raghurama To Be Disqualified

* భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. తనను భారత్‌కు అప్పగించాలన్న యూకే కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నీరవ్‌ చేసిన లిఖిత పూర్వక అభ్యర్థనను లండన్‌ కోర్టు తిరస్కరించింది. అయితే అప్పగింతపై అప్పీల్‌ చేసుకునేందుకు నీరవ్‌కు మరో అవకాశం ఉంది. న్యాయపరమైన మార్గదర్శకాల ప్రకారం.. ఐదు రోజుల్లోగా ఆయన మౌఖికంగా అభ్యర్థన చేసుకోవచ్చు. ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే దానిపై విచారణ చేపడుతుంది. అది కూడా తిరస్కరిస్తే నీరవ్‌ ఇక భారత్‌కు రాక తప్పదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ప్రస్తుతం మౌఖిక అభ్యర్థన కోసం నీరవ్‌ యోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నీరవ్‌ అప్పగింతపై భారత అధికారుల తరఫున వాదనలు వినిపిస్తున్న క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ తాజా పరిణామాలపై స్పందించింది. ‘‘ఒకవేళ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు వారికి(నీరవ్‌) అనుమతి లభిస్తే.. దానికి అనుగుణంగా మేం చర్యలు చేపడతాం’’ అని పేర్కొంది.

* పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

* వైకాపాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌ కొనసాగుతోంది. స్వపక్షంలో విపక్షంలా తయారైన రఘురామపై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతలు గతంలోనే లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై తాజాగా మరోసారి వైకాపా నేతలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని గతేడాది జులై 3న ఫిర్యాదు చేశామని, అనర్హత వేటులో అకారణంగా జాప్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశామని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖలో వెల్లడించారు.

* రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతపై హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌, సీఎంవో అధికారులతో సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలకు ‘దిశ’ యాప్‌పై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళల ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగా దిశ యాప్‌పై ముందుగా మహిళా పోలీసులు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితుల్లో యాప్‌ వినియోగంపై కళాశాలలు, విద్యా సంస్థల్లోనూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ‘దిశ’ స్థానిక పోలీస్‌ స్టేషన్లు సత్వరమే స్పందించేలా సన్నద్ధం కావాలని.. ఇందుకోసం పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం తెలిపారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 17వ రోజు ఆరుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది. కడప ఆర్ అండ్ బీ అతిథి గృహం, కేంద్ర కారాగారం అతిథి గృహంలో రెండు చోట్ల అనుమానితులను విచారిస్తున్నారు. కడప ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పులివెందుల నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వైకాపాకు చెందిన కృష్ణయ్య యాదవ్, సావిత్రి దంపతులు, వారి కుమారులు సునీల్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, కుమార్తె నందినిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ వీరిని విచారించారు. సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వివేకాకు అత్యంత సన్నిహితుడుగా ఉండే వాడని సమాచారం. గతంలో ఇతన్ని దిల్లీకి తీసుకెళ్లి సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రెండు వారాల వ్యవధిలో మూడు దఫాలుగా ఈ కుటుంబాన్ని సీబీఐ ప్రశ్నిస్తోంది. కాగా కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తోంది. ఇతన్ని దిల్లీకి తీసుకెళ్లి రెండు నెలల పాటు సీబీఐ ప్రశ్నించింది. మరోమారు విచారిస్తుండటం చర్చనీయాంశమైంది.

* తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు నీటి యుద్ధం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో తెరాస ప్రభుత్వం, మంత్రులు ఏడాది తర్వాత మేల్కొన్నారని భట్టి ఎద్దేవా చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది కిందటే జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తూ నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని తాము చెప్పినా సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవకముందే హెచ్చరించినప్పటికీ సీఎం పెడచెవిన పెట్టారని ఆరోపించారు. నీటి కోసం సాధించుకున్న తెలంగాణలో కృష్ణా నది నుంచి ఒక్క ఏకరానికి కూడా నీరు అందలేదని భట్టి విమర్శించారు.

* భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకొంది. వరుసగా మూడో రోజూ 50లక్షలకు పైగా డోసులు పంపిణీ జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ సాయంత్రం 4గంటల వరకు 51లక్షల డోసులు పంపిణీ చేశారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఈరోజు 9 లక్షలకు పైగా డోసులు ఇవ్వడం విశేషం. ఈ నెల 21న దేశ వ్యాప్తంగా 88లక్షల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీతో రికార్డు నమోదు చేయగా.. ఈ నెల 22న 54.2లక్షల డోసులు పంపిణీ జరిగింది.

* తెలంగాణలో పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందని, రోజుకు సగటున 1.17లక్షల పరీక్షలు జరుగుతున్నట్టు ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. వ్యాక్సినేషన్‌ కూడా చురుగ్గా కొనసాగుతోందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు 28.76లక్షల మందికి రెండు డోసులు, 68.48లక్షల మందికి ఒక డోసు పూర్తి చేశాం. ఇంకా 1.94కోట్ల మందికి ఇంకా టీకాలు ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 29 నాటికి కేంద్రం నుంచి మరో 10.76లక్షల డోసులు రావాల్సి ఉంది. నీలోఫర్‌ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు సిద్ధం చేశాం. పిల్లల వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకొంటున్నాం. ఔషధాలు సిద్ధంగా ఉంచాం’’ అని తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌లో భారీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 20న ఒక్కరోజే 13.74లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 22వరకు రాష్ట్రానికి 41,10,530 వ్యాక్సిన్‌ డోసులు అందగా.. 39,89,671 డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

* హైదరాబాద్‌ జంటనగరాల్లో మళ్లీ ఎంఎంటీఎస్‌ రైళ్ల కూత ప్రారంభమైంది. అతితక్కువ ఖర్చుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైళ్లు 15 నెలల తర్వాత బుధవారం నుంచి పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి. గతంలో 121 సర్వీసులు తిరగ్గా.. ప్రస్తుతం 10 సర్వీసులే అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లలో ప్రయాణాలకు టిక్కెట్లను యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌, ఏటీవీఎంలలో బుకింగ్‌ చేసుకొనేవారికి అదనపు బోనస్‌ను కూడా అందిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

* ప్రజలంతా కరోనా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులను ఆకర్షించేలా దేశీయ అతిపెద్ద బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న కస్టమర్లకు ‘వాక్సీఫేర్‌’ పేరిట ప్రత్యేక డిస్కౌంట్‌లో భాగంగా టికెట్ల బుకింగ్‌ సమయంలో 10 శాతం తగ్గింపును ప్రకటించింది. బుధవారం నుంచే ఇది వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. బుకింగ్ సమయంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించడంతో పాటు ప్రయాణ సమయంలోనూ కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుందని పేర్కొంది.

* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల కన్నా రికవరీలు పెరగడంతో క్రియాశీల కేసుల కొండ కరుగుతోంది. మంగళవారం 19లక్షలకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 50,848 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అలాగే, 1358 మరణాలు సంభవించాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 6.43లక్షలకు దిగొచ్చింది. దేశంలో రికవరీ రేటు 96.56%గా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.67%గా ఉంది.

* తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు రూ.4వేలు, ఐసీయూ గదికి రోజుకు రూ.7500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గది రూ.9వేలు, పీపీఈ కిట్‌ ధర రూ.273 మించరాదని పేర్కొంది. హెచ్‌ సీటీ రూ.1995, డిజిటల్‌ ఎక్స్‌ రే 1300, సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కి.మీ.కు రూ.75 (కనీసం రూ.2 వేలు), ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకైతే రూ.125 (కనీసం రూ.3వేలు) చొప్పున నిర్ణయించింది.

* కరోనా సంక్షోభంలో సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జులై నుంచి వారి వేతనంపై రూ.1000 ఇంక్రిమెంట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌, రూ.500 కొవిడ్‌ భత్యం ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె వెల్లడించారు. దీంతో 68వేల మందికి పైగా కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. మంత్రి చేసిన ప్రకటనతో తమ డిమాండ్లపై వారం రోజుల నిరసనను ఉపసంహరించుకొంటున్నట్టు తెలిపారు. కరోనాతో మృతిచెందిన ఆశా వర్కర్లకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జులైలో మరో రూ.500 ఇంక్రిమెంట్‌ వేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు.

* కరోనా థర్డ్‌ వేవ్‌ మరికొన్ని వారాల్లో రానుందని, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలతో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. జులై నాటికి రాష్ట్రంలో 1300 పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేది తెలిపారు. బెంగాల్‌లో కరోనా పాజిటివిటీ రేటు 3.61శాతానికి తగ్గిందన్నారు. ఆక్సిజన్‌ లభ్యతకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

* ముంబయిలో అతిపెద్ద మురికివాడ ధారవిలో ఈ రోజు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని బీఎంసీ వెల్లడించింది. ఇప్పటివరకు ధారవిలో 6875 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 10 యాక్టివ్‌కేసులు ఉన్నాయి. జూన్‌ నెలలో సున్నా కేసులు నమోదు కావడం ఇది మూడోసారి. గతంలో జూన్‌ 14, 15 తేదీల్లో కూడా సున్నా కేసులు నమోదయ్యాయి.