NRI-NRT

ప్రముఖ వైద్యుడు డా.పి.రఘురామ్‌కు లండన్‌లో అరుదైన గౌరవం

ప్రముఖ వైద్యుడు డా.పి.రఘురామ్‌కు లండన్‌లో అరుదైన గౌరవం

హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఆఫ్ బ్రెస్ట్‌ క్యాన్సర్ డైరెక్టర్ డా.పి.రఘురామ్‌కు లండన్‌లో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లండ్ ఆయనను గౌరవ ఫెలోషిప్‌(ఎఫ్ఆర్‌సీఎస్) అవార్డుతో సత్కరించింది. 482 ఏళ్ల రాయల్ కాలేజ్ చరిత్రలో ఎఫ్ఆర్‌సీఎస్ దక్కించుకున్న అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా డా. రఘురామ్ అరుదైన ఘనత సాధించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్, ప్రిన్స్ ఛార్ల్స్‌తో పాటూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 156 మంది ప్రముఖ సర్జన్లు గౌరవ ఫెలోషిప్ పొందారు. శస్త్రచికిత్సల విభాగంలో డా. పి. రఘురామ్ చేసిన కృషికి గుర్తింపుగా రాయల్ కాలేజ్ గౌరవ్ ఫెలోషిప్ ఇచ్చింది. జూలై 6న నిర్వహించిన డిప్లొమేట్స్ సెరిమనీ‌ కార్యక్రమంలో.. కాలేజ్ ప్రెసిడెంట్ ఫ్రొ. నీల్ మార్టెన్సన్‌..రఘురామ్‌ను ఈ అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా డా. రఘురామ్ మాట్లాడుతూ.. రాయల్ కాలేజీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ అరుదైన ఘనతకు తనను ఎంపిక చేసినందుకు రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. శస్త్రచికిత్సలో అనుసరిస్తున్న ప్రామాణిక బ్రిటీష్ విధానాలను గత 15 ఏళ్లుగా మాతృదేశంలో తాను అమలు చేస్తున్నట్టు తెలిపారు. బ్రిటన్, భారత్‌ మధ్య ఓ సజీవ వారధిగా నిలిచే అవకాశం లభించడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అనంతరం.. ఎమ్ఆర్‌సీఎస్, ఎఫ్‌ఆర్‌సీఎస్ పరీక్షల్లో ఇటీవల ఉత్తీర్ణులైన డిప్లొమేట్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రోగులు వైద్యులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన గురుతర బాధ్యత వైద్యులపై ఉందని గుర్తు చేశారు. డా. రఘురామ్ 2015లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు, ఆ మరుసటి ఏడాది డా. బీసీ రాయ్ జాతీయ అవార్డును పొందారు.