Politics

ఏపీని లంకలా కానివ్వం – TNI రాజకీయ వార్తలు

ఏపీని లంకలా కానివ్వం – TNI రాజకీయ వార్తలు

*ప్రజలందరికీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఏపీని లంకలా కానివ్వకుండా అయోధ్యలా చూసుకుందాం.. రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. పాలకుడికి అహంకారం ఉంటే రాజ్యం ఎలా దహించుకు పోతుందో చెప్పడానికి ఆనాటి లంక ఉదాహరణ. అలాగే పాలకులకి ముందుచూపు లేకపోతే ఆ రాజ్యంలో రావణ కాష్టం ఎప్పుడైనా రగులుకోవచ్చని అని చెప్పడానికి నేటి లంక ఉదాహరణ’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు

*అన్నమాటమీద నిలబడి అందర్నీ పీకేయండి: వర్ల రామయ్య ట్వీట్
తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ.. నోరు లేని మా దళిత హోం మంత్రి సుచరిత గారిని తొలగించి, క్రొత్త మంత్రి మండలిలో నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానీని కొనసాగించాలని చూడడం మంచిది కాదేమో, ఒక్కసారి ఆలోచించండి.. అన్న మాటమీద నిలబడి అందర్నీ పీకేయండి సార్.. మాట తప్పకండి, మడం కూడ తిప్పకండి.. ఎవరి సలహాలు వినకండి..’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

*జగన్‌ బలహీనత విస్తరణలో బయటపడుతోంది: వర్ల రామయ్య
ఎవరినీ లెక్కచేయనని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి బలహీనత మంత్రివర్గ విస్తరణలో బయట పడుతోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ పద్మవ్యూహంలో ముఖ్యమంత్రి చిక్కుకుపోయారని, బలమైన మంత్రుల జోలికి వెళ్లలేక, ఉంచలేక సతమతమవుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘రెండున్నరేళ్ల తర్వాత మంత్రులందరినీ తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్‌రెడ్డి ఘనంగా చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకొనే ధైర్యం ఆయనలో కొరవడింది. నలుగురైదుగురు పాత వాళ్లను కొనసాగిస్తానని మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ఏడు నుంచి 10 మందిని కొనసాగిస్తామని ఆయన తన సొంత పత్రికలో తర్వాత రాయించుకొన్నారు. పాతుకుపోయిన వారిని పీకలేని అసమర్థతతో ఆయన ఉన్నారు’’ అని వర్ల విమర్శించారు.

*వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది: కవిత
వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నట్లు పిలుపునిచ్చారు.కేంద్ర పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పు తెస్తున్నాయని హెచ్చరించారు.దేశంలో రైతులను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు ఏంటో.. బీజేపీ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని కవిత హితవు పలికారు.

*జగన్‌ బలహీనత విస్తరణలో బయటపడుతోంది: వర్ల రామయ్య
ఎవరినీ లెక్కచేయనని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి బలహీనత మంత్రివర్గ విస్తరణలో బయట పడుతోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ పద్మవ్యూహంలో ముఖ్యమంత్రి చిక్కుకుపోయారని, బలమైన మంత్రుల జోలికి వెళ్లలేక, ఉంచలేక సతమతమవుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘రెండున్నరేళ్ల తర్వాత మంత్రులందరినీ తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్‌రెడ్డి ఘనంగా చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకొనే ధైర్యం ఆయనలో కొరవడింది. నలుగురైదుగురు పాత వాళ్లను కొనసాగిస్తానని మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ఏడు నుంచి 10 మందిని కొనసాగిస్తామని ఆయన తన సొంత పత్రికలో తర్వాత రాయించుకొన్నారు. పాతుకుపోయిన వారిని పీకలేని అసమర్థతతో ఆయన ఉన్నారు’’ అని వర్ల విమర్శించారు.

*క్యాడర్‌ కోసం జాబ్‌ మేళా సరికాదు: శ్రీరామ్‌ చినబాబు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో వైసీపీ క్యాడర్‌ కోసమే జాబ్‌ మేళాలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు విమర్శించారు. వైసీపీకి పనిచేసిన వారి కోసం జాబ్‌ మేళాలు నిర్వహించి రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శనివారం లేఖ రాశారు. పార్టీ ద్వారా కాకుండా ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వమే జాబ్‌ మేళాలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని, 25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని, 2019 నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చినబాబు డిమాండ్‌ చేశారు

* *సీఎం వాడిన భాష గర్హనీయం: తులసిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నంద్యాలలో విద్యార్థుల సమక్షంలో వాడిన భాష గర్హనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈ మాటలు జగన్‌ కుసంస్కారాన్ని తెలియజేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా రెండు వేమన పద్యాలను ఆయన ఉటంకించారు. సీఎం పూర్తి నిరాశా నిస్పృహల్లో ఉన్నట్లు ఆయన మాటలతో స్పష్టమవుతోందన్నారు. ఆయన చిరు కోరికను ప్రజలు కచ్చితంగా నెరవేరుస్తారన్నా రు. వచ్చే ఎన్నికల్లో పదవి నుంచి ప్రజలు పీకడం ఖాయమన్నారు.

*జగన్‌ పరిపాలన శూన్యం: సీపీఐ రామకృష్ణ
రాష్ట్రంలో ప్రజలపై పన్నుల భారాలు, చార్జీల మోత, పవర్‌ కట్‌లు తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలన శూన్యం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తిరోగమ విధానాలపై ఈ నెల 11, 12 తేదీల్లో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విస్తృత ప్రచారాందోళన, 13న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ధర్నాల కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

*పద్మవ్యూహంలో జగన్: వర్లరామయ్య
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ పేరుతో పద్మవ్యూహంలో పడిపోయారని తెలుగుదేశం నేత వర్లరామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కేబినెట్‌లో కీలకమైన ఆరుగురు మంత్రుల్లో ఏ ఒక్కరిని తొలగించినా.. సీఎం పదవికి ముప్పు తప్పదన్నారు. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో తేనె తుట్టెను కదిలించారని చెప్పారు. పెద్దిరెడ్డి, బొత్స, ధర్మాన, సురేష్, బాలినేని, బూతుల మంత్రిని..తొలగించే సాహసం చేయలేరని వ్యాఖ్యానించారు. జగన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారిందని వర్లరామయ్య దెప్పిపొడిశారు.

*రైతాంగ సమస్యలపై పోరాడుతాం: సోము వీర్రాజు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతాంగ సమస్యలపై పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ‘జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు’ యాత్రలో భాగంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు పత్రికల్లో ప్రకటనలపై వున్న శ్రద్ధ… రైతుల సమస్యల పరిష్కారంలో లేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిని, వ్యవసాయం కలిసిరాకపోవడంతో రైతులు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే సాగునీటి ప్రాజెక్టులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

* వెంట్రుక పీకలేవు అని మాట్లాడటం సిగ్గుచేటు: పల్లె
రాష్ట్రానికి పట్టిన పెద్ద శని జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. జగన్ రెడ్డి కాదు జలగ రెడ్డి అని విమర్శించారు. సీఎంగా ఉండి వెంట్రుక కూడా పీకలేవు అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇలాంటి సీఎంని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఒక రాజధానికే దిక్కులేదు మూడు రాజధానులు ఎలా? అని ఆయన ప్రశ్నించారు.

*కేసీఆర్‌ సంతకమే రైతుల పాలిట శాపం: షర్మిల
సీఎం కేసీఆర్‌ కేంద్రం వద్ద చేసిన ఒక్క సంతకం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒకపక్క కేంద్రంతో అంతర్గతంగా సఖ్యతతో మెలుగుతునే మరోపక్క దొంగ ధర్నాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమంటూ కేసీఆర్‌ సంతకం చేశారని గుర్తు చేశారు. ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం 50వ రోజుకు చేరుకుంది.ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పడమటితండా నుంచి ప్రారంభమైన ఆమె పాదయాత్ర జాన్‌బాద్‌తండా, పాపటపల్లి, బుగ్గబంజర మీదుగా కామేపల్లి మండలం బర్లగూడెం, పొన్నెకల్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా పాపటపల్లి గ్రామంలో రైతుదీక్ష చేపట్టారు. దీక్షలో ఆమె మాట్లాడుతూ గత ఏడాది ప్రతి గింజనూ కొన్న కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎందుకు కొనటంలేదని ప్రశ్నించారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్‌ మాత్రమేనన్నారు. రైతుబంధు పేరుతో బోడి ఐదువేల రూపాయలు ఇచ్చి రైతును అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని చెబుతుండడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనలేప్పుడు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు కట్టటం ఎందుకని ప్రశ్నించారు. మిల్లర్లతో కమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ధాన్యం కొనేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

*సైన్డ్‌ భూములు పేదలకే చెందాలి: మల్లు రవి
పేదల నుంచి అసైన్డ్‌ భూములను లాక్కుని రియల్‌ ఎస్టేటు వారికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం సిగ్గు చేటని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. అసైన్డ్‌ భూములు పేదలకే చెందాలని, వారి పక్షాన కాంగ్రెస్‌ యుద్ధం చేస్తుందని ఓ ప్రకటనలో హెచ్చరించారు.

* పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్‌సింగ్‌ వారింగ్‌
పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) నూతన అధ్యక్షుడిగా అమరీందర్‌సింగ్‌ రాజా వారింగ్‌ను పార్టీ అధినేత సోనియా గాంధీ శనివారం నియమించారు. ప్రతాప్‌సింగ్‌ బాజ్వాను అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష(సీఎల్పీ) కొత్త నాయకుడిగా నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నవజోత్‌సింగ్‌ సిద్ధూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత రాజీనామా చేశారు. అమరీందర్‌సింగ్‌ రాజా వారింగ్‌ పంజాబ్‌లో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు.

*మంత్రివర్గ విస్తరణపై రగిలిపోతున్న కోటంరెడ్డి..
మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రగిలిపోతున్నారు. తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండోసారి గెలిచినా రిక్తహస్తం చూపించారని ఆయన మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ ఆశచూపినా కోటంరెడ్డి ఆ పార్టీలోకి వెళ్లలేదని, పార్టీ కార్యక్రమాలతో ప్రతి తలుపు తట్టినా సీఎం జగన్ గుర్తించలేదని కోటంరెడ్డి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటంరెడ్డికి మంత్రిపదవి రాకపోవడంపై తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదో కనీసం చెప్పే నాథుడే లేడని మండిపడుతున్నారు. అతి విశ్వాసం పార్టీ కొంప ముంచుతుందని, ఇప్పటికే చేయిదాటిపోయిందని కోటంరెడ్డి అనుచరులు వాపోతున్నారు.