Agriculture

తుఫాన్ కు దెబ్బతిన్న పంటను ఏం చేస్తారు?: సీఎం జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు

తుఫాన్ కు దెబ్బతిన్న పంటను ఏం చేస్తారు?: సీఎం జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు

రామచంద్రపురంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ అధినేత,తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటన,జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు,ఈ
ముఖ్యమంత్రిని క్షమిస్తే పుట్టగతులు ఉండవని రైతులను హెచ్చరించిన చంద్రబాబు.

రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఏంచేస్తారు.. నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. తడిసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టిన ప్రదేశం వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకుని పొలం వేసి, అకాల వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికీ 40 నుంచి 50 శాతం పంట పొలాలు, కళ్లాల్లోనే ఉందని చెప్పారు. అకాల వర్షాల కారణంగా ఈ పంట దెబ్బతిందని, దీనిని ఏంచేస్తారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. గతంలో పంటలకు ఇన్సూరెన్స్ ఉండేదని, పంట నష్టపోతే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం చెల్లించేవని అన్నారు. జగన్ సర్కారు మాత్రం క్రాప్ ఇన్సూరెన్స్ తొలగించడంతో రైతులకు భరోసా లేకుండా పోయిందని విమర్శించారు. గతంలో రైతుల కోసం తాను అసెంబ్లీలో పోడియం దగ్గర కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం రాత్రికి రాత్రి స్పందించి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిందని గుర్తుచేశారు.

కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. ఎకరానికి 50 నుంచి 60 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే అందులో 30 బస్తాలు కౌలు కింద చెల్లిస్తున్నారని చెప్పారు. పంట నష్టపోవడంతో దిక్కుతోచని స్థితిలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దేశంలోనే కౌలు రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలలో ఏపీ రెండో స్థానంలో ఉందని చంద్రబాబు వివరించారు. జగన్ పాలనలో వరి సాగు చేసిన రైతులు ఉరేసుకునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఏప్రిల్ 1 నుంచే గోనె సంచులు పంపించాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా పంపలేదని, అరకొరగా పంపిన వాటిలోనూ నాణ్యతలేదని విమర్శించారు. ఇప్పటికే దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా.. 4.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం సేకరించిందని చెప్పారు. ఇందులోనూ పలు అవకతవకలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. పంటను సేకరించే క్రమంలో వివిధ కొర్రీలు పెడుతూ రూ.300 నుంచి రూ.600 వరకు కోత పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత కూడా ధాన్యం దింపుకోవడానికి ఒప్పుకోకపోవడంతో రైతులకు కష్టాలు తప్పట్లేదని అన్నారు.

తమ పాలనలో ధాన్యం సేకరణ విధానం సరళంగా ఉండేదని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యేదని చంద్రబాబు చెప్పారు. తాను సీఎంగా ఉన్నపుడు హరికేన్ తుఫాన్ వస్తే రాజమండ్రిలో పది రోజుల పాటు ఉన్న విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా రైతులకు గుర్తుచేశారు. ఈ రోజు రైతులు సంక్షోభంలో ఉన్నా కూడా సీఎం జగన్ తాడేపల్లిలోని తన ఇంట్లో నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులలో ఏ ఒక్కరూ రైతులను పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ కష్టపడి పని చేసిన రైతులకు ఉరితాడు వేస్తున్నాడంటూ జగన్ పై మండిపడ్డారు. బటన్ నొక్కడం కాదు.. జగన్ కు బొక్కడమే తెలుసని అన్నారు.

సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, ఇంకో కొడుకు ఎమ్మెల్యే.. వీళ్లంతా కలిసి రైతులను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. కష్టాలతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే వెంటనే స్పందించి ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి.. బాబాయిని చంపిన వారిని కాపాడే పనిలో బిజీగా ఉన్నాడని మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని క్షమిస్తే మీకు మళ్లీ పుట్టగతులు ఉండవని రైతులను చంద్రబాబు హెచ్చరించారు. జవాబుదారీతనం, బాధ్యత లేని ప్రభుత్వం దేశానికి అరిష్టమని చెప్పారు.

రైతుల తరఫున పోరాడుతున్న టేకుమూడి వెంకన్న అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. రైతుల కోసం వెంకన్న మీటింగ్ పెడితే పోలీసులు అతడిపై దాడి చేశారని అన్నారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులలో ఏ ఒక్కరినీ వదలబోమని చంద్రబాబు హెచ్చరించారు. వెంకన్నను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.