NRI-NRT

సింగపూర్‌లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ శతావధానం

సింగపూర్‌లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ శతావధానం

సింగపూర్‌లో మునుపెన్నడూ చూడని విధంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ శతావధానం

త్రిభాషామహాసహస్రావధాని, “సప్త ఖండ అవధాన సార్వభౌమ” బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పంచదశ (15వ) శతావధానం “సప్తఖండ అవధాన సాహితీ ఝరి శీర్షికలో “శ్రీ వద్దిపర్తి అవధాన సౌరభం – సింగపుర సాహితీ సమాహారం” పేరిట అపూర్వ రీతిలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ మద్దూరి సుబ్రహ్మణ్య సత్యనారాయణ సంచాలకత్వంలో అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ శతావధానం కేవలం ఒకటిన్నర రోజులో (అవధాన సమయం రమారమి కేవలం 6.5 గంటల వ్యవధిలో) పూర్తి చేయడం సింగపూర్ సాహితీ చరిత మరువని సారస్వత ఘనత. ఇప్పటికే వారు ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా ఖండం (ఆస్ట్రేలియా), ఆసియా ఖండం (భారతదేశం, సింగపూర్, మలేషియా, ఖతార్), ఐరోపా ఖండం (యునైటెడ్ కింగ్ డమ్, లండన్), ఉత్తర అమెరికా ఖండం (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా), ఆఫ్రికా (దక్షిణ ఆఫ్రికా), దక్షిణ అమెరికా (కొలంబియా) ల నుండి సప్త ఖాండాలలో వివిధ దేశాలు పాల్గొనగా అష్టావధానలే కాక శతావధానాలు కూడా చేసి ఎన్నో ప్రపంచ రికార్డులను సృష్టించారు.
null

మొదటి రోజు 35 సమస్యలను, 40 ఆశువులను, 25 వర్ణనలను అప్రస్తుత ప్రసంగాలతో విరాజిల్లిన సభలో దాదాపుగా మొత్తం పూరణలతో పృచ్ఛకాళికి తమ పద్యరత్నాలను అందించారు. రెండవ రోజు మొదటిరోజు మిగిలిన పూరణలతో ధారణ కూడా వెనువెంటనే పూర్తి చెయ్యడం మరొకమారు వారు ధారణవేదావధాననిధి అని, విధిసతికి వారికి వైరుద్ధ్యమే లేదని నిరూపించింది.

పృచ్ఛకులుగా శ్రీమతి వి. రంగవేణి, స్నిగ్ధ ఆకుండి, గాడేపల్లి అపర్ణ, గాడేపల్లి మురళి, ప్రసన్న దేశిరాజు, దీపారెడ్డి, శ్రీకాంత్ కుమార్, రాధా శ్రీనిధి, లక్ష్మీ రామచంద్రన్, యడవల్లి శేషు కుమారి, భవ్యశ్రీ భువనగిరి నముడూరి, ప్రతిభ రెడ్డి, పావని చిలువేరు, శౌమిక్ పటోజు, కొడుకుల వెంకట సంజు, జంగా స్వాతి, సుమలత యదా, గార్లపాటి అనిత, ఫణి వెన్నెల, విజయ్ గుడిగుంట, రామ్ సుధ, కొడుకుల్ల సూర్య నారాయణ, ఆకుండి భాను గోపాల శర్మ, అలజంగి రాజు, సాయి మనోజ్, జయకుమార్, గుడిమెడ లీలా సౌజన్య, లక్ష్మీ(అచ్యుతప్రియా) పాల్గొన్నారు.
null

ఆద్యంతం హృద్యంగా ఆహ్లాదంగా సాగిన ఈ శతావధాన కార్యక్రమానికి ప్రత్యక్షంగా విచ్చేసిన ఆహూతులను, పరోక్షంగా అంతర్జాలంలో వీక్షిస్తున్న సాహితీప్రియులను ఉర్రూతలూగించేలా, గడియారమే గుర్తురానంత రసవత్తరంగా జరిగింది. నయనానందకరంగా ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రత్యక్షంగానూ, అంతర్జాలం లోనూ తిలకిస్తున్న సాహితీప్రియులు అచ్చెరువొందేలా భాషా ప్రేమికులు విస్మయం చెందేలా “అవధాన కళా మౌళి”, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పూరణ చేసిన 35 సమస్యలను 12 నిమిషాల్లో, 25 వర్ణనలను 8 నిమిషాలలో.. అనగా మొత్తం కేవలం 20 నిమిషాల్లో అత్యాశ్చర్యకరంగా, వాయువేగంతో ధారణ చేసారు. ప్రతి పద్యం ఒక ఆణిముత్యమనీ, పద్యాలన్నీ సాహితీ అభిమానులకు వీనులవిందుగా, సాధారణ ప్రేక్షకులకు ధర్మసందేశాలుగా, వేదపురాణేతిహాస భరితంగా, అమృతతుల్యంగా, సమకాలీన సామాజిక స్పృహను కూడా జతచేస్తూ, ఒక కావ్యాన్ని స్ఫురింపజేస్తూ అందించిన తీరు అత్యద్భుతం, అమోఘం అని, ఈ మహాధారణ, పద్యపూరణ అసాధారణం అంటూ అందరూ అవధాన సాహితీసుధారసం ఆస్వాదించారు
null
ఈ రెండు రోజులలో సాహితీక్రాంతులు వెదజల్లిన శతావధానం ఒక వారం క్రితమే జరిగిన సంక్రాంతి పండుగను మళ్ళీ తీసుకువచ్చినట్లుగా ముగ్ధమనోహరంగా, అంగరంగవైభవంగా జరిగింది. విజయోత్సవ సభలో పృచ్ఛకాళి అందరూ వారిని గౌరవప్రదంగా సన్మానించుకున్నారు.

తెలుగు భాషలో ప్రత్యేకమైన ప్రక్రియగా అవధానానికి ఉన్న స్థానం సుస్థిరం. అవధానిగా, కవిగా, సంగీతవేత్తగా, పౌరాణికులుగా, ప్రవచనకర్తగా, శ్రీ ప్రణవపీఠ స్థాపకులుగా, త్రిభాషా కోవిదులుగా అవధాన ఋషిమండలంలో విశిష్ట స్థానాన్ని పొందిన వశిష్టులు వద్దిపర్తి వారని అందరూ కొనియాడారు. వారి 14 శతావధానాలు స్వదేశంలోనే జరుగడంతో ఈ 15వ శతావధానం విదేశంలో జరిగిన వారి తొలి శతావధానం. కరోనా కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకొని, అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అపురూపంగా, అపూర్వంగా మలచుకున్న ఘనత వారికే దక్కుతుంది. వారి మనస్సంకల్పజనితమైన “సప్తఖండ అవధాన సాహితీ ఝరి” ఎన్నో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడం అందుకు నిలువెత్తు నిదర్శనం.
శ్రీ ప్రణవపీఠ శిష్యబృందం, సింగపూర్ నుండి ఆకుండి భాను గోపాల శర్మ, ఆకుండి స్నిగ్ధ, కొడుకుల్ల సూర్య నారాయణ, కొడుకుల్ల వెంకట సంజు, దేశిరాజు రవి, దేశిరాజు ప్రసన్న తదితరులు ఈ అపూర్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.
null