NRI-NRT

అమెరికా వీసా ధరలు పెంపు

అమెరికా వీసా ధరలు పెంపు

పర్యాటక, విద్యార్థి వీసా ఫీజులు పెరగనున్నట్టు అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

ఎన్నారై డెస్క్: అమెరికా వెళ్లాలనుకునేవారికి ఓ అలర్ట్! అమెరికా పర్యాటక, స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ఫీజులు పెరగనున్నాయి. కొత్త ధరలు మే 30 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వీసా ధరలు ఏ మేరకు పెరుగుతాయో వివరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. బిజినెస్, టూరిజం(బీ1/బీ2) వీసాలతో పాటూ స్టూడెంట్, ఎక్సేంజ్ విజిటర్ వీసాల ప్రాసెసింగ్ ఫీజులు 160 నుంచి 185 డాలర్లకు పెరుగుతాయి. ఇక హెచ్-1, ఎల్-1, ఓ, పీ, ఆర్ వీసాల ఫీజులు 205 డాలర్లకు పెరిగాయి. గతంలో ఇవి 190 డాలర్లుగా ఉండేవి. అంతేకాకుండా.. ట్రీటీ ట్రేడర్, ట్రీటీ ఇన్వెస్టర్, ట్రీటీ అప్లికెంట్స్(ఈ కేటగిరీ) వీసా ఫీజులు 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెంచినట్టు విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ పేంపు ఇతర కాన్సులార్ ఫీజులకు వర్తించదని కూడా ప్రభుత్వం పేర్కొంది.

ఇక గతేడాది అక్టోబర్ 1, ఆ తరువాత చెల్లించిన ఫీజులన్నీ మరో 365 రోజుల వరకూ చెల్లుబాటువుతాయని కూడా తెలిపింది. ఇక అక్టోబర్ 1కి ముందు చెల్లించిన ఫీజులు ఈ ఏడాది మర్చి 30 వరకూ చెల్లుబాటు అవుతాయని చెప్పింది. ఇందుకు అనుగుణంగా దరఖాస్తుదారులు సెప్టెంబర్ 30 లోపు తమ ఇంటర్వ్యలు ప్రీ షెడ్యూల్ చేసుకోవాలని, లేదా ఇంటర్వ్యూ వెయివర్ దరఖాస్తును సమర్పించాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. వలసల సేవల ఖర్చులు పెరగడంతోనే ఫీజులు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. బీ1, బీ2, హెచ్, ఎల్, ఓ, పీ, క్యూ, ఆర్, ఈ కేటగిరీ వీసాల ప్రాసెసింగ్ ఫీజులన్నీ పెరగనున్నాయి.