NRI-NRT

కోడి లేకుండానే చికెన్..అమెరికాలో అమ్మకానికి ఆమోదం

కోడి లేకుండానే చికెన్..అమెరికాలో అమ్మకానికి ఆమోదం

చికెన్ తినాలనిపిస్తే కోడి ఉండాలా.. చికెన్ ముక్క కొరకాలంటే కోడి కావాలా.. అదేంటి.. కోడి లేకుండా చికెన్ ఎలా దొరుకుతుంది? దీనికి సమాధానం చెప్పడం కాదు.. ఏకంగా చేసి చూపించేశారు అమెరికా శాస్త్రవేత్తలు. కోడితో పనిలేకుండానే చికెన్ ఒండుకోవచ్చని లొట్టలేసుకుంటూ తినొచ్చని చెబుతున్నారు.అవును… ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ సిద్ధమైంది. ఇలా సిద్ధం చేసిన కోడితో పనిలేని చికెన్ ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ముందుగా రెస్టారెంట్లలో ఈ అమ్మకాలు మొదలు పెట్టి.. ఆ తర్వాత సూపర్ మార్కెట్లలోనూ ఈ చికెన్ ను అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తుంది.

కాలిఫోర్నియాకు చెందిన “అప్ సైడ్ ఫుడ్స్” “గుడ్ మీట్” కంపెనీలకు.. చికెన్ ను కృత్రిమంగా తయారు చేసేందుకు వాటిని విక్రయించేందుకు అనుమతి లభించింది. గుడ్ మీట్ తయారీ భాగస్వామి అయిన “జోయిన్ బయోలాజిక్స్” కూడా మాంసాన్ని తయారు చేసేందుకు ఆమోదం పొందింది. ఈ కంపెనీల చికెన్ ఉత్పత్తులు మానవ వినియోగానికి సురక్షితమైనవిగా నిర్ధారించారు.ప్రయోగశాలలో కోళ్ల మూలకణజాలాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేశారు. అయితే పోషకాల విషయంలో కూడా ఈ కృత్రిమ చికెన్ తగ్గేదేలేదన్ని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కృత్రిమ మాంసం కూడా ఒరిగినల్ మాంసంతో సమానంగానే పోషకాలు కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో అవసరమైతే పోషకాలు విటమిన్లు ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదులను సైతం పెంచుకోవచ్చని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… పశువులు కోళ్ల పెంపకంతో పోలిస్తే ప్రయోగశాలలో వృద్ధి చేసే మాంసంతో ఎక్కువ గ్రీన్ హౌస్ ఉద్గారాలు విడుదలవుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. అవును… కృత్రిమ మాంసం వల్ల పర్యావరణానికి మేలు కన్నా కీడు ఎక్కువనే వాదన కూడా ఉంది.కృత్రిమ మాంసం తయారీకి అవసరమయ్యే ఇంధనాన్ని ఎలా ఉత్పత్తి చేస్తారనేదానిపై ఇది పర్యావరణానికి ఎంత మేలు చేస్తుందనేది ఆధారపడి ఉంటుందని బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ లించ్ తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.