Politics

జగన్ మంచి పేరు తెచ్చుకోవాలి-తాజావార్తలు

జగన్ మంచి పేరు తెచ్చుకోవాలి-తాజావార్తలు

* అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలకు కొవిడ్ వ్యాక్సిన్​(Us Covid 19 Vaccination) తప్పనిసరి చేసింది ఆ దేశ ప్రభుత్వం. దేశంలోని వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు జనవరి 4లోగా వ్యాక్సినేషన్ పూర్తిచేసుకోవాలని లేదా వారానికోసారి కొవిడ్​-19 టెస్టు చేయించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. గురువారం నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

* ఆంధ్రప్రదేశ్ లోని 14 ఆలయాలను జగద్గురు ఆదిశంకరాచార్యులు సందర్శించినట్టుగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన సందర్శించిన ఆలయాల్లో సంస్మరణ ఉత్సవాలు చేపట్టారు. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన ఆదిశంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాల్లో మంత్రి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదిశంకరాచార్యులు సందర్శించిన ఆలయాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సంస్మరణ ఉత్సవాలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఆదిశంకరాచార్యులు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని తెలిపారు. ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు భగవంతుని స్వరూపమేనని అన్నారు. అటు, కేదార్ నాథ్ లో ఆదిశంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించడం హర్షణీయం అని వెల్లంపల్లి పేర్కొన్నారు.

* ఇంద్రకీలాద్రిపై కార్తీకమాస పూజలు.విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం.. కార్తీకమాసం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఆధ్యాత్మికంగా కార్తీకమాసానికి ఎంతో ప్రాధాన్యం ఉండడం.. కనకదుర్గమ్మతోపాటు మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేయించుకునేందుకు.. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది.అమ్మవారి ప్రధాన ఆలయం, శివాలయం, నటరాజస్వామి దేవాలయాల్లో ఐదో తేదీ నుంచి ప్రదోషకాలంలో ఆకాశదీపం ఏర్పాటు చేయనున్నారు.ఐదో తేదీ నుంచి డిసెంబరు నాలుగో తేదీ వరకు కార్తీక పారాయణలు, సహస్ర లింగార్చనలు, జపాలు, ప్రత్యేక లింగార్చనలు నిర్వహించనున్నారు.లక్ష బిల్వాచర్చలో పాల్గొనేందుకు ఒక రోజుకు.. రెండు వేల రూపాయలు సేవా రుసుముగా ఆలయ కమిటీ నిర్ణయించింది.సహగ్ర లింగార్చన ఒక రోజుకు రూ.500, రుద్రహోమం ఒకరోజుకు వెయ్యి రూపాయలు, దీపోత్సవం రోజుకు ఒక్కరికి రూ.50, సహస్ర లింగార్చన నెలరోజులకు రూ.5వేల 116గా నిర్ణయించారు.

* పెట్రో ధరలు తగ్గించి ఏపీ సీఎం జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజల కష్టాలు చూసి పెట్రోల్‌, డీజిల్‌పై ప్రధాని ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తే.. ఆయన స్ఫూర్తితో చాలా రాష్ట్రాలు కూడా తగ్గించాయన్నారు. ‘‘పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇంధనం రేట్లు, స్కూల్‌ ఫీజులు, ఇంటి పన్నులు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో సీఎం జగన్‌.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు అమలవుతున్నాయి. గతంలో ఆయన చెప్పినట్టు.. యానాం, కర్ణాటక, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఏపీ కంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ప్రజల కోసం ధరలు తగ్గించాలని కోరారు.. ఇప్పుడు అమలు చేసేందుకు వెనకాడుతున్నారు. ఇంధన ధరల తగ్గింపు విషయంలో కర్ణాటక సీఎం బొమ్మై గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే తరహాలో ఏపీలో కూడా రేట్లు తగ్గించి దేశ వ్యాప్తంగా జగన్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటున్నా. మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులు ఎందుకు అమలు చేయటం లేదు? ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపుల విషయంపై ప్రధానికి లేఖ రాశాను. ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇలా జరుగుతోందని.. మద్యం షాపుల నుంచి వచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి.. ఆ డబ్బు ఎవరికో ఇస్తున్నారు. మద్యం షాపుల నుంచి నగదు రూపేణా వసూలు చేస్తున్న దానిలో ప్రభుత్వానికి ఎంత జమ చేస్తున్నారు.. ఎవరైనా తమ జేబులో వేసుకుంటున్నారనే అనుమానం అందరికీ వస్తోంది. తక్షణం నగదు వసూలు ఆపి డిజిటల్‌ పద్ధతిని పెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలి. జై భీమ్‌ సినిమా చూశాను. 1995లో జరిగిన ఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఆ సినిమాలో గిరిజన యువకుడిని హింసిస్తూ ఉన్న పరిస్థితి.. నాకు జరిగిన ఘటన.. ఒకేలా ఉన్నట్లు అనిపించింది. పరిస్థితులు పెద్దగా మారలేదని స్పష్టంగా తెలుస్తోంది. గిరిజనుడ్ని కొట్టారు.. గిరిజనుడికి దిక్కేంటని లాయర్‌ వచ్చారు. నేను ఎంపీ, ఇప్పుడు నాకే దిక్కులేదు’’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

* కొన్నాళ్లుగా వరుస కరోనా కేసులతో సతమతమవుతున్న చైనాకు మరో సమస్య వచ్చిపడింది! ఇటీవల తీవ్ర బొగ్గు కొరతతో.. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా అధికారులు బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని భారీగా పెంచేశారు! దీంతో దేశ రాజధాని బీజింగ్‌తోసహా ఆయా నగరాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున వాయు కాలుష్యం పెరిగింది. ఉత్తర చైనాలోనూ దట్టమైన కాలుష్య పొగలు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ దూరం కనిపించని దుస్థితి. దీంతో శుక్రవారం షాంఘై, టియాంజిన్, హార్బిన్‌తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే రహదారులను మూసివేశారు. తీవ్ర వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా రాజధానిలోని పాఠశాలలు.. ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

* లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు తిరగబడటంలో తప్పులేదని.. వారి ఆవేదనను అర్థం చేసుకున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీ ప్రైవేటు యాజమాన్యం 2015 నుంచి ఇలాగే వ్యవహరిస్తోందని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో చెరకు రైతులు మంగళవారం తీవ్ర ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘2019లో రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.27కోట్లు బకాయి పడితే ఆర్‌.ఆర్‌.యాక్ట్‌ కింద 30ఎకరాలు అమ్మి బకాయిలు తీర్చాం. ప్రైవేటు యాజమాన్యంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఆనాడే చెప్పాను. షుగర్‌ ఫ్యాక్టరీ నుంచి దాదాపు రూ.10కోట్ల విలువైన 30వేల బస్తాల షుగర్‌ను స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం రూ.16కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిని ఎలా తీర్చాలనేదానిపై చర్చించాం. షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇంకా 24 ఎకరాలు ఉన్నాయి. ఆర్‌.ఆర్‌.యాక్ట్‌ కింద ఆ భూమిని కూడా త్వరలో అమ్మి రైతుల బకాయిలు చెల్లిస్తాం. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశాం.

* చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి నామినేషన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఇవాళే ఆఖరి రోజు. దీంతో 14వ వార్డుకు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా.. అతడి వద్ద నుంచి నామినేషన్‌ పత్రాలను పలువురు లాక్కున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్‌ చేతికి గాయమైంది.

* ఆంధ్రప్రదేశ్‌లో సౌర విద్యుత్‌ ఒప్పందాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని పీఏసీ ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన సోలార్‌ విద్యుత్‌ ధరల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగం సంక్షోభంపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ ఒప్పందాలు గంటల్లోనే జరిగిపోతున్నాయని.. మంచి, చెడ్డలు చూడకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగమేఘాలమీద విద్యుత్‌ ఒప్పందాలు జరిగిపోతాయా?అని ప్రశ్నించారు.‘‘సౌర విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలు రూ.1.99కే కొనుగోలు చేశాయి. ఏపీలో మాత్రం రూ.2.49కి ఎందుకు కొన్నారో చెప్పాలి? రూ.30వేల కోట్ల లావాదేవీలకు గంటల వ్యవధిలోనే ప్రతిపాదనలు.. ఆమోదాలా? 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొన్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. గత నవంబరులో పిలిచిన టెండర్లలో రూ.2కే సౌర విద్యుత్‌ ఇచ్చారు. గుజరాత్‌ రూ.1.99కే కొనుగోలు చేసింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రూ.2.49 చౌక ఎలా అవుతుంది? సెకీ నుంచి ఏపీ డిస్కంలకు చేరేసరికి రూ.4.50 దాటినా ఆశ్చర్యం లేదు. ఇది విద్యుత్‌ కొనుగోలు స్కీం కాదు.. అదానీ కోసం చేసే స్కామ్‌.. రివర్స్‌ టెండరింగ్‌ ఏమైంది? జ్యూడిషియల్‌ ప్రివ్యూ ఏమైంది? అదానీకి ఇక్కడ దక్కని టెండర్లను సెకీ రూపంలో కట్టబెట్టారు’’ అని పయ్యావుల అన్నారు.

* చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నీలం సాహ్నికి చంద్రబాబు లేఖ రాశారు. 14వ వార్డు తెదేపా అభ్యర్థి వెంకటేశ్‌పై వైకాపా నేతలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం వద్దే దాడి జరిగిందని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దాడిలో 30 మంది వరకు పాల్గొని వెంకటేశ్‌పై దాడి చేశారని.. ఈ దాడిలో వెంకటేశ్‌ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. దాడి చేయడమే కాకుండా నామపత్రాలు చించేసి సెల్‌ ఫోన్ లాక్కున్నారని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను ఎస్‌ఈసీకి రాసిన లేఖతో జత చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని.. తెదేపా నేతలు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

* విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో చెరకు బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలు రోజు రోజుకీ పేట్రేగిపోతున్నాయని, అక్రమ కేసులను ఖండిస్తున్నట్టు తెలిపారు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలపై అక్రమ కేసులు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించమని కోరిన రైతులపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే నియంతలా వ్యవహరించటం సరికాదని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. సమస్యలపై నిరసన తెలిపిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ రైతులను చులకన భావంతో చూస్తున్నారని దుయ్యబట్టారు. విజయనగరంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, వారికి తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

* యూపీలోని కాన్పూర్‌లో జికా వైరస్‌ చాప కింద నీరులా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అక్కడ మరో 30 మందికి ఈ వైరస్‌ సోకడంతో కాన్పూర్‌లో మొత్తం జికా కేసుల సంఖ్య 66కు పెరిగింది. వీరిలో 45 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాన్పూర్‌లో అక్టోబరు 24న తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.

* బాలీవుడ్ స్టార్‌ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు హాజరయ్యాడు. ఈ రోజు మధ్యాహ్నం రెండులోపు హాజరుకావాల్సి ఉండటంతో.. కార్యాలయానికి వచ్చాడు. బెయిల్‌ ఇచ్చే సమయంలో ఆర్యన్‌కు కోర్టు 14 షరతులు విధించింది. ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయంలో ఉదయం 11గంటలు – మధ్యాహ్నం 2గంటల మధ్య హాజరు కావడం అందులో ఒకటి. దానిలో భాగంగా అతడు ఈ రోజు ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చాడు.

* కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ హఠాన్మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తమిళ నటుడు సూర్య అన్నారు. శుక్రవారం బెంగళూరులోని పునీత్ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించిన ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఇలా జరిగి ఉండకూడదు. పునీత్‌ ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నా.. మా కుటుంబాల మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది’’ అని తెలిపారు.

* రాజమహేంద్రవరంలో ‘సారీ మోసం చేయలేదు’ అనే పోస్టర్లు ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న మాట. పలు చోట్ల వెలిసిన ఈ పోస్టర్ల వెనక ఉన్న అసలు కారణం ఎంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ యువకుడు తన ప్రియురాలికి క్షమాపణ చెప్పేందుకే ఈ పోస్టర్లు వేయించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఈ భగ్న ప్రేమికుడి క్షమాపణను ప్రియురాలు ఏమేరకు క్షమిస్తుందో వేచి చూడాలి .ఈఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.