WorldWonders

మొదటి వాణిజ్య అంతరిక్ష విమానంలో వర్జిన్ గెలాక్టిక్ విజయవంతమైంది

మొదటి వాణిజ్య అంతరిక్ష విమానంలో వర్జిన్ గెలాక్టిక్ విజయవంతమైంది

ఇకపై సాధారణ పౌరులూ అంతరిక్ష యాత్ర కు వెళ్లిరావొచ్చు. అదీ ఓ ప్రత్యేక విమానంలో. ఈ దిశగా అమెరికా లోని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ చేపట్టిన తొలి వాణిజ్య యాత్ర  విజయవంతంగా పూర్తయ్యింది. ‘గెలాక్టిక్‌ 01 (Galactic 01)’ పేరిట చేపట్టిన ఈ యాత్రలో భాగంగా టికెట్‌ కొనుక్కున్న ముగ్గురు ఇటలీవాసులపాటు ఒక వర్జిన్‌ గెలాక్టిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఇద్దరు పైలట్లు.. భూవాతావరణాన్ని దాటి, అంతరిక్షపు అంచుల్లో విహరించి వచ్చారు.తొలుత ‘వీఎంఎస్‌ ఈవ్‌’ వాహక నౌక.. ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ’ అనే అంతరిక్ష విమానంతో టెక్సాస్‌ నుంచి టేకాఫ్ తీసుకుంది. 44,500 అడుగుల ఎత్తులో ‘వీఎంఎస్‌ ఈవ్‌’ నుంచి ఆ ప్రత్యేక విమానం విడిపోయి ధ్వనికన్నా మూడు రెట్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే దాదాపు 85 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఇలా అంతరిక్ష సరిహద్దుల్లో చేరుకున్న ప్రయాణికులు కొద్ది నిమిషాల పాటు భారరహిత స్థితిని ఆస్వాదించారు. అనంతరం భూవాతావరణంలోకి ప్రవేశించిన ఆ ప్రత్యేక విమానం నేలపై క్షేమంగా ల్యాండ్‌ అయ్యింది.ఇదిలా ఉండగా.. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష పర్యటనకు భారీ డిమాండ్‌ నెలకొంది. ఇప్పటికే 800కుపైగా టికెట్లు విక్రయించినట్లు సంస్థ చెబుతోంది. ఇంతకీ ఒక టికెట్‌ ధరెంతో తెలుసా.. రూ.3.5 కోట్లకుపైమాటే! ఏటా 400 యాత్రలు నిర్వహించాలన్నది ఈ సంస్థ లక్ష్యం.