Movies

కన్నడంలో అరంగేట్రం

కన్నడంలో అరంగేట్రం

దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణి అవుతున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తెలుగు, తమిళంలో మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఈ అమ్మడు మాతృభాష కన్నడంలో ఇప్పటివరకు సినిమా చేయలేదు. తాజాగా ఈ భామ కన్నడ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే… ‘మఫ్టీ’ చిత్రం ద్వారా శాండల్‌వుడ్‌లో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు నర్తన్‌. ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ వద్ద శిష్యరికం చేసిన ఆయనకు కన్నడ సూపర్‌స్టార్‌ యష్‌తో మంచి పరిచయాలున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్నది.ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా కన్నడంలో గ్రాండ్‌ ఎంట్రీ కోసం ప్రయత్నం చేస్తున్న ఈ భామ యష్‌ సరసన నటించే అవకాశం రావడంతో వెంటనే అంగీకరించిందని తెలిసింది. ప్రస్తుతం పూజాహెగ్డే పాన్‌ ఇండియా చిత్రం ‘జనగణ మన’తో పాటు తెలుగులో మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది.