Devotional

తితిదే బ్రహ్మోత్సవాలపై సుబ్బారెడ్డి కీలక నిర్ణయం-తాజావార్తలు

తితిదే బ్రహ్మోత్సవాలపై సుబ్బారెడ్డి కీలక నిర్ణయం-తాజావార్తలు

* సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. లైంగికదాడి, హత్యకేసు నిందితుడు రాజు మృతిపై పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ దాఖలు దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు రాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

* రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భాజపా నేతలు విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు తొలి సంతకం చేస్తామన్నారు.

* తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ఉత్తేజ్ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్‌లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం నుంచి కోలుకోక‌ముందే మ‌రో దారుణం జ‌రిగింది. బుల్గానిన్ మ‌ర‌ణ‌వార్త తెలిసి ఆయ‌న మేన‌త్త సీతామ‌హాల‌క్ష్మి గుండెపోటుతో మ‌ర‌ణించింది. ఈ విషయం తెలిసి కుటుంబ‌స‌భ్యులు ఒక్క‌సారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు. కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రి మ‌ర‌ణ‌వార్త‌లు డీఎస్పీ కుటుంబాన్ని పూర్తిగా కుంగ‌దీశాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇంట్లో ఈ జంట మ‌ర‌ణ‌వార్త‌ల గురించి తెలిసి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

* పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. నిర్మల్‌లో భాజపా ఏర్పాటు చేసిన సభలో అమిత్‌ షా మాట్లాడారు. ‘‘మజ్లీస్‌కు భాజపా భయపడదు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా?’’ అని ప్రశ్నించారు.

* తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెళ్లారు.

* ప్రాజెక్టుల నిర్వహణకు వారం, పది రోజుల్లో సిబ్బంది వివరాలను ఇవ్వాలని ఇరు రాష్ట్రాల అధికారులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఉప సంఘం కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నేళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. జలసౌధలో జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ ఉపసంఘాలు ఇవాళ వేర్వేరుగా సమావేశమయ్యాయి

* తెలంగాణలో జూట్ పరిశ్రమలు నెలకొల్పేందుకు మూడు పరిశ్రమలు ముందుకొచ్చాయని.. తద్వారా రాష్ట్రానికి రూ.887 కోట్ల పెట్టుబడులు, 10,400 ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో నెలకొల్పనున్న గ్లోస్టర్, ఎంజీబీ, కాళేశ్వరం ఆగ్రో మిల్లుల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

* కరోనా పరిస్థితుల నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 7 నుంచి 15 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యల వల్లే సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో కేటాయించే ప్రక్రియ ఆలస్యమవుతోందని.. వారంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

* తెదేపా అధినేత చంద్రబాబు నివాసం దగ్గర పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అఫ్గానిస్థాన్‌లా మార్చేశారని ధ్వజమెత్తారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక రౌడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు తాలిబన్లను మించిపోయారని ధ్వజమెత్తారు.

* మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1994లో దళంలో చేరిన ఆమె అప్పటి కమాండర్‌ హరిభూషణ్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ప్లాటూన్ కమాండర్‌గా, సెంట్రల్ కమిటీ కమాండర్‌గానూ శారదక్క పని చేశారు. 2006లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ తగిలి ఒక కన్ను కోల్పోయారు.

* భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం నేడు దూసుకుపోతోంది. ఈ రోజు ఇప్పటికే కోటి డోసులు అందించి, రెండు కోట్ల మార్కు దిశగా పయనిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. టీకా వేయించుకొని ఆయనకు కానుక ఇవ్వాలని భాజపా నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీకా తీసుకొని, ఇతరులకు స్లాట్స్‌ బుక్‌ చేసి వ్యాక్సిన్ సేవ చేద్దామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా కోరారు.

* మార్కెట్ల లాభాల జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. శుక్రవారం ఆరంభంలో అదరగొట్టిన సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ సానుకూల సంకేతాలతో జీవనకాల గరిష్ఠాలకు చేరుకున్న సూచీలు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం.

* టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తిరిగి టీ20 క్రికెట్‌లో చోటు దక్కించుకోవాలంటే మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తీరును అనుసరించాలని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ సూచించారు. వీవీఎస్‌ను టీమ్‌ఇండియా పక్కనపెట్టిన ప్రతిసారీ దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించేవాడని, దాంతో సెలెక్టర్లు అతడిని తీసుకునేవారని ఆయన వివరించారు.