DailyDose

‘మీది గడ్డమా? మాస్కా?’.. రాజ్య సభలో నవ్వులు పూయించిన వెంకయ్య నాయుడు..

‘మీది గడ్డమా? మాస్కా?’.. రాజ్య సభలో నవ్వులు పూయించిన వెంకయ్య నాయుడు..

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన వాగ్ధాటికి ఆయన కేరాఫ్‌ అడ్రస్‌. గతంలో బీజేపీ నేతగా ఉన్న ఆయన ప్రత్యర్థులపై విసిరిన ఛలోక్తులు, పంచ్‌లు నవ్వులు పూయించాయి. ఇక ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో తన హాస్యచతురతను పెద్దాయన బయటపెట్టారు. తాజాగా రాజ్యసభ ఛైర్మన్‌గా మరోసారి పార్లమెంట్‌ సభ్యులతో నవ్వులు పూయించారు వెంకయ్య నాయుడు. వివరాల్లోకి వెళితే.. కేర‌ళ బీజేపీ ఎంపీ, నటుడు సురేశ్ గోపీ (MP Suresh Gopi) ఇటీవల బాగా గడ్డం పెంచారు. ఎంతలా అంటే గుబురు గడ్డంలో ఆయనను కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కాగా ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎంపీ హోదాలో సురేశ్ గోపీ మాట్లాడేందుకు రెడీ అవుతుండగా.. వెంక‌య్యనాయుడుకు డౌట్‌ వచ్చింది. సురేశ్‌గోపీ తెలుపు, బూడిద‌రంగు గుబురు గ‌డ్డం, న‌ల్లటి మీసాల‌ను చూసి మాస్క్ అనుకుని క‌న్‌ఫ్యూజ్ అయ్యారు. ఆయనను చూసి ‘మీది గ‌డ్డమా? లేక మాస్కా?’ అని ప్రశ్నించారు. దీంతో స‌భ‌లో న‌వ్వులు వెల్లివిరిశాయి. స్పీకర్‌ అడిగిన ప్రశ్నకు సురేశ్ గోపి కూడా మొద‌ట ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే నవ్వుతూ ‘గడ్డమే’ అని స‌మాధాన‌మిచ్చారు.తన తర్వాతి చిత్రం కోసం గడ్డం పెంచుతున్నానని, ఇది న్యూ లుక్‌ అని సురేశ్‌ గోపీ ఈ సందర్భంగా సమాధానమిచ్చారు. సురేశ్‌ గోపీ సమాధానంతో సంతృప్తిచెందిన వెంకయ్య నాయుడు ‘ఇక ప్రసంగించండి’ అని సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు ఈ సీనియర్‌ నటుడు. కాగా యాక్షన్‌ సినిమాలతో మలయాళంలో స్టార్‌ హీరోగా గుర్తింపుతెచ్చుకున్నారు సురేశ్‌ గోపి. ముఖ్యంగా పోలీస్‌ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. తెలుగులోనూ ఆయన డబ్బింగ్‌ చిత్రాలు విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచాయి. మొత్తం 250కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇందులో భాగంగానే కేరళ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా నామినేట్‌ అయ్యారు.