WorldWonders

ఈనెల 15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా

ఈనెల 15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది. ఇది 1950తో పోలిస్తే మూడు రెట్లు అధికమని తెలిపింది. 2030 నాటికి ఈ సంఖ్య సుమారు 850 కోట్లకు పెరుగుతుందని అంచనావేసింది. కాగా, మరో ఏడాదిలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని పేర్కొన్నది. 2023లో చైనాను భారత్‌ అధిగమిస్తుందని వెల్లడించింది.

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022 పేరుతో ఈ ఏడాది జులై 11న ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. నవంబర్‌ 15 నాటికి ప్రపంచ మొత్తం జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. 2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదయిందని అందులో తెలిపింది. 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్నది.
ఇక ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించింది. 2050 నాటికి ఈ సంఖ్య 9.7 బిలియన్లకు, 2080లో 10.4 బిలియన్లు, 2100 నాటికి11.2 బిలియన్లు దాటుతుందని అంచనా వేసింది. కాగా, వచ్చే 30 ఏండ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50 శాతానికిపైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లోనే ఈ అధిక జనాభా రేటు ఉంటుందని చెప్పింది.